- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్కం చెరువు వివాదం: చట్టం అందరికీ సమానమేనా?
సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ వివాదంలో హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు, హైడ్రా చర్యలపై తలెత్తిన ప్రశ్నలు, ప్రభుత్వ నివేదికలపై సందేహాలు, చెరువుల పరిరక్షణలో పారదర్శకత..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ పేరుతో గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున ఆక్రమణల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైడ్రా ఏర్పాటుతో ప్రభుత్వ యంత్రాంగం అనేక నిర్మాణాలను కూల్చి వేసింది. అయితే సల్కం చెరువు పరిధిలోని ఒవైసీ విద్యాసంస్థల భవనాల విషయంలో హైకోర్టులో జరిగిన పరిణామాలు ఇప్పుడు అనేక ప్రశ్నలకు తెరతీశాయి. రెవెన్యూ, నీటిపారుదల శాఖలు హైకోర్టుకు సమ ర్పించిన నివేదికలో ఆ భవనం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిలో లేదని పేర్కొన్నాయి. దీనిపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మ్యాప్‌లను పరిశీలిస్తే ఆక్రమణ కనిపిస్తోందని, గతంలో ఉన్న ఎఫ్‌టీఎల్ ఇప్పుడు ఎలా తగ్గిందని ప్రశ్నించింది. అంతేకాదు, "ప్రభుత్వానికి కావాల్సిన వారి నిర్మాణాలను కూల్చకుండా వదిలేస్తున్నారా?" అనే ప్రశ్నను కూడా లేవనెత్తింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మున్సిపల్ శాఖ, హెచ్ఎండీఏ తమ నివేదికలను సమర్పించకపోవడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది. చెరువుల సంర క్షణలో హైడ్రా కఠినంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వం తరచూ చెబుతోంది. చిన్న నిర్మాణాల నుంచి పెద్ద భవనాల వరకు కూల్చివేతలు జరిగాయి. అలాంటప్పుడు సల్కం చెరువు విషయంలో అవే ప్రమాణాలు అమలవ్వాలి కదా.. ఈ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై పారదర్శకత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. హైడ్రా చర్యలు రాజకీయ అనుబంధాలు, ప్రభావం, వ్యక్తిగత సంబంధాల ఆధారంగా మారుతున్నాయనే భావన కూడా ప్రజల్లో కలగకూడదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిజంగా ఆ కాలేజీ నిర్మాణం సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌లో లేకపోతే ఆ ఆధారాలను స్పష్టంగా వివరించాలి. ఉంటే చట్టం ముందు ఎవరైనా ఒకటేనని నిరూపించాలి. అప్పుడే ప్రజలకు హైడ్రాపై, ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. సల్కం చెరువు కేసు ఇప్పుడు ఒక భవనం గురించిన వివాదం మాత్రమే కాదు. చట్టం అందరికీ సమానమా? అనే పెద్ద ప్రశ్నకు సమాధానం.
- చెన్ను పెద్దిరాజు,
76599 99996






