కృతజ్ఞతను గుర్తు చేసే ప్రయాణం- సీతా పయనం

by Ravi |   (  Updated:2026-05-09 01:00:30  IST  )

ఒక ప్రమాదం నుంచి బతికి బయటపడటానికి కారణమైన ప్రతి చిన్న మనిషికి కృతజ్ఞత చెప్పాలనుకున్న అమ్మాయి ప్రయాణమే ‘సీతా పయనం’. భావోద్వేగాలు, అనుబంధాలు, జీవిత సత్యాలను హత్తుకునేలా చెప్పిన ఈ సినిమాపై ప్రత్యేక కథనం.

కృతజ్ఞతను గుర్తు చేసే ప్రయాణం- సీతా పయనం
X

ఒక ప్రమాదంలో మన ప్రాణం పోలేదంటే అది మన అదృష్టం కాదు.. మన చుట్టూ తిరిగే అనేక మంది మనుషుల నిర్ణయాల వలనో, కొన్ని క్షణాల ఆలస్యాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ప్రమాదానికి ముందు వారి వల్లే లేట్ అయ్యిందని మనం కొందరిని తిట్టుకుంటాం. నిజానికి వాళ్లందరూ తెలియకుండానే మన జీవితంలో దేవుళ్ల పాత్ర పోషించి ఉండొచ్చు..

అయితే మనం బతికి బయటపడ్డ ప్రతి ప్రమాదానికి దేవుడికి కృతజ్ఞతలు చెప్తాం గానీ, ఆ ప్రాణాన్ని కాపాడిన మనుషుల్ని మాత్రం చాలా అరుదుగానే గుర్తు చేసుకుంటాం. అలాంటి సున్నితమైన భావనను హృదయానికి హత్తుకునేలా గుర్తు చేసే ప్రయాణమే ‘సీతా పయనం’. ఇది కేవలం ఒక అమ్మాయి చేసిన ప్రయాణం కాదు.. తన ప్రాణాన్ని కాపాడిన ప్రతి చిన్న కారణానికీ, ప్రతి మనిషికీ ‘థ్యాంక్స్’ చెప్పాల నుకున్న ఒక మనసు చేసిన ప్రయాణం.

ఇది మామూలు సినిమానే కానీ..

నటుడు అర్జున్ సర్జా దర్శకత్వం చేసిన సినిమా ‘సీతా పయనం’, ఒక మామూలు తెలుగు సినిమా కథే. అన్ని తెలుగు సినిమాల్లాగే నాలుగు డ్యూయెట్లు మూడు ఫైట్లు, ఒక కుటుంబం సీను, బంధాలు అనుబంధాలు, వాటి ప్రాముఖ్యత చెపుతూ సాఫీగా సాగుతుంది. అయితే ఈ కథ పేరులోనే పయనం ఉంది కనుక ముందే ఊహించేసుకోవచ్చు, ఇందులో ట్రావెల్ ఎలిమెంట్ ఉంటుందని. అయితే ఈ సినిమా ఆలోచింపజేస్తుంది. ఒక కొత్త ఆలోచనను కలిగిస్తుంది. జీవితంలో మనకు తృటిలో తప్పిన ప్రమాదాలు మన దృక్పథాన్నే మార్చేస్తాయి. కానీ ఆ ప్రమాదం తప్పటానికి కారణమైన చిన్న చిన్న మానవ ప్రమేయాలను మాత్రం మనం గుర్తించం. ఉదాహరణకి, మనం విమానం మిస్ అవ్వడానికి కారణమైన ఎవరిపైనో కోప్పడతాం. కానీ ఆ తర్వాత ఆ విమానం ప్రమాదానికి గురైందని తెలిసినప్పుడు అతడే దేవుడిలా అనిపిస్తాడు. కానీ ఆ కృతజ్ఞతను వ్యక్తం చేయ డానికి మాత్రం మళ్లీ అతన్ని వెతకం. అలాంటి సున్నితమైన భావనను హృదయానికి హత్తుకునేలా గుర్తు‌చేసే ప్రయాణమే ‘సీతా పయనం’.

కథేంటంటే..

