శ్రమైక జీవన సౌందర్య క్రాంతి

by Ravi |   (  Updated:2026-01-15 00:45:45  IST  )

శ్రమైక జీవన సౌందర్య క్రాంతి
X

పండుగ వేళ ప్రతి ఒక్కరు తమని చల్లగా చూడమని భగవంతుడిని ప్రార్థించే సందర్బాలు. ఒక్క సంక్రాంతి పండుగకు మాత్రం తమని చల్లగా చూసినందుకు ఇంటిని ధన ధాన్యాలతో నింపినందుకు దైవానికి కృతజ్ఞతలు చెప్పే సందర్భం. వ్యవసాయానికి వెలుతురు ఇచ్చిన సూర్యుడికి వర్షం కురిపించిన ఇంద్రుడికి పంట రూపంలో ధాన్యాన్నిచ్చిన భూమాతకు శారీరకంగా శ్రమించి సహకరించిన పశుగణానికి కృతజ్ఞతలు తెలపడం ఆనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయం. ఆ సంస్కృతి సంతకమే సంక్రాంతి. పుష్య మాసపు పుష్ప సౌరభాలు చలి గాలుల చక్కిలి గింతలు మత్యాలు చల్లినట్లు మంచు బిందువులు ప్రకృతిని అందగా ముస్తాబు చేస్తాయి.

సోయగాల పుష్యమి

సంక్రాంతి ఆక్షరాల ఆనందాల వెల్లువై రంగవల్లిలా మారి ఇంటి ముంగిటకు వస్తుంది. ఆందుకే ఇది పెద్ద పండుగ సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. పుష్య మాసం అంటే పోషణ శక్తి కలదని అర్థం. సిద్ధాంతులు దూదిని మంచులో ముంచి ఆ మర్నాడు దాన్నిపిండి ఆ పక్రియలో వచ్చిన నీటి చినుకుల్ని బట్టి వర్ష నిర్ణయం చేసేవారు. ఎన్ని చుక్కలు జారిపడితే అన్ని కుంచాల వాన కురుస్తుందని అంచనా వేసేవారు ‘సంక్రాంతి’ అంటే ‘చేరుట అని అర్థం. సూర్యుడు నెలకోసారి ఒక్కో రాశిని చేరుతుంటాడు. దీనినే సంక్రమణం అంటారు. ఈ సంక్రమణంలో భాగంగా పుష్య మాసంలో ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ పర్వకాలమే సంక్రాంతి. ఇదిమూడు రోజుల పర్వం .

భోగభాగ్యాల భోగి..

మూడు రోజుల ఈ పండుగలో తొలిరోజు పర్వం భోగి. ఇది దక్షిణాయనానికి, ధనుర్మాసానికి ఆఖరు రోజు. మకర సంక్రమణానికి పూర్వపు రోజు. రైతులకు పంట చేతికంది, భోగి నాటికి ఇంటికి చేరుకుంటాయి. కర్షకులకు వ్యవసాయ పనుల రద్దీ తగ్గి కాస్త విశ్రాంతికి వీలుచిక్కే సమయమిది. చేతికందిన పంటను అనుభవానికి తెచ్చుకుని భోగ భాగ్యాలు అనుభవించడానికి రైతులకు వీలు కలిగించే పండుగ కాబట్టి దీనికి భోగి పండుగ అనే పేరు వచ్చిందని ఒక కథనం. వ్యవసాయ ప్రాధాన్యత గల పల్లెల్లో నిరుపయోగంగా వున్న పాడైపోయిన వ్యవసాయ పనిముట్లు, కలపతో, తాటి ఆకులతో నిర్మించిన నివాసాలను శుభ్రపరచగా వచ్చిన వాటిని పేర్చి భోగిమంటలను వేస్తారు. ఈ భోగి మంటల్లో అవుపిడకలను వేయటం వల్ల శీతాకాలంలో ప్రబలే సూక్షజీవులను నిర్మూలించవచ్చు. ఆవు పేడని ముద్దలుగా చేసి ముగ్గుల మధ్యలో పెడతారు పెద్ద గొబ్బెమ్మని శ్రీకృష్ణునిగా చిన్న గొబ్బెమ్మలను గోపికలుగా భావిస్తారు. పాటలు పాడుతూ కన్నెపిల్లలు వాటి చుట్టూ తిరుగుతారు. అనువైన భర్తను ప్రసాదించమని ప్రార్దిస్తారు. ఆన్నమయ్య సంకీర్తనలలో సైతం గొబ్బిళ్ళ పాటలు ఉండటం గమనార్హం

