ఇంట్లోనే గౌరవం లేదు.. యత్ర నారీ.. అట

by Ravi |   (  Updated:2026-03-08 01:15:58  IST  )

సమాజంలోనే కాదు, ఇంట్లో కూడా మహిళలు అనేక వివక్షలు, ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. గృహిణులు మరియు ఉద్యోగ మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళలకు గౌరవం ఎందుకు అవసరం అనే విషయాలను ఈ వ్యాసం వివరిస్తుంది.

ఇంట్లోనే గౌరవం లేదు.. యత్ర నారీ.. అట
X

'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా' అంటే.. ఎక్కడ స్త్రీలు గౌరవించబ డతారో అక్కడ దేవతలు కొలువుంటారని అర్థం. కానీ నేటి సమాజంలో స్త్రీలు ఎక్కడ గౌరవించబడుతున్నారు? సమాజం గురించి పక్కన పెడితే ఆమెకు సొంతింట్లోనే గౌరవం దక్కటం లేదు. చిన్నతనంలోనే ఆడపిల్లలు అనేక సమస్యలు, వివక్షలను ఎదుర్కొంటూ పెరుగుతారు. పెద్దయ్యాక సమాజంలో అనేక సవాళ్లను, ఒత్తిళ్లను అనుభవిస్తున్నారు..

చాలా కుటుంబాల్లో ఇప్పటికీ కుమారుడికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.. చదువు, అవకాశాలు, వినోదం అన్నింటిలో మగ పిల్లలకే ముందుగానే అవకాశం ఇస్తారు. చిన్నప్పటి నుంచే ఆడపిల్లలపై ఆంక్షలు విధించడం వల్ల వారి స్వతంత్రత, ఆత్మవిశ్వాసం తగ్గి, సమాజం పట్ల భయం, ఆందోళన పెరుగుతుంది.

గృహిణి జీవితం.. గుర్తింపు లేని కష్టం!

ఇక గృహిణిగా జీవిస్తున్న మహిళల పరిస్థితి మరింత దారుణం. ఇంటి పనులు, వంట పని, పిల్లల చదువులు, పెద్దల సంరక్షణ వంటి బాధ్యతలతో వారు నిత్యం సెల వనేదే లేకుండా శ్రమిస్తుంటారు.. ఇంత చేసినా, కనీసం వారికి గుర్తింపు లేకపోగా పైపెచ్చు ఇంట్లోనే ఉంటున్నావంటూ ప్రతి విషయంలో ఆమెను తక్కువచేసి చిన్నచూ పు‌గా మాట్లాడుతుంటారు. అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఆమె నిర్ణయాలకు ప్రాధ్యాన్యం ఇవ్వకపోవటంతో మహిళలు మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. తీవ్ర ఒత్తిడికి గురై తమలో తామే బాధపడుతుంటారు.

ఉద్యోగ జీవితంలో కూడా సవాళ్లే..

మహిళలు ఉద్యోగంలో సమాన బాధ్యతలు చేపడితే, చాలా చోట్ల తక్కువ వేతనం, లైంగిక వేధింపులు, అసభ్య కరమైన మాటలు, చిన్నచూపులు వంటి సవాళ్లను ఎదుర్కో‌వాల్సి వస్తుంది. ఫిర్యాదు చేయడానికి భయం, ఇక కష్టపడిన దానికి ప్రమోషన్ లేదా జీతం పెరిగితే పుట్టుకొచ్చే అఫైర్లు గురించి చర్చలు, అలాగే నైట్ షిఫ్ట్‌లు, ట్రావెల్, భద్రత సమస్యలు ఇవన్నీ కలిపి ఉద్యోగ జీవితాన్ని కష్టతరం చేస్తాయి.. అయినప్పటికీ, మహిళలు కుటుంబాన్ని పట్టించుకోవటం లేదని, తన ఇష్టానికి తిరుగుతుందని నిందలు మోయాల్సిందే.

