ఉద్యోగ కల్పనకు చిన్న పరిశ్రమలే దిక్కు!

by Ravi |   (  Updated:2025-10-28 01:15:51  IST  )

ప్రపంచవ్యాప్తంగా మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్‌లే ఆర్థిక అభివృద్ధి పరంగా మొత్తం పారిశ్రామిక రంగానికి ఇంజన్‌లాగా పనిచేస్తున్నాయని ఆర్థికవేత్తలు గుర్తించారు.

ఉద్యోగ కల్పనకు చిన్న పరిశ్రమలే దిక్కు!
X

ప్రపంచవ్యాప్తంగా మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్‌లే ఆర్థిక అభివృద్ధి పరంగా మొత్తం పారిశ్రామిక రంగానికి ఇంజన్‌లాగా పనిచేస్తున్నాయని ఆర్థికవేత్తలు గుర్తించారు. 145 కోట్ల మంది జనాభా గల మన దేశంలో పేదరికం పోవాలన్నా, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, ఆదాయ అసమానత్వం తగ్గాలన్నా.. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు MSMEల అభివృద్ధితోనే సాధ్యం.

మన దేశంలో ఎప్పటి నుంచో అంటే 1905 స్వదేశీ ఉద్యమం ద్వారా చేపట్టిన కుటీర పరిశ్రమల స్వదేశీ ఉత్పత్తులను అభి వృద్ధి పరచుకునేందుకు ఆనాడు స్వాతంత్య్ర సంగ్రామాన్నే నడిపించడం జరిగింది.

97% ఉద్యోగ కల్పన వాటి నుంచే..

ఈ MSMEల ద్వారా నేడు మనదేశంలో 97% ఉద్యోగ కల్పన జరుగుతున్నది. భారీ పరిశ్రమల ద్వారా కేవలం 3 శాతం మాత్రమే ఉద్యోగిత ప్రజలకు లభిస్తున్నది. కుటీర పరిశ్రమల రంగంలో ప్రస్తుతం దేశంలో 6.3 కోట్ల సంస్థలు ఎనిమిది వేల రకాల ఉత్పత్తులను చేస్తూ మన స్థూల జాతీయ ఉత్పత్తికి 30 శాతం కల్పిస్తున్నాయి. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో ఇది 33 శాతంగా ఉంది. ఈ పరిశ్రమలన్నీ అసంఘటిత రంగంలో ఉన్నాయి. వీటిని సంఘటిత పరచి ఆర్థిక పరమైన సాంకేతిక పరమైన తదితర సబ్సిడీలు కల్పిస్తే చిన్న తరహా పరిశ్రమలు ఉపాధి కల్పనలో ఆదాయాలు పెంపొందించడంలో దేశంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి.

నిరుద్యోగాన్ని నిర్మూలించలేని వ్యవస్థ..

అభివృద్ధి అంటే అందరి వృద్ధి.. అంతేగాని కొందరి వృద్ధి మాత్రం కాదని గాంధీజీ అన్నారు. దేశ ఆదాయం ఎంత అనేది ముఖ్యం కాదు.. ప్రజలకు కనీస అవసరాలు అయినా తిండి, బట్ట, విద్య, వైద్యం ఏ మేరకు పొందగలుగుతున్నారు అనేది ముఖ్యం అన్నారు. ప్రభుత్వాలు ప్రజల సేవకులుగా పనిచేయాలి కానీ.. పెత్తందారులుగా ప్రజలపై జులుం చేయించకూడదు అన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా పాలన చేసేదే రాజ్యం. గాంధీజీ ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థ నిరుద్యోగాన్ని నిర్మూలించలేదు. పరిపాలన విధానాలు చట్టాల ద్వారా అందరికీ క్షేమం అనిపించేదే రాజ్యం.

ప్రజల కోసమా, పెట్టుబడిదారుల కోసమా?

1920లో బ్రిటిష్ పెట్టుబడిదారులను వ్యతిరేకించిన భారతీయ పెట్టుబడిదారులు తర్వాత వారితో లాలూచీ పడ్డారు. అందుకే స్వదేశీ, విదేశీ ఫైనాన్స్ పెట్టుబడిదారులు చారిత్రక నేపథ్యం తెలుసుకోకుండా.. వారి స్వలాపేక్ష విధానాన్ని అర్థం చేసుకోకుండా మన ఆర్థిక వ్యవస్థను పెట్టుబడిదారులకు అప్పగించడం ఎంతవరకు సమంజసమో? పాలకులు ఆలోచించాలి. తాము ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ప్రజల కోసమా, పెట్టుబడిదారుల కోసమా? అన్న ప్రశ్న వేసుకోవాలి. రోజురోజుకు ప్రస్తుత పాలకులు గాంధీజీ ఆర్థిక విధానాలకు ఎంత దూరం అవుతున్నారో గమనించాలి.

