- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉచితాలతో కాదు... అవసరాలతోనే బడి బలోపేతం!
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు నాణ్యమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ సదుపాయాలు, పరిశుభ్రత, విద్యా ప్రమాణాల పెంపు గురించి..

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే విద్యార్థులకు ఉచితాలు ఇస్తే సరిపోవు. వాటితో పాటు కనీస మౌలిక వసతులు, సరిపడా సిబ్బంది ఉంటేనే పేద విద్యార్థులకు నిజమైన న్యాయం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం అందిస్తోంది. వీటి వల్ల పేద, గ్రామీణ కుటుంబాల పిల్లలు పాఠశాలలకు వస్తున్నారు. హాజరు కూడా పెరిగింది కాదనలేం. కానీ "బడికి వచ్చిన పిల్లవాడు ఏమి నేర్చుకుంటున్నాడు?" అనే ప్రశ్నకు ఆశించిన సమాధానం కనిపించడం లేదు. దీనికి కారణం ఉచితాలతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత. ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన విద్య అందాలంటే "ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు" విధానాన్ని అమలు చేయాలి. ఒక్కరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతో ఐదు తరగతులను సమర్థంగా నిర్వహించడం సాధ్యం కాదు. అలాగే ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక పి.ఇ.టి. ఉపాధ్యాయుడిని నియ మించి పిల్లల్లో శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ పెంపొందించాలి. ఇక ఉపాధ్యాయులు బోధనేతర పనుల్లో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నందున ప్రతి పాఠశాలలో ఒక రికార్డ్ అసిస్టెంట్‌ను నియమించాలి. అలాగే పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, తాగునీటి ఏర్పాట్ల కోసం ఒక అటెండర్ ఉండాలి. డిజిటల్ యుగ అవసరాలకు అను గుణంగా ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, ఇంటర్నెట్ సౌకర్యం, శిక్షణ పొందిన ఇన్‌స్ట్రక్టర్‌ను ఏర్పాటు చేయాలి. విశాలమైన తరగతి గదులు, తగిన బెంచీలు, ఫ్యాన్లు, బాలిక లకు ప్రత్యేక మరుగుదొడ్లు, నిరంతర తాగునీటి సౌకర్యం కూడా తప్పనిసరిగా కల్పించాలి. "పుస్తకం ఉచితంగా ఇచ్చాం కానీ, అది చెప్పే ఉపాధ్యాయుడిని ఇవ్వలేదు" అనే పరిస్థితి మారాలి. మంచి బోధన వారి భవిష్యత్తును నిర్మిస్తుంది. ప్రభుత్వం కడుపుతో పాటు మెదడును కూడా నింపితేనే పేద విద్యార్థికి నిజమైన న్యాయం జరుగుతుంది. అభ్యసన ఫలితాలు మెరుగుపడతాయి, డ్రాపౌట్ రేటు తగ్గుతుంది, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం పెరుగు తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాలకు నాణ్యమైన విద్యకు అవసరమైన సిబ్బంది, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి. అప్పుడే ఉచిత విద్య నిజమైన ఉన్నత విద్యగా మారుతుంది.
- దేవులపల్లి గిరిబాబు
91779 65653






