ఆశావాదపు పతంగుల సం‘క్రాంతి’...!

by Ravi |   (  Updated:2026-01-15 01:00:17  IST  )

అన్నీ మారుతూనే ఉంటాయి. యుగాలుగా ప్రకృతి మనకు నేర్పుతున్న మహా పాఠం అదే.. మార్పు. పరిణామంతో స్నేహం చేస్తూ, ప్రకృతికి ప్రణామం చేస్తూ, చిరునవ్వుల వెన్నెలను మానవతా ఆకాశంలో రంగవల్లులుగా నింపుతూ జీవించడమే మన కర్తవ్యం.

ఆశావాదపు పతంగుల సం‘క్రాంతి’...!
X

అన్నీ మారుతూనే ఉంటాయి. యుగాలుగా ప్రకృతి మనకు నేర్పుతున్న మహా పాఠం అదే.. మార్పు. పరిణామంతో స్నేహం చేస్తూ, ప్రకృతికి ప్రణామం చేస్తూ, చిరునవ్వుల వెన్నెలను మానవతా ఆకాశంలో రంగవల్లులుగా నింపుతూ జీవించడమే మన కర్తవ్యం. బతకడం కోసం, మన అనుకున్న వారికి బతుకు ఇవ్వడం కోసం ఉద్యోగమో, వ్యాపారమో, ఉన్నత విద్యో, లక్ష్యమో.. పేరు ఏదైనా కావచ్చు. కాల చదరంగంలో కరెన్సీ పావుల మధ్య మనమంతా పల్లెలు దాటి, పట్టణాలు దాటి, ప్రాంతాలు దాటి, ఖండాలు దాటి ఎక్కడెక్కడికో ప్రయాణిస్తూనే ఉంటాం.

మనమంతా పరిస్థితులతో యుద్ధం చేస్తూ, మనం గెలవడానికి చేసే నిరంతర ప్రయత్నాల సముదాయమే కదా జీవితమంటే..! అప్పుడప్పుడు అనుబంధాల పేరిట, సంస్కృతి సాంప్రదాయాల పేరిట, పండగల పేరిట మనమంతా పల్లెలకు బయలుదేరుతాం. ఈ వారమంతా సంక్రాంతి రహదారుల వెంట ప్రయాణించి పల్లెల్లో సంబరాలకు సిద్ధమయింది..! ఈ పుష్యమాస బహుళ పక్షంలో సూర్యుడితో పాటు మనమంతా మకర రాశిలోకి మనకు తెలియకుండానే ప్రయాణించాం.

ఆధునికత మధ్య మూలాల అన్వేషణ..

శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుల మధ్య ఆచారాలు, ఆరోగ్య నియమాలు, ఆధ్యాత్మిక తరంగాలు, సాంస్కృతిక వారసత్వపు పరిమళాల మధ్య మూలాలకు సంబంధించిన అంతరాలు ఎన్నో ఉన్నప్పటికీ... అన్నింటిని పరిశీలిస్తూ, కొన్నింటిని పరిశోధిస్తూ ముందుకు వెళుతూనే ఉండాలి. సిద్ధాంతాల రాద్ధాంతాల పిడివాదాలను కాసేపు పక్కనపెట్టి మనసు విప్పి మాట్లాడుకుందాం. ఆటలాడుతూ పాటలు పాడుదాం. చిన్న పెద్ద తేడా లేకుండా చిందులు వేద్దాం. భోగి మంటల వెలుగులో అపజయాలను, అజ్ఞాన మూఢత్వాలను, కోపాలను, ద్వేషాలను స్వార్థపు మాలిన్యాలను, అరిషడ్వర్గాలను, అప్పుల బాధలను, బాధించే జ్ఞాపకాలను ఇంకా ఇలాంటి వెన్నో మాయం చేసేద్దాం. వాతావరణంలో వస్తున్న మార్పుల కనుగుణంగా నువ్వుల విశిష్టతను గుర్తిద్దాం. రోగ నిరోధకతను పెంచుకుందాం. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుందాం. రేగిపండ్లతో స్నానం చేసేద్దాం. పిండి వంటల పిలుపు వినిపిస్తుంది. రంగవల్లులు ఆహ్వానం పలుకుతున్నాయి.

జానపద కళలకు గౌరవిద్దాం!

