యువ ఇంజనీర్లకు ఆదర్శం!

by Disha edit |
యువ ఇంజనీర్లకు ఆదర్శం!
X

నిజాయితీతోనే నిర్భయం. నిర్భయంతోనే సృజనాత్మకత. సృజనాత్మకతతోనే అవిష్కరణలు. ఆయన అవిష్కరణలే ఎందరికో జీవనాదారం. ఆయన ఎవరో కాదు ప్రముఖ ఇంజనీర్, భారతరత్న కీ.శే మోక్షగుండం విశ్వేశ్వరయ్య! ఆయన జన్మదినాన్ని మనమందరం ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకుంటాము. ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన వారు. ఆయన పూణె సైన్స్ కాలేజీ నుండి సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. తన 23వ యేట బొంబాయి ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరాడు, తర్వాత భారత నీటిపారుదల కమిషన్ లో పనిచేసి దక్కను ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు. 1903లో మొదటిసారిగా పుణె దగ్గరి ఖడక్‌వాస్లా ప్రాంతంలో నీటిని నిల్వచేయగలిగిన ఆటోమాటిక్ వరద గేట్లను రూపొందించారు.

1906లో యెమెన్‌లోని ఆడెన్‌కి ప్రాంతంలో నీటి పారుదల వ్యవస్థనూ, మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేశారు. విశాఖపట్నం రేవును కోత నుండి రక్షించడంలో ఆయన పాత్ర, కృష్ణరాజసాగర్ ఆనకట్ట, హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి రక్షించడానికి మూసినదిపై ఒక ఆనకట్ట, రెండు జలాశయాలను తీర్చి ఇటు త్రాగునీరు, అటు మురుగునీరు వ్యవస్థకు శాశ్వత పరిష్కారం కనుగొన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో పూర్తయిన నిర్మాణాలు, భవనాలు, ఆనకట్టలు, రోడ్లు, త్రాగునీరు సరఫరా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.

నాణ్యత ప్రమాణాలు తెలియకుండా..

ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం ఎంతమంది ప్రభుత్వ ఇంజినీర్లు పనిచేస్తున్నారు? ఒక రోడ్డు నిర్మాణం పూర్తైన తర్వాత కనీసం 15 -25 సంవత్సరాల వరకు చెడిపోకుండా ఉండాలి. ఒక భవనం, వంతెన నిర్మాణం ఒక మనిషి పూర్తి జీవిత కాలం ఉండాలి. ఎక్కడైతే నాణ్యమైన నిర్మాణాలు జరిగితే, అక్కడ ప్రజల జీవనవిధానాలలో మార్పు కనబడుతుంది, ఆ దేశం అభివృద్ధి సాధిస్తుంది. దేశాభివృద్ధి ఇంజనీర్ల చేతుల్లోనే ఉంటుందని 100 సంవత్సరాల క్రిందనే విశ్వేశ్వరయ్య చెప్పారు. ప్రతి యేటా దేశ, రాష్ట్ర బడ్జెట్‌లో సగభాగం ప్రజల మౌలిక సదుపాయాలకు కేటాయిస్తారు. అయినా మన నిర్మాణాలు మన్నిక లేకపోవడంతో డబ్బు వృధా అవుతోంది.

ప్రపంచమే గర్వించదగ్గ ఇంజనీర్ విశ్వేశ్వరయ్య పుట్టిన దేశంలో, ఇంకా కొంతమంది పాలకులకు అభివృద్ధి పనుల నాణ్యత ప్రమాణాలు గురించి తెలియకపోవడం మన దురదృష్టకరం. ప్రస్తుత పాలకులకు అవసరమున్నా, లేకున్నా పనుల ప్రారంభానికి తొందర చేస్తారు. కాంట్రాక్టర్‌పై వత్తిడి తెస్తారు. పైగా ప్రతి ప్రభుత్వ పనిమీద 5 నుండి 10 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారు. వారికి ఎదురు చెప్పడానికి ఇంజనీర్లు సాహసించకపోవడంతో పనిలో ఆశించిన నాణ్యత రావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో నేటి ఇంజనీర్లలో చిత్తశుద్ధి లోపించింది. ఎక్కువగా కమీషన్లను ఆశించే ప్రభుత్వ ఇంజనీర్లు ఉన్న వ్యవస్థలో మంచి పేరున్న కాంట్రాక్ట్ సంస్థలు పెట్టుబడులు పెట్టి పని చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వంలో కొంతమంది కమీషన్లు ఇచ్చే గుత్తేదారులని ప్రోత్సహించి వారికి పెద్ద పీఠ వేశారు. దీంతో నిజాయితీగా నాణ్యతగా పనిచేసి, కమీషన్లు ఇవ్వని మంచి గుత్త సంస్ధలకు ఈ రోజు మనుగడ ప్రశ్నార్థకమైంది. అందుకే ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతున్న జాబితాలోనే ఉంది. మనకు ప్రశ్నించే శక్తి లేక మనం సర్దుకుంటూ, సర్దుకోని బతకమని మన పిల్లలను ఖండాలు దాటిస్తున్నం.

ఆయన జీవితం నేర్పిన పాఠాలు..

ఇంజనీర్ ఒక లక్ష్యంతో, ఎంతో కష్టపడి ఒక ఇంజనీరుగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఎటువంటి పక్షపాతము వహించకుండా, సాధ్యమైనంతవరకు, శక్తి మేరకు అందరికీ న్యాయం జరిగేలా వ్యవహరించాలి. నేడు కొంతమంది ఉద్యోగుల అనధికార ఆస్తులను చూసి అవినీతి నిరోధక శాఖ సైతం ఖంగుతింటున్నారు. ప్రతి ప్రభుత్వ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రభుత్వ సేవల గురించి ఖచ్చితంగా ఉద్యోగములో ప్రవేశించే ముందు విధిగా తెలుసుకోవాలి. వారు నిజాయితీగా చేసిన సేవలు వృధాకావు. ఎందుకంటే అది ప్రకృతి ధర్మం, ఏదో ఒక రూపంలో మనకు చేరుతుందని విశ్వేశ్వరయ్య వందేళ్ళ ఆదర్శ జీవితం మనకు అద్దం పడుతుంది. ఇది నిజం, మనం వ్యవస్థను మార్చలేము. మనమే ఎవరికి వారమే మారాలి. మన బాధ్యతలను నెరవేరుస్తూ, దేశం నిర్దేశించిన నియమాల ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడే మన దేశం శక్తివంతంగా ఎదుగుతుంది.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య కష్టించి పని చేసేవారు. ఆయన ఒక పరోపకారి, దేనినైనా నిశితంగా ఆలోచించేవారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో చేరి, 35 సంవత్సరాలు తన సేవలు అందించి, జవాబుదారీగా ఉంటూ, ఎటువంటి అవినీతికి, అక్రమాలకు పాల్పడకుండా ఉంటే రిటైరుకు ముందు, తర్వాత కూడా సాఫీగా, నిర్భయంగా జీవించవచ్చునని నేర్పారు. ఆయన చివరి వరకు తన సేవలను అందిస్తూ 101 సంవత్సరాలు జీవించి 1962 ఏప్రిల్ 12న తుదిశ్వాస విడిచారు. ఈనాటి యువ ఇంజనీర్లకు ఆయన జీవితమే ఒక పాఠం.

(నేడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి)

-సోమ శ్రీనివాస్ రెడ్డి

ఛైర్మన్, కంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్

98483 86801

Next Story

Most Viewed