డ్రెస్సింగ్ పై ట్రోల్స్..

ఇవి సరిపోవు అన్నట్లుగా ఆడవారి డ్రెస్సింగ్‌పై కూడా విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు.. మీరు ఇలాంటి బట్టలు వేసుకున్నారు కాబట్టే మిమ్మల్ని తప్పుడు ఉద్ధేశ్యంతో చూస్తున్నారంటూ మాట్లాడుతారు.. అలాగే అనుకున్నా.. మరీ 9 నెలల పిల్లలపై లైంగిక దాడులు ఆగటం లేదు కదా అంటే ఎవరూ మాట్లాడరు.. ఆడవారికి మాత్రం నచ్చిన దుస్తులు కూడా వేసుకునే స్వేచ్ఛే ఉండకూడదు. ఇదే ప్రశ్న అడిగితే.. బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగు అంటూ అసభ్యకరమైన పదజాలంతో నిందిస్తుంటారు. ఇలాంటివన్నీ మహిళలపై నియంత్రణ మాత్రమే కాదు.. వారి వ్యక్తిగత స్వేచ్ఛను తగ్గించడమే.. చాలా మంది ఆడవారు సమాజంలో ఎదురయ్యే ఈ కారణాల వల్లే తమ జీవితంలో వెనకబడిపోతున్నారు.

చట్టాలు ఉన్నా అమలు ఎక్కడ?

వీటన్నిటి నుంచి విముక్తి పొందడానికి మహిళల్లో మనోధైర్యం పెంచడానికి మహిళల హక్కుల పరిరక్షణ కోసం దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి.. కానీ వాటి అమలు అంతగా లేదనే చెప్పాలి.. మహిళా తనకు జరిగిన అన్యాయానికి ఫిర్యాదు చేస్తే వాటిని వేగంగా పరిష్కరించరు.. బాధితులకే తిరిగి మినహాయింపు, సమాజపు ఒత్తిడి ఉంటుంది. పోలీస్, న్యాయ వ్యవస్థలో విధాన‌పరమైన జాప్యాలు, సాక్ష్యాల సవాలు, పురుషా‌ధిక్యత వంటి కారణంగా చట్టాలు తక్షణమే అమలులోకి రావడం కష్టంగా మారింది. ఫలితంగా, మహిళలు చట్టాల ద్వారా రక్షణ పొందటం తగ్గిపోతుంది. న్యాయం పొందే అవ కాశాలు తగ్గుతున్నాయి. చట్టాలు ఉన్నా, వాటి అమలు, అవగాహన, సమాజంలోని వివక్షను అధిగమించడమే అసలైన సవాలు..

ఏమవుతావని ఎనాడైనా అడిగారా?

21వ శతాబ్ధానికి మనం చేరుకున్నప్పటికీ, ఇంకా ఆడపిల్ల పుట్టడమే సమాజానికి శాపంగా కనిపిస్తోంది. ఆపరేషన్ సిందూర్‌ను నడిపించింది ఇద్దరూ ఆడవాళ్లు నారీశక్తి, మహిళామణులు అని తెగ పొగిడారు.. మరి మీ ఇంట్లోనే ఉంటున్న మహిళలకు ఎంత విలువ ఇస్తున్నారు. మీ ఇంట్లో ఉన్నవారు భవిష్యత్తులో ఎలాంటి స్థాయిలో ఉండాలనుకుంటున్నారో ఎప్పుడైనా అడి గారా? మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. కానీ మహిళల గొప్పతనం గుర్తిం చడం ఒక్కరోజుకే కాదు, ప్రతి రోజూ ఉండాలి. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా, సమాజ అభివృద్ధికి కీ స్థంభాలు. సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు ఇవ్వడం మన బాధ్యత. మహిళలను గౌరవించడం సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది.

- ధవణి రెడ్డి యేళ్ళ

జర్నలిస్టు

Next Story