తెలుగు చదవడం కూడా రానివాళ్లపై.. పాండిత్యాన్ని రుద్దుదామా?

by Ravi |   (  Updated:2025-05-24 10:12:38  IST  )

సమాజంలో తెలుగు భాష పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం బొట్లు అన్నట్టుగా తయారైన తరుణంలో పాఠశాల స్థాయిలో భాష భిన్నంగా

తెలుగు చదవడం కూడా రానివాళ్లపై.. పాండిత్యాన్ని రుద్దుదామా?
X

సమాజంలో తెలుగు భాష పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం బొట్లు అన్నట్టుగా తయారైన తరుణంలో పాఠశాల స్థాయిలో భాష భిన్నంగా ఉండటానికి అవకాశం ఉంటుందా? ఒకప్పుడు హిందీ ఆంగ్లం తప్ప మిగతా సబ్జెక్టులన్నీ విద్యార్థులు తెలుగులోనే చదివేవారు. భాషపైన పట్టు సాధించేవారు. ఇప్పుడు ఆంగ్ల మాధ్యమం వల్ల తెలుగు పుస్తకంలో మాత్రమే తెలుగు చదువుతు న్నారు. దీనికి తోడు సామాజిక మాధ్యమాల పుణ్యమాని తెలుగు వాడకం దారుణంగా పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

వివిధ సంస్థల అధ్యయన నివేదికల ప్రకారం అయిదో తరగతి విద్యార్థి రెండో తరగతి తెలుగు పుస్తకం కూడా చదవడం లేదని, ఎనిమిదో తరగతి విద్యార్థి మూడో తరగతి తెలుగు పుస్తకం కూడా చదవడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో బి.ఏ తెలుగు, ఎం.ఏ తెలుగు, పరిశోధనా స్థాయి ప్రక్రియలను పాఠశాలలో ఎందుకు చదవాలి?

సాహిత్యం ఒక్కటే సాధనమా?

ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాలను పరిశీలిస్తే అవి పిల్లల వాస్తవ భాషా సామర్థ్యాలకు అణుగుణంగా లేవని అర్థమవుతుంది. పాఠ్యపుస్తకాల ప్రధాన లక్ష్యం భాషా సామర్థ్యాల సాధన. ఆ తర్వాత విద్యార్థులు, సాహిత్య విలువలు, సంస్కృతి మొదలగు విషయాలను నేర్చుకుంటారు. ఉపాధ్యాయులకు నిరంతరం భాషా సామర్థ్యాల సాధన కోసం శిక్షణలను ఇస్తున్నారు సరే... ఆ మేరకు పాఠ్యపుస్తకాల నిర్మాణం ఉందా? అని ఆలోచించాలి. ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి తెలుగు పాఠ్యపుస్తకం తీసుకుంటే విద్యార్థి పన్నెండు సాహిత్య ప్రక్రియలను నేర్చుకోవాలి. ఇక్కడే అసలైన ప్రశ్న తలెత్తుతోంది. పదేళ్ళ విద్యార్థి భాషా సామర్థ్యా ల మీద కన్నా ప్రక్రియల గందరగోళంలో పడిపోతున్నాడు. భాషా సామర్థ్యాల సాధనకు సాహిత్యం ఒక్కటే సాధనమా? పదేళ్ల నుండి చదువుతున్న పుస్తకాలు సాధనం కాదంటున్నా యి. సాహిత్యం సృజనకు సంబంధించింది. అందరికీ అందులో ఆసక్తి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ సాహిత్య ప్రక్రియల ద్వారా సామర్థ్యాల సాధన అనేది ఎలా సాధ్యం?

తెలుగు చదవలేని, రాయలేని పిల్లలు..

