ప్రపంచీకరణకు రివర్స్ గేర్.. యువత అమెరికా కలలు కల్లలేనా?

by Ravi |   (  Updated:2025-09-25 01:15:32  IST  )

దుర్మార్గమైన 50 శాతం టారిఫ్ వడ్డన తర్వాత ట్రంప్ అన్నయ్య తన భారతీయ సోదరులకు మరో దుర్మార్గపు వడ్డన సిద్ధం చేశారు.

ప్రపంచీకరణకు రివర్స్ గేర్.. యువత అమెరికా కలలు కల్లలేనా?
X

దుర్మార్గమైన 50 శాతం టారిఫ్ వడ్డన తర్వాత ట్రంప్ అన్నయ్య తన భారతీయ సోదరులకు మరో దుర్మార్గపు వడ్డన సిద్ధం చేశారు. హెచ్‌వన్-బి వీసా ఫీజు పెంచి ఇప్పటికే అతలాకుతలమైపోతున్న భారత ప్రజానీకానికి మరో గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చారు. హెచ్‌వన్-బి వీసా మీద పనిచేస్తున్న ఉద్యోగులు అమెరికాకు బయట ఉంటే తక్షణమే అమెరికా గడ్డమీద అడుగుపెట్టం డోయ్ అని ఢంకా కొట్టారు. ఇదే అనువైన సమయమని అమెరికాకు భారత్ నుండి ఫ్లైట్ చార్జీలు 50 వేల నుండి లక్షలకు పెంచేశారు. ఈ చర్యలతో కుదేలైపోతున్న ఐటీ రంగం మన కళ్ల ముందు కనిపిస్తోంది.

హెచ్‌వన్-బి వీసా ఉద్యోగులు ఇక నుండి తమ వీసా కోసం మూడు వేలు, అయిదు వేల డాలర్లు చెల్లించే కథకు ఫుల్ స్టాప్. నేడు అమెరికా కలలను సాకారం చేసుకోవాలనుకుంటే 85 లక్షల రూపాయలు సంవత్సరానికి వీసా కోసం మాత్రమే ఖర్చు పెట్టాల్సిన గడ్డు పరిస్థితి వచ్చింది. అంటే 1900 శాతం ఛార్జ్ పెరిగింది. సెప్టెంబర్ 20న అమెరికా కాలమానం ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త వీసాల కోసం ఇక నుండి 85 లక్షల రూపాయలను సంవత్సరానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇండియన్స్ కోసమే 70 శాతం వీసాలు..

హెచ్‌వన్-బి వీసాను 1990లో అమెరికా అమలు చేసింది. టెంపరరీగా తమ దేశంలోని కొన్ని రంగాల్లో పనివారు అవసరం అని భావించి ఈ వీసాను ప్రమోట్ చేసింది. 2023లో 23 శాతం ఇండియన్ ఇంజినీర్లు అమెరికాలో ఈ వీసా ద్వారా పనిచేశారు. అది 2025లో 65 శాతానికి చేరుకుంది. ఇప్పడు ఈ ఫీజు పెంచడంతో అమెరికాలో ఈ వీసాలను ఉపయోగించుకున్న కొన్ని కంపెనీలు నేడు ఇరకాటంలో పడ్డాయి. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, 2024లో మూడు లక్షల 99‌వేల‌ 395 మందికి హెచ్‌వన్-బి వీసా మంజూరు కాగా, అందులో భారతదేశం శాతం 71గా ఉంది. చైనా శాతం 11.7గా ఉంది. 2022లో భారత దేశం శాతం 81గా ఉంది. అక్టోబర్ 2022 నుండి సెప్టెంబర్ 2023 వరకు మంజూరైన నాలుగు లక్షల వీసాలలో 72 శాతం వీసాలు ఇండియన్స్ కోసమే కంపెనీలు వాడుకున్నాయి. ఈ లెక్కన చూస్తే, అత్యంత ప్రభావం భారతదేశం మీద మాత్రమే పడబోతుందని స్పష్టమవుతుంది.

ఐటీ బూమ్‌ పేరుతో..

ప్రపంచీకరణ తర్వాత 1990ల నుండి వచ్చిన ఐటీ బూమ్ భారతదేశ కంపెనీలకు, భారతదేశ యువతరానికి ప్రాణవాయువును అందించింది. ఇంజనీరింగ్ డిగ్రీలు చేసి అమెరికా వెళ్లి లక్షలు గడించి తమ కలల్ని సాకారం చేసుకోవాలనుకున్న ఒక తరం ఆ రోజుల్లో సిద్ధమయింది. తమ కుటుంబ సభ్యులు యూఎస్‌లో ఉన్నారని చెప్పుకుంటూ గర్వంగా ఫీల్ అయ్యే ఒక అసహజమైన సాంస్కృతిక వాతావరణం ఏర్పడింది. దానికి తోడు అమెరికా అల్లుడు అంటూ వివాహాల మార్కెట్ రేట్లు కూడా అలానే పెరిగాయి. ఇంజనీరింగ్ కాలేజీలు అమెరికా ఆశలు అమ్ముకొని పుట్టగొడుగుల్లా వ్యాపించి లక్షలు వసూలు చేసేసి డిమాండ్ కంటే సప్లైని పెంచేసి లాభాల సంచుల్ని నింపుకున్నాయి.

