మేధావుల మౌనం సమాజానికి శాపం...!

by Disha edit |
మేధావుల మౌనం సమాజానికి శాపం...!
X

దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల మౌనం సమాజానికి శాపం కాకూడదు. సమాజ హితం కోరి రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మేధావులపై ఉంది. గత ప్రభుత్వంపై మేధావుల ముసుగులో అసత్యాలను, అర్థసత్యాలను నూరిపోసి ప్రజల మనస్సులను కలుషితం చేశారు. దీనివల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఇంకా గుర్తించినట్లు లేదు. ఎన్నికల ప్రకటన విడుదలైంది. కనీసం ఇప్పుడైనా వాస్తవాలను నిర్భయంగా చెప్పగలిగే మేధావులు ముందుకు రావాలి.

ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా జీవించాలన్నా, లేక బానిసత్వంలో కూరుకు పోవాలన్నా అందుకు మేధావుల ఆలోచనలు ప్రభావితం చేస్తాయి. ప్రతి వ్యక్తి మీద ఏదో ఒక సిద్ధాంత ప్రభావం ఉంటుంది. కొందరు మేధావులు తాము కట్టుబడిన సిద్ధాంతానికి అనుగుణంగా ఆలోచనలు చేస్తారు. వారి ఆలోచనలకు విరుద్ధంగా పాలకుల పనితీరు ఉంటే విమర్శించడం సహజం. కానీ ఆ విమర్శలను సహృదయంతో స్వీకరించకుండా వారిపై ఏదో ఒక ముద్రవేసి వారి నోళ్ళు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముద్రలకు భయపడి చాలా మంది మేధావులు తమ నోళ్ళు కుట్టేసుకొంటున్నారు. కొందరు బూజు పట్టిన సిద్ధాంతాలను పట్టుకొని ఇప్పటికీ వేలాడుతున్నారు. అలాంటి వారి ఆలోచనా విధానాల్లో మార్పు రాకపోతే మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుంది.

నచ్చిన వారికి భజనలు

కొంతమంది మేధావులు వ్యక్తపరిచే అభిప్రాయాలు చూస్తుంటే గోడమీద పిల్లులను తలపిస్తుంది. వారి వాదనల్లో ఏది సత్యమో, ఏది అసత్యమో తేల్చడం కష్టమవుతుంది. ఇలాంటి కుహనా మేధావుల వల్ల సమాజానికి చేటు తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. సమస్య తీవ్రతను బట్టి లోతుగా విశ్లేషించడం మానేశారు. నిజమైన మేధావులు తమకు తెలిసిన విషయాలను నిర్భయంగా చెప్పడానికి ఏమాత్రం సంకోచించరు. కానీ ఇందుకు విరుద్ధంగా కొందరు మిడిమిడి జ్ఞానంతో రాజకీయ రంగంలోకి చొరబడి వారికి నచ్చిన వారికి భజనలు చేస్తున్నారు. ఆయా పార్టీ నేతల మెప్పు పొందేందుకు తాపత్రయపడుతున్నారు. తద్వారా ఏదైనా లబ్ధి చేకూరకపోతుందా అని ఆశపడుతూ తమ ఆలోచనలను అమ్ముకుంటున్నారు. వాస్తవాలను ప్రజల ముందుంచడానికి సంకోచిస్తే సామాన్యులు గానే మిగిలిపోతారు.

పాలకపక్షానికి అద్దె మైకులు

కొన్ని ఛానల్స్‌లో విశ్లేషకులు, తటస్థుల ముసుగులో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. ఇలాంటి వారు పాలకపక్షానికి అద్దె మైకులుగా మారారు. ఆయా అంశాలపై అవగాహన ఉన్నా, లేకపోయినా నిస్సిగ్గుగా తమ వాదనలను వండివారుస్తున్నారు. అనుభవజ్ఞులు కూడా కేవలం స్వార్ధబుద్ధితో అబద్ధాలను నిజాలుగా, చెడును మంచిగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వీరు ప్రవచించే నీతులు, సుద్దులతో నిజాలు మరుగున పడుతున్నాయి. నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చెప్పడానికి మేధావులు ముందుకు రాకపోతే ప్రజలకు నష్టం చేసినవారు అవుతారు. దీని వల్ల ఉగ్రవాదులు వల్ల వచ్చే ప్రమాదం కన్నా, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న వారి వల్లనే ప్రమాదం పొంచి ఉంది.

