ట్రోలింగ్‌పై ఉమ్మడి స్వరం.. ఇక సహించం!

by Ravi |   (  Updated:2026-07-05 01:00:26  IST  )

మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పెరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్, ఆన్‌లైన్ వేధింపులు, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ, చట్ట అమలు వ్యవస్థ బాధ్యతలపై ఈ వ్యాసం చర్చిస్తుంది.

ట్రోలింగ్‌పై ఉమ్మడి స్వరం.. ఇక సహించం!
X

ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు సహజం. కానీ వాటిని వాదనలతో కాకుండా బూతులు, అపవాదులు, బెదిరింపులు, వ్యక్తిత్వ హననంతో ఎదుర్కోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. నేడు సోషల్ మీడియాలో ముఖ్యంగా మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల ఉద్యమకారులు, పరిశోధకులు ఇటువంటి ట్రోలింగ్‌కు ఎక్కువగా గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో గత నెల 19న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశం ప్రజాస్వామ్య విలువలకు మద్దతుగా నిలిచింది. జర్నలిస్టులు, మాజీ సంపాదకులు, సామాజిక విశ్లేషకులు, మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఒకే వేదికపై చేరి అసభ్య ట్రోలింగ్ సంస్కృతిని ఖండిస్తూ, ప్రజాస్వామ్య సంభాషణను కాపా డాలని పిలుపునిచ్చారు.

మార్పు కోరిన ప్రతీ గొంతు అవమానించబడిందే!

ఈ సమావేశం కేవలం నిరసన కాదు, ప్రజాస్వామ్యానికి ఒక హెచ్చరిక. జర్నలిస్టులు, మహిళలు, సామాజిక కార్య కర్తలపై జరుగుతున్న ఆన్‌లైన్ దాడులు వ్యక్తులపై మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలపైనా దాడులే.. ఈ సందర్భంగా పలువురు మహిళా జర్నలిస్టులు "మమ్మల్ని బూతులతో భయపెట్టలేరు. మార్ఫింగ్ ఫోటోలతో మౌనం చేయలేరు. బెదిరింపులతో వెనక్కి తగ్గించలేరు. మేము ప్రజా సమస్యలపై మాట్లాడుతూనే ఉంటాం" అనే ప్రకటన దేశవ్యాప్తంగా ట్రోలింగ్‌కు గురవుతున్న వేలాది మహిళలకు ఒక మానసిక బలం. చరిత్ర చెబుతున్నది ఒకటే. సమాజంలో మార్పు కోసం మాట్లాడిన ప్రతి గొంతు మొదట అవమానించబడింది. తర్వాత బెదిరించబడింది. చివరికి అదే గొంతు సమాజానికి మార్గదర్శకమైంది. అంతెందుకు మహిళా హక్కుల కోసం పోరాడిన వారిని ఎగతాళి చేశారు. కుల వివక్షను ప్రశ్నించిన వారిని దూషించారు. కానీ చరిత్రలో నిలిచింది ట్రోలింగ్ కాదు, నిజం కోసం నిలబడిన వారే.

ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదు?

ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతోంది. పోలీసులకు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నామని, ఉన్నతాధికారులను కలుస్తున్నామని, మహిళా కమిషన్‌కు, షీ టీమ్స్‌కు, సైబర్ క్రైమ్ విభాగా లకు నివేదిస్తున్నామని బాధితులు చెబుతున్నారు. అయినప్పటికీ పరిస్థితి ఎందుకు మారడం లేదు? అసభ్య ట్రోలింగ్ వెనుక రాజకీయ, ఆర్థికంగా బలమైన వ్యక్తుల అండదండలు ఉన్నాయా? అందుకే చట్ట అమలు సంస్థలు వెనుకంజ వేస్తున్నాయా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవు తున్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, పోలీసు వ్యవస్థపై ఉంది. అదే సమయంలో ఒక రాజకీయ నాయకుడు లేదా సినీ ప్రముఖుడిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య వచ్చినప్పుడు వేగంగా స్పందించే యంత్రాంగం, మహిళా జర్నలిస్టులపై నెలల తరబడి సాగుతున్న అసభ్య దాడుల విషయంలో ఎందుకు అదే చురుకుదనం చూపించడం లేదనే ప్రశ్నకు సమాధానం అవసరం. చట్టం అందరికీ సమానమైతే, రక్షణ కూడా అందరికీ సమానంగా ఉండాలి.

ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ..

ఈ సమావేశంలో వ్యక్తమైన మరో ముఖ్యమైన అంశం ఐక్యత. ట్రోలింగ్ లక్ష్యంగా మారిన వ్యక్తులను ఒంటరి వారిగా విడిచిపెట్టకూడదనే సంకల్పం. జర్నలిస్టు సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజాస్వామ్య హక్కుల సంస్థలు, పౌర సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వక్తలు ప్రస్తావించారు. వ్యక్తిగతంగా ఎదుర్కోలేని దాడులను సామూహికంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సంద ర్భంగా స్పష్టమైన సూచ నలు అవసరం. మహిళలపై ఆన్‌లైన్ హింస కేసులకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. సమన్వయంతో పనిచేసే ట్రోల్ నెట్‌‌వర్క్‌ లను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియా వేదికలతో సమన్వయం పెంచి నకిలీ ఖాతాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలి. పోలీసులకు సాంకేతిక వనరులు, శిక్షణ పెంచాలి. ముఖ్యంగా బాధితురాలే న్యాయం కోసం నిరంతరం పోరాడాల్సిన పరిస్థితిని మార్చాలి. సోషల్ మీడియా సంస్థలకు కూడా ఇది ఒక హెచ్చరిక. ప్రజాస్వామ్య చర్చకు వేదికలుగా ఉండాలంటే బాధ్యతాయుత విధానాలు అమలు చేయాలి.

చివరికి గెలిచేది ప్రజాస్వామ్యమే!

మహిళా జర్నలిస్టులకు, సామాజిక కార్యకర్తలకు ఓ సందేశం.. మీరు చేస్తున్న పని ప్రజాస్వామ్యానికి అవసరం. మీ ప్రశ్నలు సమాజానికి అవసరం. అందుకే మిమ్మల్ని మౌనంగా ఉంచేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ చరిత్ర చెబుతున్నది ఒక్కటే.. భయపెట్టేవారు కాదు, సత్యం కోసం నిలబడినవారే గెలిచారు. బూతులు, బెదిరింపులు, ట్రోలింగ్ తాత్కాలికం. "మేము భయపడము. మేము వెనక్కి తగ్గము. అసభ్య ట్రోలింగ్ సంస్కృతికి లొంగిపోము. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, స్వేచ్ఛా భావ ప్రకటన హక్కును రక్షించేందుకు, మహిళల గౌరవం కోసం, జర్నలిజం స్వాతంత్ర్యం కోసం మా పోరాటం కొనసాగుతుంది" అని మీరిచ్చిన సందేశం నేడు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలవాలి. ఎందుకంటే బూతులు చరిత్రను రాయలేవు. బెదిరింపులు సత్యాన్ని ఓడించలేవు. చివరికి గెలిచేది సత్యమే, నిలిచేది ప్రజాస్వామ్యమే.

-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్

[email protected]

Next Story