- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుణ్యక్షేత్రాల్లో దోపిడీ.. భక్తుల విశ్వాసానికి పరీక్ష!
అయోధ్య రామమందిరం ట్రస్ట్‌పై వచ్చిన విరాళాల నిర్వహణ, భూముల కొనుగోళ్లు, పారదర్శకత, జవాబుదారీతనం సంబంధిత ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

అయోధ్య రామమందిరం కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పవిత్ర క్షేత్రానికి భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణపై ఇటీవల వెలుగులోకి వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. హుండీ నగదు, బంగారం–వెండి కానుకలు, భూముల కొనుగోళ్లు, ట్రస్ట్ పరిపాలనలో పారదర్శకత వంటి అంశాలపై వివాదాలు తలెత్తడంతో, సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికి తీయాలనే డిమాండ్ బలపడుతోంది. ఈ ఆరోపణల నిజానిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉన్నప్పటికీ, దేవాలయాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఎంత అవసరమో మరోసారి గుర్తు చేస్తున్నాయి.
అటు ఓట్లు, ఇటు నోట్లు దండుకోవడానికి ‘భక్తి’కంటే పెద్ద అడ్డదారి ఏముంటుంది? అనే చేదు నిజానికి ఈ వందల కోట్ల కుంభకోణమే నిదర్శనం. రామమందిర ట్రస్ట్‌లో భక్తి అనేది వ్యాపారంగా, రాజకీయ గెలుపు గుర్రంగా మారింది. దేశంలోని ప్రజలు దాచి ఇచ్చిన పవిత్ర విరాళాలను, ఆధ్యాత్మిక ముసుగులో ఉన్నవారే కాజేస్తూ దొరికిపోవడం సాధారణ అవినీతి కాదు. దేవుడి పేరుతో జరిగిన గుండె చీల్చే నమ్మక ద్రోహం. ఓట్ల వేట కోసం దేవుడిని, నోట్ల వేట కోసం భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టిన ఈ దైవద్రోహంపై సమాజం నేడు జాగృతం కావాల్సిన అవసరం ఉంది.
భక్తుల విరాళాల సొమ్ముతో..
ఈ వ్యవస్థీకృత దోపిడీ వెనుక నమ్మశక్యం కాని దారుణాలు దాగున్నాయి. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాజీ డ్రైవర్ ‘టిన్నూ’ హుండీ తాళాలు చేతిలో పెట్టుకొని దొంగ తనాలు చేస్తున్నారు. సిట్ దర్యాప్తులో కోట్ల రూపాయలు రికవరీ అయ్యాయి. ఈ పాపపు సొమ్ముతో నిందితులు రాత్రికి రాత్రే లగ్జరీ కార్లు, ప్లాట్లు కొన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. భక్తుల సొమ్మును పేడకుప్పల కింద, అలమరాల్లో దాచడం ఘోర అవమానకరం. నగదు లెక్కింపు సమయంలో రూ. 6 నుంచి రూ. 8 లక్షలు నిత్యం నొక్కేస్తూ, నోట్ల కట్టలను జేబుల్లో, సాక్సుల్లో దాచి తరలించారు. దొంగతనం దాచేందుకు 180 రోజుల సీసీటీవీ ఫుటేజీని 45 రోజులకే డిలీట్ చేశారు. చంపత్ రాయ్ బంధు వర్గమైన బన్సల్ కుటుంబం ఆలయ పవిత్రత నీడలోనే కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నడిపిన సత్యాలు బయటకొ స్తున్నాయి. అంతేకాదు భక్తులు సమర్పించిన బంగారు, వెండి కానుకలను కరిగించి ‘బంగారు బిస్కట్లు’గా మార్చేసినట్టు తెలుస్తోంది. ఓ న్యూస్ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ ప్రకారం.. చంపత్ రాయ్‌తో చేతులు కలిపి దాదాపు 200 మందితో కూడిన ఒక భారీ లూటీ నెట్వర్క్ అయోధ్యలో కానుకలు దొంగిలించి, కర్ణాటకకు తరలించి కరిగించే దందా నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. ముంబై భక్తుడు ఆలయ సిబ్బంది కోసం పంపిన రెండు ట్రక్కుల స్వెటర్లలో.. కేవలం 40 మాత్రమే ఇచ్చి, మిగిలినవన్నీ ట్రస్టు సీనియర్ సభ్యుడు అనిల్ మిశ్రా మార్కెట్లో అమ్ముకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఇంత జరుగుతున్నా.. సమాచారం ఇవ్వకుండా..
