- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బహుజన చైతన్యానికి డిజిటల్ వేదిక!
సోషల్ మీడియా రాజకీయాల్లో ఎలా కొత్త శక్తిగా అవతరించిందో, అభిషేక్ దీప్కే ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ యువతలో ఎందుకు సంచలనం సృష్టించిందో, బహుజన చైతన్యం, సామాజిక న్యాయ ఉద్యమాలకు డిజిటల్ వేదికలు ఎలా దోహదపడుతున్నాయో ఈ విశ్లేషణలో తెలుసుకోండి.

ప్రపంచ చరిత్రలో ప్రతి యుగానికి ఒక ఆయుధం ఉంటుంది. ఒకప్పుడు రేడియో, టెలివిజన్‌లు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేశాయి. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆ స్థానాన్ని మొబైల్ ఫోన్ ఆధారిత సోషల్ మీడియా ఆక్రమించింది. ఇటీవల దళిత యువకుడు అభిషేక్ దీప్కే ఆన్లైన్ వేదికగా ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఓ కేసులో నిరుద్యోగ యువతను బొద్దింకలు”, “పరాన్న జీవులు”తో పోల్చడంతో వెబ్ పేజీలో సీజేపీ ప్రారంభమైనది. పార్టీ ప్రారంభించిన గంటల వ్యవధిలో ప్రధాన రాజకీయ పార్టీలకు మించి ఫాలో అయ్యారు. ఐదు రోజుల వ్యవధిలోనే రెండు కోట్ల మంది దృష్టిని ఆకర్షించడం ఇన్‌స్టాగ్రామ్ చరిత్రలోనే అరుదైన విషయం. ఇది కేవలం ఒక సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే కాదు, దేశం ఎదుర్కొంటున్న సంక్షోభానికి యువతలో విస్ఫోటనంలా పేలిన అసంతృప్తి జ్వాలలు. మొన్న డీప్కే ప్రారంభించిన సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారంపై పెద్ద ఎత్తున ధర్నాకు దిగింది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రజా సమస్యలపై ఉద్యమాలకు, వీధి పోరాటాలకు పునాది వేయగల శక్తిగా మారిందని నిరూపించింది.
సోషల్ మీడియా నూతన ఆయుధం!
ఈ దేశంలో చారిత్రకంగా నిర్లక్ష్యం కాబడ్డ బీసీ, ఎస్సీ, ఎస్టీలు జనాభాలో మెజారిటీ అయినప్పటికీ.. సామాజిక, రాజకీయ, ఆర్థిక శక్తిలో వారి ప్రాతినిథ్యం అంతంత మాత్రమే. ప్రధాన మీడియా సైతం వారి సమస్యలను ప్రస్తావించడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా బహుజన వర్గాల మధ్య అవగాహన పెంచే, వారిని సంఘటితం చేసే ఒక ప్రభావవంతమైన సాధనంగా మారింది. ఒకప్పుడు చైతన్య కార్యక్రమాలు గ్రామ సభలు, సమావేశాలు, కరపత్రాలకే పరిమితమయ్యేవి. నేడు ఒక మొబైల్ ఫోన్ ద్వారా లక్షల మందిని చేరుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా బహుజన చరిత్ర, సామాజిక ఉద్యమాలు, రాజ్యాంగ విలువలు, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై విస్తృత చర్చలు నిర్వహించవచ్చు. ఆధిపత్య కులాలు, వారి పార్టీలు సోషల్ మీడియా కేంద్రంగా అనేక తప్పుదోవ పట్టించే సమాచారాన్ని డంప్ చేస్తున్నారు. దాన్నే బహుజన వర్గాలు అనుస రిస్తున్నారు తప్ప, అభిముఖంగా దీటైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు మనీ, మీడియా, మాఫియాతో రాజకీయాలను శాసిస్తున్న కొన్ని ఆధిపత్య వర్గాలకు అభిముఖంగా ఆన్‌లైన్ వేదికగా దీప్కే ప్రారంభించిన కాక్రోజ్ జనతా పార్టీ సవాల్‌గా నిలిచింది. భారత రాజకీయ చరిత్రలో కేవలం సోషల్ మీడియా వేదికగా పురుడుపోసుకొని ఇంతటి తీవ్రమైన ప్రజా ఉద్యమంగా మారిన సందర్భం మరొకటి లేదు.
సోషల్ మీడియా ప్రజాస్వామ్య శక్తి!
నేటి రాజకీయాల్లో సోషల్ మీడియా ఒక కొత్త యుద్ధ భూమిగా మారింది. ఇది రాజకీయ ప్రచారం కోసం మాత్రమే కాదు. ఇది అట్టడుగు వర్గాల సామాజిక న్యాయం కోసం పోరాడే వేదిక కూడా. ప్రధాన మీడియా విస్మరించిన అనేక సమస్యలు, కుల వివక్ష, సామాజిక అసమానతలు, అణచి వేతలు, అన్యాయాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. చైతన్యవంతమైన ఓటరును నిర్మించడంలో, ప్రజల్లో రాజకీయ అవగాహన పెంచడంలో, ప్రత్యామ్నాయ ఆలోచనలను వ్యాప్తి చేయడంలో దీని పాత్ర మరింత పెరగనుంది. ఆన్‌లైన్ చైతన్యం, ఆఫ్‌లైన్ ఉద్యమాలతో కలిసినప్పుడే శాశ్వత మార్పు సాధ్యమవుతుంది. నేటి ప్రపంచంలో ఒక పోస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించగలదు, ఒక హ్యాష్‌ట్యాగ్ లక్షల మందిని ఏకం చేయగలదనీ, అది ప్రజల చేతుల్లో ఉన్న ఒక ప్రజాస్వామ్య శక్తి అని అభిషేక్ దీప్కే నిరూపించాడు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా శకాన్ని వాడుకుంటూ బహుజన ఐక్య పోరాటాలకు పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది.
- సంపతి రమేష్
సామాజిక విశ్లేషకులు
79895 79428