పచ్చటి పొలాల్లో మట్టి వాసన మన మనసులకు ప్రశాంతతనిస్తుంది. నది పరవళ్లు ,కొబ్బరి తోటలు, కోనసీమ అందాలు, కొత్త కొత్త సినిమాలు.. చాలా విషయాలు.. ఎన్నెన్నో విశేషాలు.. పదండి తెలుసుకుందాం..! ఆస్వాదిద్దాం..! ఫీల్ పొందుదాం..! అంతరంగాల్లో అన్వేషణను కొనసాగిద్దాం. అలాగే పశువులను కాపాడుకుందాం. హరికథలు గంగిరెద్దుల కోలాటంతో మన జానపద కళలకు గౌరవిద్దాం. వినోదం చాటున కోడి పందాలు, పొట్టేళ్ల పందాల మధ్య వ్యాపారాత్మక భావనను తీవ్రంగా ఖండిద్దాం. కొత్త కొత్త పేర్లతో బంధాలను పిలుస్తూ, అనుబంధాల రాగాలను వినిపిస్తూ.. సకుటుంబ సపరివారంగా మూడు లేదా నాలుగు రోజులు వీలైనంతలో సందడి చేసేద్దాం. రైతుల ప్రాముఖ్యతను నవతరానికి తెలియజేద్దాం. ధాన్య రాశుల సిరి సంపదను పోగేసుకుందాం. మన ముందు తరాల వారిని కాసేపు గుర్తు చేసుకుందాం.

మనకు కాంతులు నింపే పండుగ..

సంక్రాంతికి సంబంధించిన పురాణాల ఇతిహాసాల కథలను తెలుసుకుందాం. ఆది శంకరులు, భగీరథుడు, బలి చక్రవర్తి, శ్రీమన్నారాయణ, ఉత్తరాయణం, గోదా రంగనాథుల కళ్యాణం, ఇంద్ర పొంగలి ఇలాంటివి చాలానే ఉన్నాయి. అంతర్జాతీయంగా దక్షిణాసియా దేశాలతో పాటు, మన దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో కూడా భిన్న పేర్లతో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఒక ప్రత్యేకమైన పండుగ భాష, యాస, సంస్కృతి ఆచారాల వంటి వాటిలో కొంత వైవిధ్యం ఉన్నప్పటికీ.. మన మధ్య ఆనంద కాంతులు నింపే పండగే సంక్రాంతి.

సాంప్రదాయాలను జ్ఞాపకాలుగా మలుచుకుందాం!

వినోదం విజ్ఞానం వికాసం వీటి మధ్య విషాదం లేకుండా జాగ్రత్త పడదాం. స్వేచ్ఛగా, పర్యావరణహితమైన పతంగులతో ఆశావాద దృక్పథాలను ఎగరవేద్దాం. ఆత్మవిశ్వాసపు శోభతో ప్రపంచాన్ని నింపేద్దాం. గాజు పొడి, రసాయనాలతో కోటింగ్ చేసిన ప్లాస్టిక్ లేదా నైలాన్ దారం ‘చైనీస్ మంజా’ నిషేదిద్దాం. మన అనాగరిక పనుల వల్ల పక్షులు, జంతువులకు హాని కలుగకుండా చూసుకుందాం. పర్యావరణానికి పచ్చటి చెట్లతో ప్రాణం పోద్దాం. మన సందడిలో రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షాకులు లేకుండా చూసుకుందాం. రసాయనాలు, ప్లాస్టిక్ లకు వీలైనంత దూరంగా ఉందాం. వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్‌, ఇన్స్టా గ్రామ్ రీల్స్‌లో, యూట్యూబ్ ట్రెండింగ్‌లో మన సాంప్రదాయాలను, సామరస్యాన్ని అందమైన జ్ఞాపకాలుగా మలుచుకుందాం. చల్లని చలితో వెచ్చని మనసుల మధ్య గతాన్ని గుర్తు చేసుకుంటూ, వర్తమానంలో జీవిస్తూ, భవిష్యత్ ప్రణాళికను రచించుకుందాం.

సంక్రాంతి సంకల్పం..

మనం గమనించాలే గానీ ప్రతి మార్పులో ఓ అర్థం ఉంటుంది. సూక్ష్మంగా శోధిస్తే అందులోని పరమార్థం అవగత మవుతుంది. సంక్రాంతిలో సంకల్పం ఉంది.. సందేశం ఉంది అన్నింటికీ మించి మన దేశ సంస్కృతి దాగి ఉంది. పతంగిలో నేర్చుకుంటే అవాంతరాలను దాటుకుంటూ ఎదిగే ఓ విశ్వాన్వేషణ పాఠ్యాంశం ఉంది. రంగవల్లిలో భావోద్వేగాల సమ్మిళితం దాగుంది. ప్రతీ సెకండ్ ఓ గుణపాఠమై కదులుతూనే ఉంటుంది మనలోనే జ్ఞాన గడియారంలో..! ఓకే ఫ్రెండ్స్.. నులివెచ్చని ఉషోదయ కిరణాల మధ్య సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుందాం. తీయటి మధుర జ్ఞాపకాలను మన గుండెల్లో నింపుకొని, పొట్ట చేత పట్టుకుని మళ్లీ బతుకు యుద్ధంలో స్వారీ చేయడానికి సిద్ధమవుదాం. హ్యాపీగా జర్నీ చేద్దాం. కుటుంబమంతా మరోసారి కలుసుకునేలా హ్యాపీగా పండుగ చేసుకుందాం.

(సంక్రాంతి శుభాకాంక్షలతో...)

-ఫిజిక్స్ అరుణ్ కుమార్

9394749536

Next Story