కనీసం ప్రశ్నించకపోతే ఎలా?

కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలను జనంపై రుద్దుతున్నారు. మంచిని మంచిగా, చెడును చెడుగా చెప్పకుండా అధికార పక్షాల చంకనెక్కి తాము చెప్పిందే వేదమంటున్నారు. సమాజ హితం కోసం, సమసమాజ నిర్మాణం కోసం పనిచేసే మేధావుల సంఖ్య తగ్గిపోయింది. నిరంతరం ప్రభుత్వ పని తీరును ప్రశ్నించే పరిపక్వత, చైతన్యం ప్రజల్లో ఉండాలి. పాలనలో ప్రజాస్వామ్య పద్ధతులకు పాతరేసినప్పుడు పౌరసమాజం, మేధావి వర్గం, సామాజిక కార్యకర్తలు ప్రశ్నించడంలో చురుగ్గా వ్యవహరించాలి. స్వేచ్ఛకోసం, సమానత్వం కోసం, హక్కుల సాధన కోసం ప్రశ్నించకపోతే ఎలా? యువతకి భవిత ఉండదు, ప్రగతి అంతకన్నా ఉండదు. ప్రశ్నించడం మొదలుపెడితేనే బానిసత్వం నుంచి బయటపడతారు.

ఒక్క రాజధానికీ గతి లేదు

రాజధాని అమరావతిలో నిర్మాణాలన్నీ గ్రాఫిక్స్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ ల్లోనే శాసనసభ సమావేశాలు, అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మూడు రాజధానులు కాదు కదా.. ఒక్క రాజధానిని కూడా కట్టలేదు. దీనిపై మేధావులు నోరు విప్పాలి కదా. పింక్ డైమండ్, డీఎస్పీ ప్రమోషన్లపై తప్పు దారి పట్టించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని, అసలు నిర్మాణాలే పూర్తికాలేదని దుష్ప్రచారం చేశారు. గత ప్రభుత్వంలో పోలవరం నిర్మాణం 72 శాతం పూర్తైతే ఇప్పుడు ఏ మేరకు పనులు జరిగాయో కనిపించడం లేదా? దీనిపై ఎందుకు స్పందించరు వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లు పూర్తవుతున్నా అమలు చేయలేదు ఎందుకని?

జనచైతన్యమే రక్ష

ప్రజల డబ్బుతో విద్యావంతులై వారిపట్ల శ్రద్ధ చూపని ప్రతి ఒక్కరిని దోషిగా చూడాలని స్వామి వివేకానంద చెప్పిన సూక్తిని గుర్తుచేసుకోవాలి. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అప్రజాస్వామిక విధానాలు, సంఘటనలపై ప్రజాస్వామ్య వాదులు, మేధావులు గళం విప్పాలి. సంఖ్యా బలంతో ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, పద్దతులను, చట్టాలను కాలరాసి ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారు. జనచైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష. ప్రభుత్వం సక్రమమైన పాలన అందించినప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలదే. పౌరులు ఓటు వేసి తమ బాధ్యత తీరినట్లుగా భావించడం వల్లనే అరాచకం, అవినీతి, నియంతృత్వం పెరిగిపోయింది. ఈసారైనా గోముఖ వ్యాఘ్రాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మారీచుల మాయలో చిక్కి బంగారు లేడి అనుకుని మాయలేడి వెంట పరుగులు పెట్టొద్దు. రాబోయే ఎన్నికల్లో వివేకవంతంగా ఆలోచించి స్పష్టమైన తీర్పు ఇవ్వండి. ప్రజల చైతన్యంపైనే రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంది.

మన్నవ సుబ్బారావు

99497 77727


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed