- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ గుర్తింపు రాజకీయాల్లో ఉండదా?
ఇటీవల భారత ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మొత్తం 139మందికి 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది.

ఇటీవల భారత ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మొత్తం 139మందికి 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుండి కులచైతన్య ఉద్యమంతో పాటు మానవీయ కోణంలో ఉద్యమం చేసిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. వాస్త వంగా ఇదీ ఆయనకు రావాల్సిందే. కానీ మరో దళిత సామజిక చైతన్య విప్లవ గాయకుడు గద్దర్‌ను కేంద్రం విస్మరించడం బాధాకరం. ఈ ఇద్దరిలో ఒకరు మాదిగజాతి హక్కులకై తన జాతితో, మరొకరు తెలంగాణ విముక్తికి తన పాటతో అధిపత్య పెట్టుబడిదారి రాజకీయ పార్టీలకు అండగా నిలబడినవారే.
పురస్కారాలు.. పార్టీవా, ప్రభుత్వానివా?
గత నాలుగు దశాబ్దాలుగా దళిత ఉద్యమాల్లో ముందుండి పోరాడుతున్న మంద కృష్ణమాదిగ రిజర్వేషన్లలో మాదిగలకు సరైన వాటా అందాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలనే డిమాండ్‌తో మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేశారు.. ఇన్నేళ్ల పోరాటంలో ఆయన ఆధిపత్య వర్గ పార్టీల చేతుల్లో ఎన్నో సార్లు బలైపోయారు. చాలాసార్లు జాతి కన్నా పార్టీలకే ఎక్కువ లాభం చేకూరింది. ఆధిపత్య పార్టీలు వర్గీకరణ పేరుతో మాల, మాదిగలను ఓటు బ్యాంకు కోసం కూడా వాడుకున్నారు. ఎన్నిచేసినా ఆయన దాన్ని సాధించుకున్నారు. దీంతో మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. అయితే మరోవైపు గద్దర్ ఆట- పాటతో ప్రభావితమై ఉద్భవించిన కళా బృందం ద్వారానే తెలం గాణ సమాజం చైతన్యమైంది. ఆయన తెలంగాణ స్వరాష్ట్ర సాహిత్య సాంస్కృతిక రాజకీయ చరిత్రలో మార్పు కోసం కృషి చేశాడు. బానిసత్వం, అణచివేతకు వ్యతిరేకంగా ప్రశ్నించాడు. కానీ ఈ ఆధిపత్య కుల, మతతత్వ పెట్టుబడిదారి రాజకీయ నాయ కుల చేతుల్లోనే గద్దర్ సిద్దాంతం ఓడిపోయింది. ఈ ఆదిపత్య వర్గ రాజకీయ నాయ కులు పార్టీలకతీతంగా అస్తిత్వం కొరకు ఆయనను ఎంతో బాగా వాడుకున్నారు. అవార్డుకు వచ్చేసరికి(నక్సలైట్) భావజాలం పేరుతో పక్కన పెట్టారు. మరి ఇప్పుడు ఆయన ఇన్నేళ్ల సామాజిక చైతన్యం ఎటు పోయిందనేది మనం ఆలోచించాలి. దీంతో పద్మ అవార్డులు నిజంగా ప్రతిభావంతులకు ఇస్తున్నారా? లేదా పార్టీ అనుకూల ప్రతిభావంతులకు ఇస్తున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ అవార్డు పార్టీల కోటరీగా మారిందని మేధావులు అభిప్రాయం. ఆ దిశగా అవార్డుల ప్రకటన కూడా జరుగుతోందని చర్చ. అసలు ఇవీ ప్రభుత్వ పురస్కారాలా? లేదా పార్టీ పురస్కారాలా అనే సందేహం ప్రజల్లో నెలకొంది.
ఇప్పుడు రావాల్సింది ఈ ఉద్యమాలు..
రాజ్యాధికార కాంక్ష లేని సామాజిక చైతన్య హక్కుల పోరాట ఉద్యమాలు ఎవరికి లాభం చేకూర్చుతున్నాయో నేటి విద్యావంతులు ఆలోచించాలి. ఇటీవల అట్టడుగు వర్గాలకు పద్మ అవార్డు రూపంలో కాస్త గుర్తింపు వస్తుంది. ఇది మంచి పరిణామమే కానీ, ఆ గుర్తింపు రాజకీయాల్లో ఆ వర్గాలకు ఉందా? అనేది ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ ఇచ్చినా ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రాధాన్యత ఇస్తాయా? అనేది కూడా ప్రశ్నార్థకమే. కుల గణన సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల జనాభా దాదాపు 85 శాతం ఉంది. కానీ రాజకీయాల్లో ఆ స్థాయిలో ప్రాతినిధ్యం వారికి లేదు. ఈ నేపథ్యంలో సామాజిక చైతన్య పోరాటాలు ఇంకెన్నేళ్లని రాజకీయ వాటా కోసం రాజ్యాధికార పోరాట ఉద్యమాలు బయలెల్లుతున్నాయి. ఇప్పటికే బహుజనుల రాజ్యాధికారం కోసం, బీసీ చైతన్యానికై జాతీయ బీసీ సంఘం నాయకులు వివిధ రూపాల్లో కృషి చేస్తూ తమ వాటాపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ సంఘాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు మద్దతునివ్వాలి. ఇప్పుడు రాజకీయ పార్టీలు సైతం వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలం గాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు చేస్తూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాలని ఆలోచిస్తుంది. నిజానికి రాజకీయాల్లో, ప్రభుత్వ నిర్ణయాల్లో అట్టడుగు వర్గాలకు గుర్తింపునిచ్చినప్పుడే నిజమైన పురస్కారాలు వారికి దక్కినట్టు. ఇప్పుడు రావాల్సింది కూడా సామాజిక చైతన్య హక్కుల ఉద్యమాలు కాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికార ఉద్యమాలని వెనుకబడిన దళిత గిరిజన వర్గ నాయకులు గుర్తించాలి.
- సంపతి రమేష్ మహారాజ్
సామాజిక విశ్లేషకులు
79895 79428






