- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షైనింగ్ హైదరాబాద్.. సఫరింగ్ తెలంగాణ? ఉద్యమ లక్ష్యాలకు దూరంలోనే రాష్ట్రం!
హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్నప్పటికీ గ్రామీణ తెలంగాణ ఇంకా నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, వైద్య సమస్యలతో పోరాడుతోంది. తెలంగాణ ఉద్యమం ఆశించిన సమాన అభివృద్ధి నిజంగా సాధ్యమైందా? అనే ప్రశ్నపై విశ్లేషణ.

తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం కేవలం భౌగోళిక సరిహద్దుల కోసం జరిగిన పోరాటం కాదు. అది దశాబ్దాలుగా కొనసాగిన ప్రాంతీయ వివక్ష, అన్యాయం, నిర్లక్ష్యం, అవకాశాల అసమాన పంపిణీకి వ్యతిరేకంగా ప్రజలు రేపిన చారిత్రాత్మక ఉద్యమం. “మన నీళ్లు – మన నిధులు – మన నియామకాలు” అనే నినాదం వెనుక తెలంగాణ గ్రామాల బాధ, రైతు ఆవేదన, నిరుద్యోగ యువత ఆకాంక్ష, స్వాభిమానం దాగి ఉన్నాయి.
రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు దాటుతున్న ఈ సమయంలో తెలంగాణ నిజంగా ఉద్యమ లక్ష్యాల దిశగా నడుస్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు సమాజం ముందుంది. ఒకవైపు హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా మెరుస్తుంటే, మరోవైపు గ్రామీణ తెలంగాణ ఇంకా అప్పులు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ రంగాల బలహీనతలతో పోరాడుతోంది. అభివృద్ధి మొత్తం ఒక నగరంలోనే కేంద్రీకృతమవుతుంటే, ఉద్యమం ఆశించిన సమాన తెలంగాణ సాధ్యమవుతుందా? అన్న చర్చ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
అభివృద్ధి చిన్న గ్రామాలకు విస్తరించాలి!
హైదరాబాద్ నేడు ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగి తెలంగాణకు ఐటీ, పెట్టుబడులు, ఉద్యోగాల్లో భారీ వృద్ధిని తీసుకొచ్చింది. కానీ ఈ అభివృద్ధి ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే పరిమితమైందనే విమర్శలు ఉన్నాయి. అంటే అభివృద్ధి రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకరణ కాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమవుతోంది. ప్రభుత్వాలు కూడా ఈ అభివృద్ధినే “తెలంగాణ ప్రగతి”గా ప్రజలకు చూపిస్తున్నాయి. అయితే ఈ అభివృద్ధి మొత్తం రాష్ట్రానికి సమానంగా విస్తరించిందా? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సి ఉంది. విదేశీ పెట్టుబడులు, ఐటీ ఎగుమతులు, రియల్ ఎస్టేట్ బూమ్, అంతర్జాతీయ సదస్సులు ఇవన్నీ హైదరాబాద్‌కు ఒక కొత్త గుర్తింపును తెచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అదే సమయంలో గ్రామీణ తెలంగాణ పరిస్థితి ఏమిటి? వారు ఇప్పటికీ వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. భూములు రియల్ ఎస్టేట్ వెంచర్‌లుగా మారుతుంటే, చిన్న రైతు అప్పుల కోసం తన భూమినే అమ్ముకోవాల్సి వస్తోంది. ఇది సమగ్ర అభివృద్ధి కాదు, అసమాన అభివృద్ధి. నిజమైన తెలంగాణ ప్రగతి అంటే అభివృద్ధి గ్రామాలు, చిన్న పట్టణాలకు కూడా సమానంగా విస్తరించాలి.
యువత గిగ్ వర్క్ మీదే ఆధారపడుకుంటూ..
ప్రభుత్వ వైద్య రంగంలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రంలో వేలాది డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండ టంతో గ్రామీణ ప్రజలు సరైన వైద్యం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఒకవైపు “ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను నిర్మిస్తున్నామని చెప్పే ప్రభు త్వాలు, గ్రామీణ ఆసుపత్రుల్లో ఒక్క డాక్టర్ కూడా లేక ప్రజలు కిలోమీటర్ల దూరం ప్రయాణించే పరిస్థితిని ఎందుకు మార్చలేకపోతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన ఉద్యోగాల హామీలపై యువత పెద్ద ఆశలు పెట్టుకుంది. కానీ నిరుద్యోగం ఇంకా ప్రధాన సమస్యగానే ఉంది. తెలంగాణాలో ఐటీ రంగం లక్షల కోట్లకు పెరుగుతున్నప్పటికీ, చాలామంది యువత చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు, గిగ్ వర్క్, డెలివరీ, కాంట్రాక్ట్ పనులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వ రంగంలో కూడా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానం పెరగడంతో తక్కువ జీతాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, కార్మిక హక్కులు బలహీనపడటం వంటి సమస్యలు మరింత పెరుగుతున్నాయి.
జీడీపీ పెరగడమే అభివృద్ధి కాదు..
పాలకులు చెబుతున్న అభివృద్ధి ఎక్కువగా కార్పొరేట్, మార్కెట్ కేంద్రితంగా మారిందనే విమర్శలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, గ్రామీణ తెలంగాణ మాత్రం అప్పులు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభంతోనే పోరాడుతోంది. జీడీపీ గణాంకాలు పెరగడం మాత్రమే అభివృద్ధి కాదు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. రైతుకు గౌరవప్రదమైన జీవితం, యువతకు స్థిరమైన ఉద్యోగాలు, అందరికీ విద్యా–వైద్య సదుపాయాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఒకవైపు సంపద కేంద్రీకృతమవుతుంటే, మరోవైపు గ్రామీణ పేదరికం పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో సామాజిక అసంతృప్తికి దారితీయొచ్చు.
స్వరాష్ట్ర ఉద్యమం సమసమాజం కోసం..
అందుకే ప్రభుత్వాలు నగర కేంద్రిత అభివృద్ధి నుంచి బయటకు రావాలి. గ్రామీణ పునర్నిర్మాణం, వ్యవసాయ రంగ బలోపేతం, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, చిన్న పరి శ్రమలు, ప్రభుత్వ విద్యా, వైద్య రంగాల అభివృద్ధి ఇవే తెలంగాణ భవిష్యత్తుకు నిజమైన పునాదులు కావాలి. లేకపోతే రేపటి తెలంగాణ రెండు వేర్వేరు ప్రపంచాలుగా మారిపోతుంది. ఒకటి షైనింగ్ హైదరాబాద్, మరొకటి సఫరింగ్ తెలంగాణ.. తెలంగాణ ఉద్యమం చేసింది కేవలం ఒక నగరం కోసం కాదు.. ఒక సమాన సమాజం కోసం. హైదరాబాద్ వెలుగులు గ్రామీణ తెలంగాణ చీకట్లను కప్పిపుచ్చలేవు. గ్రామీణ తెలంగాణ బలపడినప్పుడే.. తెలంగాణ నిజమైన అభివృద్ధి సాధించినట్లు అవుతుంది.
- విజయ్ పుట్టపాగ
80080 28237






