- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆద్యకళను కాపాడండి.. చరిత్రను చెరిపేయొద్దు!
ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు ఐదు దశాబ్దాలుగా సేకరించిన వేలాది అరుదైన జానపద, పురావస్తు కళాఖండాలకు శాశ్వత మ్యూజియం అవసరంపై విశ్లేషణ. ఆద్యకళ పరిరక్షణ, ప్రభుత్వ నిర్ణయం, తెలుగు విశ్వవిద్యాలయంలో నెలకొన్న వివాదంపై ప్రత్యేక కథనం.

హరప్పా, మొహంజోదారో తవ్వకాలు నాలుగు వేల ఏళ్ల క్రితపు సింధూ నాగరికతను బయటపెట్టాయి. గతకాలపు మానవ నాగరికత ఆనవాళ్లు భవిష్యత్ సమాజ నిర్మాణానికి సోపానాలుగా పనికొస్తాయి. నాగరికత విలువ తెలియనివాళ్లు ఈ రాళ్లూ రప్పల్లో ఏముంది అనవచ్చు.. కానీ, రాతి ఇసుర్రాయి పిండి మరకు రూపమిచ్చింది. తాళపత్రం కాగితానికి దారి చూపింది. వెదురు పిల్లన గ్రోవి, తోలు డప్పులు ఎన్నో నవీన వాద్యాలకు శబ్దం నేర్పాయి. తమ మూలాలను కాపాడుకొనే జాతులు వేగంగా పురోగతి చెందుతున్నాయి.
ఇక ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు దగ్గరికొద్దాం. తన జానపద పరిశోధనలో భాగంగా ఆయన అపురూప పూర్వ కళాఖండాలను సేకరిస్తూ వచ్చారు. వాటిలో ఆనాటి నిత్య వాడుక సామాగ్రి, లోహ వస్తువులు, సంగీత వాద్యాలు, పనిముట్లు, విగ్రహాలు, తాళపత్రాలు, పటాలు.. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. యాభై ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కృషి వల్ల సుమారు నాలుగు వేల కళాకృతులు సేకరించబడ్డాయి. వాటిలో వంద రకాలు దీపాలే ఉన్నాయంటే ఈ కూడిక గొప్పతనాన్ని లెక్క కట్టవచ్చు. అంతా బాగానే ఉంది కానీ ఈ విలువైన సామాగ్రిని భద్రంగా కాపాడడమే పెద్ద సమస్య అయింది. వాటితో ఆద్య కళ మ్యూజియం ఏర్పాటు చేయాలన్న కల ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
ఖాళీ భవనాలను కళాకృతులకు ఇవ్వండి!
రెండేళ్ల క్రితం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆవరణలో కొన్ని గదులను ఆద్య కళ సామాగ్రిని భద్రపరచ డానికి ఇచ్చారు. ఆనాటి వి. సి తంగెడ కిషన్ రావు చొరవతో ఓ చిన్నపాటి ప్రదర్శనశాల రూపుదిద్దుకుంది. జానపద, పురావస్తు విద్యార్థులకు, పరిశోధకులకు ఉపయుక్తంగా కొనసాగుతోంది. నగరం మధ్యలో ఉన్నందున సందర్శకులు కూడా వస్తుంటారు. ఈ మధ్య తెలుగు వర్సిటీ బాచుపల్లిలోని నూతన భవనాల్లోకి మారింది. దాంతో నాంపల్లి ప్రాంగణం చాలా మట్టుకు ఖాళీగా ఉంది. అందులో మరింత స్థలాన్ని ఆద్య కళ వస్తు సామాగ్రికి వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ జీఓ వల్ల ఎంతోకాలంగా ఎండలో, వానలో ఉన్న అద్భుత నగిషీల పెద్ద సైజు కర్ర వస్తువులను అదే ఆవరణలో గొడుగు దొరికే వీలైంది.
వర్సిటీ అంగీకరించినా ఒప్పుకోమంటే ఎలా?