వీసా ఖర్చులు ఎవరు భరించాలి?

అమెరికాలో భారతీయ నిపుణులకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు వీసా ఖర్చులను కంపెనీలే భరిస్తాయి. అయితే అది అప్పుడున్న పరిస్థితి. ప్రస్తుతం సంవత్సరానికి 85 లక్షలు చెల్లించడానికి దాదాపు 70 శాతం ఉద్యో గులకు అలాంటి జీతాలు లేవు. మరి కంపెనీలు ఇంత అధిక శాతాన్ని వీసా కోసం ఆ దేశాలకు ఎందుకు అందిస్తాయి? అన్నది ఒక ప్రశ్న. కాబట్టి ఈ రిస్కు ఏ కంపెనీలు కూడా ఇకముందు తీసుకునే పరిస్థితిలో ఉండవు. అవి ఐటీ స్టాప్ మీద విడిచి పెట్టేస్తాయి. వారు కూడా అంతంత ఫీజులను చెల్లించే స్థితిలో ఉండకపోవడం ద్వారా కొత్తవారు అమెరికా కలల్ని కలలుగానే ఉంచేసుకుంటారు.

ఇప్పుడు వారితో దేశానికి ముప్పా?

అంతర్జాతీయ పెట్టుబడికి ఒక నేల కావాలి. అత్యంత చవగ్గా దొరికే శ్రామికులు కావాలి. వారు శారీరక శ్రామికులైనా, మేధా శ్రామికులైనా సూత్రం ఒక్కటే. అందుకే ప్రపంచీకరణ అంటూ వారి ప్రయోజనాలకు పనికొచ్చే విధంగా వ్యవస్థను అటూ ఇటూ సర్దు కున్నారు. చవగ్గా దొరికే శ్రామికుల్ని గతంలో తేయాకు పంటల్లో బ్రిటీష్ వారు ఉపయోగించిన విధంగానే, అమెరికాలో ఐటీ పరి శ్రమలో కూడా ఉపయోగించుకున్నారు. ప్రయోజనం పొందింది రెండు వైపులా కార్పొరేట్ వర్గాలే.. మరలా ఇదే ఐటీ శ్రామికులు దేశానికి ముప్పు అని కొత్త ప్రవ చనాలు వల్లిస్తున్నారు..

ప్రయోజనమంతా కార్పొరేట్లదే..!

ఐటీ శ్రామికులు అమెరికా లాంటి దేశాలకు పయనించడం ద్వారా ఆ దేశాలకు బాగా పనికొచ్చింది. ప్రయోజనం పొందింది ఆ దేశాల కార్పొరేట్ వర్గమే. మరలా అవుట్ సోర్సింగ్ అంటూ అవే సర్వీసులు మరింత తక్కువ జీతాలకు భారతీయ శ్రామికులతో పని చేయించి ప్రయోజనం పొందింది మరలా కార్పొరేట్ వర్గమే. ఇదే శ్రామికులు సరైన ఉత్పత్తిని అందించడం లేదని పన్నెండు, పద్నాలుగు గంటలు పని చేయమని సెల విచ్చింది అవే కార్పొరేట్లు. అంతకంటే ఉన్నతమైన మరో మార్గం లేక అందులోనే అడ్జస్ట్ అయిపోయిన ఒక వర్గం ఇది.

రివర్స్ అయిన ప్రపంచీకరణ..

దేశాల మార్కెట్లు ఓపెన్ చేయాలనీ, గోద్రెజ్ తాళాలు కూడా బద్దలు కొట్టేసి ఓపెన్ చేయాలనీ దాన్నే ప్రపంచీకరణ అంటారనీ, ప్రపంచీకరణలో ప్రతి దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందనీ 1990 నుండి మనకు నేర్పారు. మనం కూడా ఉత్తమ విద్యార్థుల్లాగా దాన్నే కంఠస్థం చేశాం. మరి ఇప్పుడు చూస్తే కథ, స్క్రీన్ ప్లే మరోలా మారిపోయింది.

- కేశవ్

ఆర్థిక సామాజిక విశ్లేషకులు

98313 14213

Next Story