అన్నిటికంటే పరాకాష్టగా, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి సమర్పించిన రూ. 5 కోట్ల విలువైన, 147 కిలోల బంగారు ‘రామచరిత్ మానస్’ గ్రంథాన్ని కూడా ప్రదర్శన నుంచి మాయం చేసేశారు. ఈ పవిత్ర విరాళాలను కాపాడాల్సిన వారి నిర్లక్ష్యం భక్తుల హృదయాలను నట్టేట ముంచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన భూముల బేరం ఈ కుంభ కోణంలో మరో పెద్ద సంచలనం ఆలయ నిర్మాణానికి వాడిన 1.59 ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం ముందే ‘ప్రభుత్వ భూమి’గా ప్రకటించినప్పటికీ, అదే భూమిని శ్రీరామజన్మభూమి ట్రస్టు ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి రూ. 23.61 కోట్లకు కొనుగోలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. గతంలోనూ రూ. 2 కోట్ల భూమిని కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో రూ. 18.5 కోట్లకు ట్రస్టుకు అమ్మడం వెనుక, నకిలీ ప్రసాదం పేరిట రూ. 3.85 కోట్ల సైబర్ మోసాల వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. భక్తులు సమర్పిస్తున్న కానుకలపై తమకు ఎలాంటి హక్కు ఉండబోదన్న హామీ పత్రాన్ని కూడా ట్రస్టు అధికారులు బలవంతంగా తీసుకుంటున్నారని తేలింది. ఇంత జరుగుతున్నా, ఆర్టీఐ కింద ట్రస్టు రికార్డులు ఇస్తే ‘ప్రాణాలకే ముప్పు’ అంటూ కేంద్ర హోంశాఖ సమాచారాన్ని తొక్కిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.
బద్రినాథ్ ఆలయంలోనూ దోపిడీ ఆరోపణలు..
ఈ దైవద్రోహం తీవ్రత ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక ఒత్తిడిని పెంచుతోంది. స్వయంగా ప్రధాని పాల్గొన్న రామమందిరంలోనే ఇలా వందల కోట్ల దోపిడీకి తెగబడితే, ఇక దేశంలో ఉన్న ఇతర సాధారణ మందిరాలలో జరిగే అక్రమాలకు అడ్డేముంటుంది?. ఆశ్చర్యకరంగా, హిమాలయాల్లోని పవిత్ర ‘బద్రినాథ్’ ఆలయంలో సైతం ట్రస్టు చైర్మన్ పీఏనే భక్తుల కానుకలు కాజేశాడంటూ దర్యాప్తు కమిటీని వేశారు. దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలన్నీ ఇలాంటి భక్తి ముసుగు దొంగల పాలవడం హిందూ సమాజానికి కోలుకోలేని దెబ్బ. ‘ఓటు చోరీ, సీటు చోరీ, చందాల చోరీ.. ఇదే బీజేపీ వ్యూహం’ అంటూ విపక్షాలు గర్జిస్తుంటే, స్థానిక న్యాయవాదులే నేడు ట్రస్టీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆందోళనకు దిగారు. రామాయణంలో రాముడు ధర్మానికి ప్రతీక అనే భావన ఉంది. “రామో విగ్రహవాన్ ధర్మః” – మరి ఆ ధర్మం ఇప్పుడు ఎక్కడ ఉంది? భక్తిని రాజకీయం చేస్తూ, దేవుడి పేరిట సాగుతున్న ఈ ఆర్థిక, అధికార దౌర్జన్య పాలనను సమాజం ప్రశ్నించాలి. సిట్ దర్యాప్తు పూర్తి స్వేచ్ఛగా జరిగి, సూత్రధారులందరినీ చట్టం ముందు నిల బెట్టాలి. సత్యం, పారదర్శకత లేని ఆరాధన వ్యర్థం. రాముడు సాక్షిగా, ఈ నమ్మక ద్రోహాలకు సరైన శిక్ష పడాల్సిందే!
-కృష్ణ కానూరి,
79813 05779






