స్కిజోఫ్రెనియాపై.. అవగాహనే ముఖ్యం!

by Ravi |   (  Updated:2025-05-24 01:00:33  IST  )

భారతదేశంలో మానసిక ఆరోగ్య సమస్యలు గణనీయంగా పెరుగతున్నాయి. అందులో స్కిజోఫ్రెనియా ఒక ముఖ్యమైన మానసిక రుగ్మత.

స్కిజోఫ్రెనియాపై.. అవగాహనే ముఖ్యం!
X

భారతదేశంలో మానసిక ఆరోగ్య సమస్యలు గణనీయంగా పెరుగతున్నాయి. అందులో స్కిజోఫ్రెనియా ఒక ముఖ్యమైన మానసిక రుగ్మత. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా జనాభాలో సుమారు 0.3% నుండి 0.7% మందికి ఈ వ్యాధి ఉంటుంది. మన దేశంలో సుమారు కోటి మంది వరకు ఈ వ్యాధితో జీవిస్తున్నారని అంచనా.

ఈ వ్యాధి మానసిక ఆరోగ్య లోపంగా పరిగణించబడే ఒక సంక్లిష్టమైన, దీర్ఘకాలిక వ్యాధి. ఇది వ్యక్తి ఆలోచనా విధా నాన్ని, భావోద్వేగాలను, ప్రవర్తనను, యథార్థాన్ని గ్రహించే శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రతి సంవత్సరం మే 24 తేదీన ప్రపంచవ్యాప్తంగా "స్కిజోఫ్రెనియా అవగాహనా దినోత్సవం"గా జరుపుకుంటారు.

స్కిజోఫ్రెనియా అంటే ఏమిటి?

ఈ వ్యాధి ఒక తీవ్రమైన మానసిక రుగ్మత. దీనివల్ల వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలు, ఆచరణ, వాస్తవాన్ని గ్రహించే విధానం ప్రభావితమవుతాయి. సాధారణంగా ఈ వ్యాధి 16–30 ఏళ్ల మధ్య ప్రారంభమవుతుంది. ఇది జీవితకాలం ఉండొచ్చు. ఈ వ్యాధిలో వ్యక్తి మనస్సు రెండు భిన్న ప్రపం చాల్లో విభజించబడినట్టుగా అనిపిస్తుంది. ఇది పురుషులలో కొంచెం ఎక్కువగా, స్త్రీలలో కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించలేకపోవడం, భ్రమలు, మాయలు, భావోద్వేగ స్థిరత్వ లోపం, సామాజిక పరిమితి వంటి లక్షణాలను చూపిస్తారు. భారతదేశంలో మానసిక ఆరోగ్య కేంద్రాలు తక్కువగా ఉండటం, ఆర్థిక పరిస్థితులు, అవగాహన లోపం, మానసిక వైద్యుల కొరత వలన స్కిజోఫ్రెనియా బాధితులు సరైన చికిత్స పొందలేకపోతున్నారు.

వ్యాధి లక్షణాలు.. కారణాలు

స్కిజోఫ్రెనియా ప్రధానంగా మూడు రకాల లక్షణాలను చూపిస్తుంది. అందులో మొదటిది పాజిటివ్ లక్షణాలు.. ఇందులో భ్రమలు, మాయలు, విచిత్రమైన ఆలోచనలు, అవాస్తవ ధారణలు.. కనిపిస్తుంటాయి. ఇక నెగెటివ్ లక్షణాలు అంటే భావోద్వేగ లోపం, మాట్లాడకపోవడం, స్నేహితులు లేకుండా ఒంటరిగా ఉండటం, అభిరుచి లేకపోవడం. ఇక మూడోది కాగ్నిటివ్ లక్షణాలు.. అంటే మనిషిలో ఆలోచన సామర్థ్యం తగ్గిపోవడం, సమస్యలు పరిష్కరించలేకపోవడం, ఏదైనా విషయం గురించీ తక్కువ శ్రద్ధ వహించడం లాంటివి. ఈ వ్యాధికి కారణాలు పూర్తిగా నిర్ధారించలేదు కానీ జెనెటిక్ కారణాలు, మెదడు రసాయనిక లోపాలు, పర్యావరణ కారణాలు, మానసిక ఒత్తిడి కారణాలుగా పేర్కొంటారు. ఈ వ్యాధిని ఐదు రకాలుగా వర్గీకరిస్తారు.. మొదటిది పారానాయిడ్ స్కిజోఫ్రెనియా అంటే భ్రమలు, మాయలు ఎక్కువగా ఉండటం. రెండోది హీబిఫ్రెనిక్ స్కిజోఫ్రెనియా అంటే అసంబద్ధంగా మాట్లాడటం, విచిత్రమైన ప్రవర్తన. మూడోది కాటాటానిక్ స్కిజోఫ్రెనియా అంటే శరీర కదలికలు అదుపులో లేకపోవడం. నాలుగోది అన్‌ డిఫరె న్షియేటెడ్ స్కిజోఫ్రెనియా పై లక్షణాల మిశ్రమ రూపం. ఐదవది రెసిడ్యూయల్ స్కిజోఫ్రెనియా అంటే ముందుగా ఉన్న లక్షణాలు కొన్ని తగ్గిపోయి కొన్ని మిగిలిన స్థితి.

చికిత్స విధానాలు..

స్కిజోఫ్రెనియాకు పూర్తిగా మాయమయ్యే ఔషధం లేదు. అయితే, చికిత్స ద్వారా లక్షణాలను నియంత్రించవచ్చు. ఈ చికిత్స ప్రధానంగా మూడు విధాలుగా ఉంటుంది.. అందులో మొదటిది ఔషధ చికిత్స. ఈ చికిత్స విధానంలో యాంటీ సైకోటిక్ మందులు ఉపయోగిస్తారు. రెండవది మానసిక చికిత్స ఈ విధానంలో కౌన్సిలింగ్, థెరపీ ద్వారా భావోద్వేగ నియంత్రణ, సామాజిక నైపుణ్యాల అభివృద్ధి కలిగేలా చేస్తారు. ఇక మూడోవది కుటుంబ అవగాహన ఇందులో కుటుంబ సభ్యులు వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండ టం, బాధితుడికి మద్దతుగా ఉండటం వంటివి నేర్పుతారు.

ముందుగానే గుర్తిస్తే..

స్కిజోఫ్రెనియా అనేది ఒక దీర్ఘకాలిక, సంక్లిష్టమైన మానసిక వ్యాధి. దీని లక్షణాలు, కారణాలు, చికిత్స విధానాలు సమగ్రంగా అర్థం చేసుకోవడం అవసరం. వైద్యపరంగా చికిత్సతో పాటు కుటుంబ, సామాజిక మద్దతు ఎంతో అవసరం. అంతేకాదు మానసిక వ్యాధులపై సమా జంలో అవగాహన పెంపొందించడం, పాత కట్టుబాట్లను, అపోహలను తొలగించడం అత్యంత కీలకం. స్కిజోఫ్రెనియా ఉన్నవారికి కూడా సక్రమమైన చికిత్స, మద్దతు లభిస్తే, సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం ఉంది.

(నేడు ప్రపంచ స్కిజోఫ్రెనియా అవగాహనా దినోత్సవం)

-డాక్టర్. కేశవులు. ఎండి. సైకియాట్రీ

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

Next Story