విమానయాన వ్యవస్థ లో భద్రతా మార్పులు అత్యవసరం!

by Ravi |   (  Updated:2025-07-06 00:45:39  IST  )

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం దేశ చరిత్రలో చీకటి అధ్యాయాన్ని లిఖించింది. లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా

విమానయాన వ్యవస్థ లో భద్రతా మార్పులు అత్యవసరం!
X

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం దేశ చరిత్రలో చీకటి అధ్యాయాన్ని లిఖించింది. లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణా‌ల్లోనే కూలిపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలు నింపింది. ఇది కేవలం విమాన ప్రమాదం కాదు, వంద‌లాది మంది ఆశలను, కలలను ఛిద్రం చేసిన ఒక భయంకరమైన విషాదం. శిథిలాల మధ్య ప్రాణాల కోసం సాగిన అన్వే షణ, గుర్తుపట్టలేని మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల ద్వా రా గుర్తించాల్సిన దుర్భర పరిస్థితి ఈ విషాద తీవ్రతకు నిదర్శనం. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే, అనేక ప్రశ్నలు, వాదనలు గాలిలో తేలియాడుతున్నాయి. సరి‌కొత్త ‌బో యింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం, అత్యాధునిక సాం కేతిక పరిజ్ఞానంతో రూపొందించబడినదిగా ప్రచారం పొందినది, అయినా ఎందుకు కుప్పకూలిపోయింది?

అత్యాధునికమైన విమానం అయినప్పటికీ..

ఈ విమానం కూలడానికి ఇంజిన్ వైఫల్యమే కారణమని పైలట్ పంపిన మేడే సందేశం ద్వారా తెలుస్తోంది. థ్రస్ట్ కోల్పోవడం వంటి కోణాన్ని చూపిస్తున్నప్పటికీ, విమానయాన భద్రత నిపుణులు ఇప్పుడు వివిధ కోణాల్లో ఈ ప్రమాదాన్ని విశ్లేషిస్తున్నారు.. ఏదేమైనా ఈ విమానం నేలకూలడానికి దారితీసిన కచ్చితమైన కారణాలను కనుగొనడం దర్యాప్తు అధికారులకు ఒక సంక్లిష్టమైన సవాలుగా మారింది. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ అత్యాధునికమైనదైనప్పటికీ, దాని సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్‌లో గతంలో కొన్ని చిన్నపాటి సమస్యలు తలెత్తాయి.. అయితే సాంకేతిక సమస్యనా? మానవ తప్పిదమా? నిర్వహణ లోపమా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సంభావ్య కారణాలలో ఏది కలిసి ఈ ఘోర విషాదానికి దారితీశాయో.. బ్లాక్ బాక్స్‌లలోని డేటా ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తా యి. ప్రమాద స్థలం నుండి ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లు లభ్యం కావడం దర్యాప్తునకు ఒక ఆశాదీపంగా మారింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ కేసును అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోంది.

ఈ ప్రమాద కారణాలే కాకుండా..

భారతదేశ విమానయాన రంగం గత దశాబ్ద కాలంగా అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తోంది. కానీ, ఈ వేగ వంతమైన విస్తరణకు అనుగుణంగా భద్రతా వ్యవస్థ బలోపేతం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రన్‌వేల నిర్వహణ, ల్యాండింగ్ సిస్టమ్స్, టెర్మినల్ సామర్థ్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 2025 మార్చి 31 నాటికి లోక్‌సభలో సమర్పించిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, నియంత్రణ సంస్థలైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)లో 1,692 పోస్టులకు 814 ఖాళీలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS)లో 598 పోస్టులకు 224 ఖాళీలు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)లో 25,730 పోస్టులకు 9,502 ఖాళీలు ఉన్నాయి. ఈ వేలకొద్దీ ఖాళీలు కేవలం గణాంకాలు కావు, అవి భారత విమానయాన భద్రతా వ్యవస్థలో పాతుకుపోయిన బలహీనతలకు అద్దం పడుతున్నాయి. ఈ విమాన ప్రమాదానికి కేవలం కారణాలను కనుగొనడమే కాకుండా, భారత విమానయాన భద్రతా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం అత్యవసరం. మానవ వనరుల కొరతను యుద్ధప్రాతిపదికన తీర్చాలి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను కచ్చి తంగా, నిరంతరం పాటించాలి. భవిష్యత్తులో సురక్షితమైన ఆకాశ మార్గాలను నిర్మించడానికి కృషి చేయాలి. ఇది భారతదేశ విమానయాన భద్రతా విధానాల్లో సమగ్ర ప్రక్షాళనకు ఒక ఉత్ప్రేరకంగా మారాలి.

- డా. కట్కూరి

సైబర్ సెక్యూరిటీ న్యాయ నిపుణులు

94909 34520

Next Story