సంతాల్ సమర యోధులు..

by Ravi |   (  Updated:2026-07-26 00:30:33  IST  )

1855లో బ్రిటిష్ పాలన, జమీందారీ దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన సంతాల్ హూల్ తిరుగుబాటు, సిద్ధూ–కాన్హూ ముర్ము సోదరుల వీరోచిత పోరాటం, హూల్ దివస్ ప్రాముఖ్యత, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆదివాసీల చారిత్రక పాత్ర..

సంతాల్ సమర యోధులు..
X

ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు వినగానే దేశంలోనే అతిపెద్ద గిరిజన సమూహమైన సంతాల్ తెగ గుర్తుకు వస్తుంది. సంతాల్ తిరుగుబాటు వీరులైన సిద్ధూ–కాన్హూ ముర్ముల వారసత్వాన్ని ఆమె ప్రతిబింబిస్తారని చెప్ప వచ్చు.. జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లా భోగనాడిహ్ గ్రామంలో సిద్ధూ (1815), కాన్హూ (1820) జన్మిం చారు. సిద్ధూ, కాన్హూ, చాంద్, బైరవ్ అనే నలుగురు సోదరులు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పోరా డారు.. సంతాల్ సమాజాన్ని ఏకం చేసేందుకు సంప్ర దాయ పద్ధతుల్లో ప్రజల్లో చైతన్యం కల్పించారు. మారడ్ బురు, జాహెర్ తమకు దర్శనమిచ్చి స్వరాజ్యం స్థాపించాలని ఆదేశించారని, కుల దేవత కూడా ఆంగ్లేయులను తరిమికొట్టాలని చెప్పిందని ప్రచారం చేశారు. సాలవృక్షం ద్వారా ఐక్యత సందేశాన్ని గ్రామాలన్నింటికీ చేర్చారు.. జమీందారీ వ్యవస్థ, ఆంగ్లేయుల దోపిడీకి వ్యతిరేకంగా 1855 జూన్ 30న భోగనాడిహ్‌లో భారీ సభ నిర్వహించారు. దాదాపు పదివేల మంది మాంజీలు పాల్గొన్న ఈ రోజును "హూల్ దివస్"గా గుర్తిస్తారు. "ఆంగ్లేయులారా! మా భూమిని విడిచిపోండి" అంటూ నినాదాలు చేశారు. సిద్ధూను రాజుగా, కాన్హూను మంత్రిగా, చాంద్‌ను సలహాదారుగా, బైరవ్‌ను సేనాధిపతిగా ఎన్నుకున్నారు. ఉద్య మంలో పాల్గొన్న వారికి రక్షణ కల్పిస్తూ, అందరూ ఆర్థిక సహాయం చేయాలని సిద్ధూ–కాన్హూ పిలుపునిచ్చారు.. అనంతరం తిరుగుబాటు ఉధృతమై ఆంగ్లేయ అధికా రులను భయభ్రాంతులకు గురిచేసింది. ఉద్యమాన్ని అణచి‌వేయడానికి 1855 జూలై 10న మేజర్ ఎఫ్.డబ్ల్యూ. వార్డ్ నేతృత్వంలో సైన్యాన్ని పంపినా తొలి దశలో తిరుగు బాటుదారులు ప్రతిఘటించారు. అయితే తరువాత జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 15 వేల మంది సంతాలులు ప్రాణాలు కోల్పోయారు. చాంద్, బైరవ్ యుద్ధంలో మరణించగా, సిద్ధూ, కాన్హూ నమ్మకద్రోహం కారణంగా పట్టుబడి 1856 జూలై 26న ఉరితీయబడ్డారు. వారి త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ సంతాల్ గిరిజను లు నేటికీ హూల్ దివస్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారు. వారి జ్ఞాపకార్థం ప్రభుత్వం స్మారకాలు, విద్యాసంస్థలను ఏర్పాటు చేసింది.

(నేడు సిద్దూ - కాన్హూల వర్ధంతి)

-గుమ్మడి లక్ష్మీనారాయణ,

91822 96576

Next Story