వివిధ సంస్థల అధ్యయన నివేదికల ప్రకారం అయిదో తరగతి విద్యార్థి రెండో తరగతి తెలుగు పుస్తకం కూడా చదవడం లేదని, ఎనిమిదో తరగతి విద్యార్థి మూడో తరగతి తెలుగు పుస్తకం కూడా చదవడం లేదని మనం వార్తలు చూస్తున్నాం. దీంతో భాషా సామర్థ్యాల సాధనలో పిల్లల స్థాయి రోజురోజుకూ తగ్గిపోతోందని అర్థమవుతోంది. తన చుట్టూ ఉన్న పరిస్థితులు, సాంకేతికత, ఆంగ్ల మాధ్యమం ఇవన్నీ స్థాయి తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పాఠ్యపుస్తకాలు ఎలా ఉండాలి. విద్యా ర్థుల భాషా స్థాయికి తగినట్లుగా ఉండాలి కదా! సరళమైన తెలుగు సైతం చదవలేని, రాయలేని పరిస్థితుల్లో (ప్రభుత్వ, ప్రైవేటు తేడా లేదు) పన్నెండు ప్రకియల్లో పాఠాలు పెట్టి ఏం సాధించదలిచాం. ఏం సాధించాం? పాఠాలు భాషా సామ ర్థ్యాల పెంపుకు ఊతమిచ్చేలాగా ఉండాలి. మనం ఒక ఫార్మాట్ పెట్టుకొని ఫలానా ఫలానా ప్రక్రియలు ఉండాలని నిర్ణయించడం సబబేనా?

ఆరో తరగతి పిల్లలు వారిని బతికించాలా?

పోనీ పెట్టిన పాఠాలైనా పిల్లలను దృష్టిలో పెట్టుకొని చేసారా? అంటే అదీ లేదు. ప్రాచీన సాహిత్యాన్ని, మరుగున పడిన కవులను ఆరో తరగతి విద్యార్థులు బతికించాలా? బి. ఏ తెలుగు, ఎం.ఏ తెలుగు, పరిశోధనా స్థాయి ప్రక్రియలను పాఠశాలలో ఎందుకు చదవాలి? పిల్లలకు చదవడం రాయ డం రావాలని ఒకవైపు చెప్తూ..మరో వైపు మన పాండిత్యాన్ని పిల్లల మీద పాఠాల రూపంలో రుద్దడం ఏ మేరకు శాస్త్రీ యమో ఆలోచించాలి. విద్యార్థులు తెలుగు స్పష్టంగా చదవ గలిగినప్పుడు, నాలుగు వాక్యాలు రాయగలిగినప్పుడు ఆసక్తి, అభిరుచి ఉన్న వారు సాహిత్యానికి సంబంధించిన ప్రక్రియలను ఎంచుకొని చదువుతారు. గతంలో అన్ని సబ్జెక్టులు తెలుగులోనే గనక పాఠ్యాంశాలు ఎలా ఉన్నా నేర్చుకొనేవారు.

నోరు తిరగని పద్యాలతో పనేంటి?

ఇక తెలుగు పాఠ్యాంశాలను చూస్తే పిల్లలకు నోరు తిరగని పద్యాలు, పదాలున్న పేరాలతో కూడినవే అధికంగా ఉన్నాయి. మరేం చేయాలి.. ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్న తెలుగు పట్ల ఆసక్తి పెంపొందించాలంటే విద్యార్థుల వాస్తవ తెలుగు భాషా సామర్థ్యాలను నిజాయితీగా శాస్త్రీ యంగా మదింపు చేయాలి. ఆ సామర్థ్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపకల్పన చేయాలి. సరళీకరించిన పాఠాలను చేర్చాలి. పిల్లలకు ఆసక్తి కలిగించే కథల్నీ, గేయాలను ఎక్కువగా ఉండేట్లు చూడాలి.

పిల్లలపై అన్నీ రుద్దవద్దు!

మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రక్రియలన్నీ విద్యార్థుల మీద రుద్దాలనే ఆలోచన మారాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలను సులభశైలికి మార్చాలి. ఇప్పుడు ప్రతి తరగతిలో 12 పాఠాలతో పాటు ఉన్న ఉపవాచకం పాఠాల సంఖ్య తగ్గించాలి. తెలుగుకు సం బంధించిన ప్రశ్నాపత్రాల రూపం సరళంగా మారాలి. సామా జిక మాధ్యమాలు, ఆంగ్ల మాధ్యమం వల్ల విద్యార్థులు తెలుగు సామర్థ్యాలు తగ్గుముఖం పట్టిన వేళ.. మనం పాఠాలను కూడా వారి స్థాయిలకు అనుగుణంగా మార్చుకుంటే తప్ప పాఠశాల స్థాయిలో తెలుగు భాష బతికి బట్టకట్టదని గ్రహించాలి. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల రూపకల్పనలో సమూలమైన మార్పులు తీసుకురావాలని తెలుగు భాషో పా ధ్యాయులు, భాషాభిమానులు కోరుతున్నారు‌.

-వెన్నెల సత్యం

తెలుగు ఉపాధ్యాయుడు, కవి

94400 32210

Next Story