- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీరియడ్స్ ప్యాడ్ అత్యవసరమే.. ఆడబిడ్డ ఆత్మగౌరవానికి అండగా నిలుద్దాం!
ప్రయాణ సమయంలో అనుకోకుండా పీరియడ్స్ వచ్చిన మహిళలు, బాలికలు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు, బస్టాండ్‌లలో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉంచాలనే సామాజిక అవసరంపై ఈ వ్యాసం దృష్టి సారిస్తోంది.

ప్రయాణంలో అనుకోని సమయంలో పీరియడ్స్ రావడంతో ఒక అమ్మాయి బస్సులో ఇబ్బంది పడుతోంది. ఆమె తల్లి సహాయం కోరగా, నేను వెంటనే ప్యాడ్స్ కొనిచ్చాను. ఆ సమయంలో తల్లి కళ్లలోని కృతజ్ఞత, ఆ అమ్మాయి ముఖంలోని ఉపశమనం చూసి ఒక ప్రశ్న కలిగింది. ఒక ఆడపిల్ల ఆత్మగౌరవం, ఆరోగ్యాన్ని కాపాడటం కేవలం కుటుంబ బాధ్యతేనా? సమాజం బాధ్యత కాదా? మహిళల రక్షణ, ప్రయాణ సౌకర్యాల గురించి మాట్లాడే మన ప్రభుత్వాలకు, అలాగే మన బస్ సంస్థకు ఈ విషయంలో ఒక ప్రత్యేక బాధ్యత ఉండాలి కదా? మనం బస్సుల్లో ప్రయాణికుల రక్షణ కోసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు పెడతాం, అత్యవసరమైతే వాడుకోవడానికి మందులు ఉంచుతాం. మరి మహిళలకు ప్రకృతి సిద్ధంగా వచ్చే ఈ నెలసరి (పీరియడ్స్) అత్యవసర పరిస్థితి కాదా? ప్రయాణంలో అనుకోకుండా పీరియడ్స్ వస్తే ఆ ఆడబిడ్డ పడే నరకం వర్ణనాతీతం. ఆ సమయంలో వారు పడే మానసిక, శారీరక వేదనను దూరం చేయడం మన బాధ్యత. అందుకే నాదొక చిన్న విన్నపం– మన బస్టాండ్‌లలో, ప్రతి బస్సులో ఒక ఒక చిన్న బాక్స్ ఏర్పాటు చేసి అందులో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉంచితే ఎంత బాగుంటుంది? ఇది కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదు... ప్రయాణిస్తున్న మహిళ ఆత్మగౌరవాన్ని, ఆమె ఆరోగ్యాన్ని గౌరవించడం. ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రతి ప్రభుత్వానిది, ప్రతి సంస్థది, ప్రతి పౌరుడిది. ఆర్టీసీ బస్సుల్లో ఈ చిన్న మార్పును తీసుకొస్తే, ఎంతోమంది ఆడబిడ్డలకు మనం అండగా నిలబడిన వాళ్లమవుతాం.
-మహ్మద్ సద్దాం
మానవ హక్కుల న్యాయవాది