అయితే ఆ ప్రభుత్వ ఉత్తర్వును అమలు చేయకుండా కొందరు విద్యార్థులు అడ్డు పడడం ఊహించని పరిణామం. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇప్పటికే ప్రాంగణంలో ఉన్న కళాకృతులను బయట వేస్తామని హెచ్చ రికలు జారీ చేసే దాకా వారు వెళ్లారు.. జయధీర్ తిరుమలరావు ఆ ఆవరణను స్వాధీనం చేసుకుంటున్నారని వారు ఆరోపించడం పూర్తిగా అర్థరహితం. ఇంతకాలం ఆద్య కళ సముదాయానికి ప్రభుత్వ సహాయం లభించలేదు. ఇప్పుడు కనీసం నీడ కల్పించడానికి సిద్దపడగా విద్యార్థుల పేరిట కొందరు పని కట్టుకుని, కావాలని అడ్డు నిలవడం విచారకరం. ఆద్యకళ పట్ల వీరికి వ్యతిరేకత ఎందుకు? ఉస్మానియా, తెలుగు వర్సిటీల్లో చదివి, పరిశోధించి, బోధించిన తిరుమల రావును ప్రైవేటు వ్యక్తి అనడంలో ఔచిత్యమేమి? వీరి ఆందోళన వ్యక్తిపైనా.. లేక పురావస్తు పరిరక్షణపైనా.. అనే స్పష్టత అవసరం.
ప్రాణం పెట్టి కాపాడితే ఇంత రాద్ధాంతమా?
ఆద్యకళ ప్రదర్శనలు చూసిన వారెవరైనా వాటి కోసం మ్యూజియం అవసరమని ఒప్పుకుంటారు. సాలార్ జంగ్ మ్యూజియం కూడా పురావస్తు ప్రదర్శనశాలయే. తిరుమలరావు సేకరించిన భిన్న సామాగ్రిని కూడా పొందికగా గదుల్లో ఏర్పాటు చేస్తే పెద్ద మ్యూజియం అవుతుంది. నిజాం వద్ద ప్రధానిగా పని చేసిన సాలార్ జంగ్ కులీనుడు, సంపన్నుడు. తిరుమలరావు రిటైర్డ్ ప్రొఫెసర్, 75 ఏళ్ల వృద్ధుడు. దేశ దిమ్మరిగా తిరిగి, లక్షల రూపాయల సొంత సొమ్మును వెచ్చించి, ప్రాణం పెట్టి వీటిని కూడబెట్టారు. వాటి సంరక్షణకు, కిరాయిలకు లక్షలు ఖర్చవుతోంది. ఇదేదీ అర్థం చేసుకోనివాళ్లు అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారు.
కొందరి వ్యతిరేకత జాతి హితానికి కీడు..
కొందరు విద్యార్థులు అడ్డుపడినంత మాత్రాన ఒక మహత్తర కార్యం నిలిచిపోకూడదు. విలువైన కళా సంపదను కాపాడే బాధ్యత ప్రభుత్వాలది, ప్రజలది. ఆద్యకళ పరిరక్షణకు అడ్డుకుంటున్న వారిపై యూనివర్సిటీ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాలకు వ్యక్తిగత అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు అడ్డుకారాదు. ఆదేశాల అమలుపై వర్సిటీ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే జీఓ కార్యరూపం అయ్యేలా ప్రభుత్వ విభాగాలు చర్యలు తీసుకోవాలి. ఆద్య కళ మ్యూజియంను అడ్డుకునే వారి చర్యలను నిరసిస్తూ, ప్రభుత్వ ఆదేశాలను వర్సిటీ అధికారులకు తమ బాధ్యతగా అమలు చేయాలని 'ఆద్య కళ పరిరక్షణ కమిటీ' పిలుపునిస్తోంది. ఇందుకు సంబంధించిన సమావేశం 2026 జులై 4న నాడు ప్రెస్ క్లబ్, సోమాజిగూడలో 2 గంటలకు జరుగుతుంది. ఆద్యకళ పరిరక్షణకు సహకరించాలని కోరుతున్నాం.
- బద్రి నర్సన్
94401 28169