పెద్ద పరిశ్రమల వైపే ప్రభుత్వాల చూపు..

పెద్ద పరిశ్రమల్లో కోటి రూపాయల పెట్టు బడికి ఒకరికి ఉద్యోగం వచ్చేదే కష్టం. అదే కో‌టి రూపాయలను చిన్న తరహా కుటీర పరిశ్రమలో పెడితే పదిమందికి పైగానే ఉద్యోగాలు కల్పించవచ్చు. దేశం అభివృద్ధి చెందాలంటే పెద్ద ప్రాజెక్టులు మాత్రమే కాదు చిన్న పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాలి. కానీ ప్రభుత్వాలు దృష్టి అంతా పెద్ద పరిశ్రమల వైపే పోతుంది. నేటి ఆర్థిక విధానాలన్నీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో జరిగి ఉత్పత్తులు గణనీయంగా పెరిగినప్పటికీ మానవ శ్రేయస్సు పెంపొందించలేకపోవడం శోచనీయం.

ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం కరువు..

పెద్ద పరిశ్రమలకు అంతర్జాతీయ సంస్థలకు ఒకదాని తర్వాత ఒకదానికి ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, భూములు, టారిఫ్‌లు, రాయితీలు లభిస్తున్నాయి. అదే సమయంలో కోట్లాది ఉద్యోగాలు కల్పించే ఎంఎస్ఎంఈలు (చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమలు) ప్రోత్సాహా లు లేక మూతపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ప్రాజెక్టులకు ప్రభుత్వం అంది స్తున్న అనేక ప్రోత్సాహకాలు ఈ చిన్న పరిశ్రమలకు కూడా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు కేటాయించే భూముల్లో 80 శాతానికి పైగా భూములు మెగా ప్రాజెక్టులకు భారీ పరిశ్రమలకు దక్కుతున్నాయి. చిన్న పరిశ్రమలు భూమి కోసం సంవత్సరాలు తరబడి ప్రభుత్వ ఆఫీసులో చుట్టూ తిరగాల్సి వస్తోంది.

వందల్లో మూతబడుతున్నాయి..

అలాగే పెద్ద పరిశ్రమల వారికి విద్యుత్ ఛార్జీలలో రాయితీలు, సర్దుబాట్లు, సత్వర కనెక్షను, అభివృద్ధి చార్జీల మినహాయింపు తదితర ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ఉత్పత్తి పద్ధతులు, ఎంపిక, ఉద్యోగ కల్పన ఆవశ్యకతను పాలకులు గుర్తించకపోతే పారిశ్రామిక పాలనాపరమైన విధానాలు ఇలాగే ఉంటాయి. ప్రతి సంవత్సరం వందల ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతబడుతున్నాయి. దీనికి కారణాలు మార్కెట్‌తో పోటీ చెల్లింపులు ఆలస్యం, ఫైనాన్స్ లోపం బ్యాంకుల కఠిన విధానాలు, పెరిగిన విద్యుత్ ఛార్జీలు. పెద్ద కార్పొరేట్లకు ఓటిఎస్ అప్పు మాఫీలు లభిస్తే ఎంఎస్ఎంఈలకు అలాంటి అవకాశాలు లేవు. ప్రతి బడ్జెట్‌కు ముందు ప్రభుత్వం, చాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్థిక నిపుణులతో చర్చలు చేస్తుంది. కానీ ఎంఎస్ఎంఈ యాజమాన్యాలు, రోజువారీ పోరాటం చేస్తున్న పరిశ్రమలు గ్రామీణ పారిశ్రామిక వేత్తలకు ఆ అవకాశం లేదు.

భారత ఆర్థిక స్వరూపానికి పునాది అవే..

ఎంఎస్ఎంఈలే భారత ఆర్థిక స్వరూపానికి పునాది అని గాంధీజీ ఆనాటి అభిప్రాయం. ఈ రోజుకి కూడా ఈ చిన్న తరహా కుటీర పరిశ్రమలు రిజిస్టర్ కాబడినవి మనదేశంలో 5.93 కోట్ల యూనిట్లు ఉన్నాయి. వీటిలో 25 కోట్ల మంది పనిచేస్తున్నారు. ఇవి చేసే ఉత్పత్తులలో, మన విదేశీ వాణిజ్యంలో 45.73 శాతంగా ఉన్నది. అయితే నేడు కష్టాల్లో ఉన్న ఎంఎస్ఎంఈ యాజమాన్యాల ఇబ్బందులు ప్రభుత్వం వినాలి. వాస్తవ పరిస్థితుల ఆధా రంగా ఎంఎస్ఎంఈల అభివృద్ధికి పాల సీలు రూపొందించాలి. అప్పుడే మన ప్రధాని కోరుకున్నట్లుగా నిజమైన ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా పథకాలు విజయవంతం అవుతాయి.

-డాక్టర్. ఎ. నాగరాజ నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్,

98663 22172

Next Story