ఈ సినిమాలో సీత వైజాగ్‌లోని తన ఇంటి నుంచి, హైదరా‌బాద్‌లో జరిగే ఒక కాన్ఫరెన్స్‌కు బయలుదేరుతుంది. తనకు ప్రయాణంలో ఎదురైన కొందరు వ్యక్తుల వల్ల గమ్యాన్ని కొంత ఆలస్యంగా చేరుకుంటుంది. అయితే సీత తను వెళ్లవలసిన ఆ భవనంలోకి ప్రవేశించబోయే సమయానికి షార్ట్ సర్కూ‌ట్‌తో ఆ భవనంలో పేలుళ్లు సంభవించి తన కళ్ల ముందే ఆ భవనం కుప్పకూలి పోతుంది. తను కొన్ని సెకండ్ల ముందు చేరి ఉన్నా ఆ అగ్నికి ఆహుతై పోయేది. ఆ ప్రమాద షాక్ నుండి కాసేపటికి తేరుకున్న సీత, తనకు ప్రయణంలో ఎదురైన అందరూ, తను ఇంట్లోంచి బయటకు వచ్చేముందు తనను ఆపి ముద్దు పెట్టుకున్న తండ్రి, తనను ఆపి లిఫ్ట్ అడిగిన హీరో, తాము మధ్యలో టిఫిన్ కోసం ఆగిన ఒక హోటల్, ఆమె కుటుంబం, దారిలో ఎదురైన పండ్లమ్మే అమ్మాయి, ఒక ఆవుతో కారుకి అడ్డొచ్చిన బాలుడు, ఎవరినో బెదిరించటానికి తన కారుకి అడ్డం వచ్చిన రౌడీ (అర్జున్ సర్జా) ఇలా అందరూ కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు, తన ప్రయాణాన్ని ఆపి తన ప్రాణాన్ని కాపాడారనే ఆలోచనతో, వారందరికీ స్వీట్స్ ఇచ్చి, థ్యాంక్స్ చెప్పాలని మళ్లీ తిరుగు ప్రయాణం అవుతుంది.

మనల్ని కదలకుండా చూసేలా చేస్తుంది!

అయితే మొదటి ప్రయాణంలో ఎదురయ్యేవి ఒక హీరో, అందాలూ, ఆనందాలు, ఒక చిన్న రౌడీయిజం అయితే తిరుగు ప్రయాణంలో అనుబంధాలకు ఆప్యాయతలకు విలువ ఇచ్చే ఒక కుటుంబం, ఒక చిన్న పాటి ఫైటూ, సీత థ్యాంక్స్ చెప్పగానే మారిపోయిన రౌడీ, విడిపోవాలనుకున్న ఒక జంటను కలపటానికి హీరో, హీరోయిన్లు అల్లిన కథ, ఈ సన్నివేశాల మధ్యలో హీరో, హీరోయిన్ల మధ్య కలిగిన ప్రేమ ఇలా వీటన్నింటితో సినిమా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. హీరో, హీరోయిన్ బాగానే నటించారు. ఇక మిగిలిన పాత్రధారులందరూ మనం నిత్యం చూసేవారే ప్రకాష్ రాజ్, జైరాజ్, డబ్బింగ్ జానకి, కోవై సరళ మొదలైనవారు. ఈ సినిమాలో పెద్దగా మలుపులు లేకపోయినా సినిమా బోర్ కొట్టదు.. కథ మరీ సాఫీగా లేకుండా చివరగా ఒక చిన్న ట్విస్ట్‌తో సుఖాంతం అవుతుంది. అయితే మనకు సుపరిచితమైన విషయాల్లోనే ఒక మాయ ఉంటుంది, ఒక హాయి ఉంటుంది. ఇక్కడ మీకు ప్రత్యేకంగా కొత్తదేమీ కనిపిం‌చకపోయినా, ఈ సినిమా తనదైన రీతిలో మనల్ని ఆకర్షించి, కదలకుండా చూసేలా చేస్తుంది. మన చుట్టూ ఉన్నవారికి థ్యాంక్స్ చెప్పాలనే ఒక ఆలోచనను కలిగిస్తుంది, ఒక మృదువైన అనుభూతిని మిగులుస్తుంది.

సినిమా: సీతా పయనం

దర్శకుడు: అర్జున్ సర్జా

నటీనటులు: సుధీంద్ర, ఐశ్వర్య అర్జున్ తదితరులు

ఓటీటీ: సన్ నెక్స్ట్


సమీక్ష

-అనురాధ బొడ్ల

99895 66696

Next Story