తరతరాలను తడిపిన మధుర గానం..

by Ravi |   (  Updated:2026-07-14 01:00:32  IST  )

భావాలకు స్వరరూపం ఇచ్చిన గానకోకిల ఎస్. జానకి సంగీత ప్రయాణం, ఆమె మధుర గానం, వేలాది చిరస్మరణీయ పాటలు, జాతీయ పురస్కారాలు, భారతీయ సినీ సంగీతానికి ఆమె అందించిన అపూర్వ సేవలు

తరతరాలను తడిపిన మధుర గానం..
X

ఆమె స్వరం.. ఉరికే జలపాతం.. ఆమె స్వరం వినిపిస్తే అది కేవలం పాట కాదు.. భావాల ప్రవాహం. అది చెవుల్లోకి చేరే సంగీతం మాత్రమే కాదు, హృదయంలోకి ప్రవహించే అనుభూతి. ఆమె గానం మృదు మధురం. "నీలి మేఘాలలో.." అంటూ మనసును ఆకాశంలో విహరింపజేస్తుంది. "సిరిమల్లె పువ్వా.." అంటూ ప్రేమను పరిమళింపజేస్తుంది. "నీ లీల పాడెద దేవా.." అంటూ భక్తిరసంలో ముంచేస్తుంది. ఆమె ఆలపించిన ప్రతి గీతం ఒక జ్ఞాపకం.. ప్రతి రాగం ఒక జీవితకాల మధురస్మృతి. నవరసాలకు నాదరూపం.

ప్రేమ, విరహం, విషాదం, ఉల్లాసం, భక్తి, తల్లితనం, చిలిపి తనం.. ఏ భావాన్నైనా తన గొంతులో అలవోకగా పలికించగలిగిన అపూర్వ గాయని ఎస్. జానకి. పసిపాప పలుకులైనా, కోయిల కుహుకుహూలైనా, తల్లి లాలిపాటైనా, ప్రకృతి పరవశమైనా అన్నీ ఆమె స్వరంలో సహజంగా విరబూశాయి. ఒకే గాయని గొంతులో ఇన్ని భావాలు, ఇన్ని రంగులు, ఇన్ని రూపాలు పలకడం భారతీయ సినీ సంగీత చరిత్రలో అరుదైన విశేషం. అందుకే ఆమె గానం తరతరాల శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

పాటల పూదోటలో మధురామృతం..

"నీ లీల పాడెద దేవా", "నీలి మేఘాలలో", "పగలే వెన్నెల", "సిరిమల్లె పువ్వా", "జిలిబిలి పలుకుల", "గోవులు తెల్లన"... ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె పాడిన ప్రతి పాట ఒక అమృత గుళికే. శాస్త్రీయ సంగీతపు గంభీరత నుంచి జానపద గీతాల ఉత్సాహం వరకు.. మధురమైన మెలోడీల నుంచి ఉత్సాహభరితమైన మాస్‌ పాటల వరకు.. ప్రేమగీతాల నుంచి భక్తి గీతాల వరకు.. ప్రతి శైలిలోనూ ఆమె తనదైన ముద్ర వేసింది. సంగీత దర్శకులు ఊహించిన భావాన్ని, గేయ రచయితలు రాసిన పదాల ఆత్మను, తెరపై కనిపించే పాత్రల హృదయాన్ని తన స్వరంలో ప్రతిబింబింపజేయడం జాన కమ్మకే సాధ్యమైంది.

సాధనే ఆమె విజయ రహస్యం

గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామంలో జన్మించిన జానకి, చిన్ననాటి నుంచే సంగీతాన్ని శ్వాసగా మలచుకున్నారు. నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీత శిక్షణ పొంది, 1957లో సినీ గాయనిగా అడుగుపెట్టారు. తొలి పాటలు విషాద గీతాలే అయినా, అదే ఆమె విజయానికి శ్రీకారం అయింది. మొదటి ఏడాదిలోనే ఆరు భాషల్లో వందకు పైగా పాటలు పాడి అరుదైన రికార్డు సృష్టించారు. ఆమె సాధనకు వయస్సు అడ్డుకాలేదు. స్వరానికి కాలం హద్దులు పెట్టలేకపోయింది. అందుకే ఆమె గాత్రం తరతరాలకు చిరస్మరణీయంగా నిలిచింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, ఒరియా, బెంగాలీ, సింహళ, తుళు, సౌరాష్ట్ర, ఇంగ్లీష్, జపనీస్, జర్మన్ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి భారతీయ సంగీతానికి విశిష్టమైన సేవ చేశారు. దాదాపు 30 వేలకుపైగా పాటలు పాడిన ఆమె గాన ప్రస్థానం ప్రపంచ సంగీత చరిత్రలో అరుదైన అధ్యాయం. భాష మారినా భావం మారలేదు. స్వరం మారలేదు. శ్రోతల హృదయాలను తాకే ఆ మాధుర్యం ఎక్కడా తగ్గలేదు.

సంగీతానికి ఇంటిపేరు..

నాలుగు జాతీయ పురస్కారాలు, పలు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, నంది పుర స్కారాలు, తమిళనాడు, కేరళ, ఒడిశా ప్రభుత్వ గౌరవాలు.. ఇవన్నీ ఆమె ప్రతిభకు నిదర్శనాలు మాత్రమే. కానీ ఆమెకు దక్కిన అతిపెద్ద పురస్కారం కోట్లాది మంది సంగీతాభి మానుల ప్రేమ. ఐదు దశాబ్దాలకు పైగా ఆమె పాటలతో పెరిగిన తరాలు, ఆమె గాత్రాన్ని తమ జీవితాల్లో ఒక భాగంగా భావించాయి. అదే ఆమె అసలైన విజయగాథ. ఆమె గొంతుకు అసాధ్యం అనే మాటే లేదు. "పలకని స్వరం లేదు.. అపస్వరం తప్ప" అనే ప్రశంస ఆమెకే సొంతం. గాయనిగా మాత్రమే కాదు, సంగీత దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చాటుకున్న ఆమె, సంగీతానికి మరో పేరు "జానకి" అనే స్థాయికి ఎదిగారు.

ఎప్పటికీ మార్మోగే స్వర స్మృతి..

కోయిల పాడాలంటే వసంతం రావాలి. కానీ జానకమ్మ మాత్రం ప్రతి ఋతువునూ వసంతంగా మార్చిన గానకోకిల. ఆమె పాటలు వింటే కాలం ఆగిపోతుంది. మనసు అలలపై తేలే మల్లెపువ్వులా మారిపోతుంది. ఉరికే జలపాతంలా, మల్లెజాజి పరిమళంలా, గంగా ప్రవాహంలా ఆమె స్వరం తరతరాల హృదయాల్లో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆమె పాడిన పాటలు కేవలం సినీ గీతాలు కావు.. అవి మన జీవితాల భావోద్వేగాల స్వరరాగాలు. ప్రతి తెలుగు ఇంటి జ్ఞాపకాలలో, ప్రతి సంగీతాభిమాని హృదయంలో, ప్రతి రాగంలో, ప్రతి మౌనంలో.. జానకమ్మ స్వరం చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది. స్వరం ఆగిపోవచ్చు... కానీ ఆ స్వరంతో పుట్టిన అనుభూతి ఎన్నటికీ ఆగదు. అదే ఎస్. జానకి. అదే సంగీతం. అదే చిరస్మరణీయ గానయానం.

(ఎస్. జానకికి అక్షరాంజలి)

- వాడవల్లి శ్రీధర్

99898 55445

Next Story