పదండి పల్లె పిలుస్తోంది.. సంక్రాంతికి..!

ముంగిట్లో బహు ముచ్చటగా కనువిందు చేస్తూ నేలపై హరివిల్లులు విరిసాయంటే.. సూర్యుని రాక కంటే ముందే హరిదాసు కీర్తనర్తలు గోవిందనామాలతో వీనులవిందు చేస్తున్నాయంటే..అల్లంత దూరాన డూడూ బసవన్న ‘పట్టు శాలువా ధరించిన పండితుని’లా నిదానంగా కదిలి వస్తోంటే.. పూర్ణ గర్భిణుల్లా ఇళ్లలోని గాదెలు ధనధాన్యాలతో నిండుగా దర్శనమిస్తున్నాయంటే..ఇంకేముంది సంక్రాంతి వచ్చేసినట్లే.. పుష్య మాసపు పుష్పసౌరభాలు చలిగాలుల చక్కిలిగింతలు ముత్యాలు చల్లినట్లు మంచు బిందువులు ప్రకృతిని అందగా ముస్తాబు చేసాయి.

సంక్రాంతి ఆక్షరాల ఆనందాల వెల్లువై రంగవల్లిలా మారి ఇంటి ముంగిటకు వస్తుంది. ఆందుకే ఇది పెద్ద పండుగ అయింది. సంక్రాంతి పర్వాలు ప్రధానంగా మూడు అయితే, ఈ పండక్కి నెలముందు నుంచే సన్నాహాలు మొదలవుతాయి. పడుచులు ఇంటి ముంగిట అందమైన రంగవల్లులను నెల ముందు నుంచే తీర్చిదిద్దుతారు. పిల్లలు భోగిమంటల్లో వేయడానికి ఆవుపేడతో చేసిన పిడకల్ని నెల ముందునుంచే సిద్ధం చేసుకుంటారు. హరిదాసు కీర్తనర్తలు నెలపాటూ కొనసాగుతాయి.

మసక బారుతున్న మకర సంక్రాంతి ప్రాభవం

ప్రపంచీకరణ నేపధ్యంలో కార్పోరేట్ కారు చిచ్చులో కాంక్రీట్ అరణ్యాల మధ్య మన కళలు సంప్రదాయాలు సరదాలు కనుమరుగౌతున్నాయి. నట్టిల్లు నెట్టిలుగా మారింది. చరవాణి తెరవైపు వంచిన తల ఇలాతలంలో జరిగే ఈ సంబురంతో తమకి సంబంధం లేనట్లు ప్రవర్తిస్తోంది. బలవతంగా పల్లెకు వెళ్ళినా పల్లెలో కూడ ఇదే పరిస్దితి పల్లె అటలు, గాలిపటాలు ఎగరవేస్తూ స్నేహితులతో సరదాగా గడుపడం మర్చిపోయారు. జానపద కళాకారులు సైతం వాళ్ళ వేషాన్ని వాళ్ళ సాంప్రదాయాన్ని తప్పని పరిస్దితులలో వదిలేసి మరోమార్గాన్ని ఎంచుకుంటున్నారు. తెలుగు పంట పండుగ సంక్రాంతి కేవలం తెలుగు వారి గొప్ప పర్వమే కాదు.. సంస్కృతి సాంప్రదాయాలని, ఆచార వ్యవహారాలని, శ్రమైక జీవన సౌందర్యాన్ని సుసంపన్నం చేసిన పండుగ కూడా.

- వి. సుధాకర్

99898 55445

Next Story