- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచానికే తలమానికం
ప్రపంచానికే తలమానికం... remembering Indian monk Swami Vivekananda

ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలో, ఎలా యోచించాలో అనే విషయాన్ని నిర్ణయించేది అతని మనస్థితి మాత్రమే. అతని బాహ్యరూపం, హావభావాలు అతడి వ్యక్తిత్వ అంచులను మాత్రమే చూపుతాయి కానీ ఆ వ్యక్తి యదార్థ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించవు. మన జీవనయానంలో ఎన్నో పనులు చేయాలనుకుంటాం.. మంచి అలవాట్లను అలవరచుకోవాలని, దురలవాట్లు వదిలేయాలని, ఏకాగ్రతతో అధ్యయనం చేయాలని అయితే వీటిని అమలుపరిచే సమయంలో మన సంకల్పాలను అమలు పరిచే ప్రయత్నాల నుంచి బలవంతంగా తిరోగమించేలా మన మనస్సు తిరుగుబాటు చేయడం సర్వసాధారణమే. ఒక అంశంపై మనసును నిలుపలేనివారిగా ఉంటాము. కారణం స్వీయ నియంత్రణ లోపించడమే. క్రమశిక్షణ లోపించిన మనసు మన శత్రువుగాను, సుశిక్షిత మనస్సు మన స్నేహితునిగాను వ్యవహరిస్తుందని భగవద్గీత పేర్కొంటుంది. కాబట్టి మన మానసిక యంత్రరచన గూర్చిన విస్పష్ట భావం మనకు ఉండాలంటారు స్వామి వివేకానంద.
వ్యక్తిత్వ వికాసం కోసం 16 సూత్రాలు
వివేకానంద 1863 జనవరి 12 న కలకత్తాలో జన్మించారు. ఆయన అసలు పేరు నరేంద్ర దత్. విద్యార్థి దశలోనే అద్భుతమైన ప్రజ్ఞాపాటావాలు ప్రదర్శించిన వ్యక్తి. మొదట్లో ఆయనను నాస్తికత్వం ప్రభావితం చేసినా, రామకృష్ణ పరమహంసను కలుసుకున్న తర్వాత 'ఆస్తికుడిగా' మారిపోయారు. మానవులలో ప్రేమ ఆధ్యాత్మికతను పెంచేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. జాతి వికాసానికి ఆయన ఇచ్చిన సందేశం నేటి యువతకు ఎంతో ఆదర్శం. ఆయన మంచి వక్త కూడాను. ఆయన విదేశాల్లో ఎన్నో సభలను నిర్వహించి దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు. మాతృభూమిని ప్రగాఢంగా ప్రేమించిన మహనీయుడు. రామకృష్ణ పరమహంస మరణానంతరం 'రామకృష్ణ మిషన్' స్థాపించి ఆయన భావజాల వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. యువత ఏం కావాలి? ఎలా ఉండాలి? లక్ష్యం వెనుక ఉండాల్సిన బృహత్ ఆలోచన ఏమిటి? అని వివరించిన మానసిక తత్వవేత్త. మానసిక, వ్యక్తిత్వ వికాస శిక్షకులు ఎంతోమంది విదేశాలలో ఉన్నా వారి విజయమంతా మిలియనీర్, బిలియనీర్ అనిపించుకోవాలనే ఆర్థిక పరమైన అంశాలకు ముడిపడి ఉంటుంది. కానీ డబ్బుతో అన్ని సమస్యలు పరిష్కరించలేమని, దాంతో సమస్యలు పాక్షికంగా మాత్రమే పరిష్కారమవుతాయని వివరించారు. డబ్బుతో అన్ని సమస్యలు పోతే వారు ప్రశాంతంగా జీవించకుండా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారనే ప్రశ్న లేవనెత్తారు. వీరి ఉద్దేశ్యంలో వ్యక్తిత్వ వికాసం గొప్పది. అందుకే ప్రతి వ్యక్తికి నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వం అవసరం అంటాడు. వ్యక్తిత్వ వికాసం తన స్వార్థం కోసం కాక సమాజం కోసం వినియోగించగలిగితేనే దానికి ప్రయోజనం ఉంటుందని వ్యక్తిత్వ వికాసానికి 16 సూత్రాల ప్రణాళిక సూచించాడు. అవి తల్లిదండ్రులను-ఉపాధ్యాయులను గౌరవించడం, దేశాన్ని ప్రేమించడం, పేదలకు-రోగులకు సేవలందించడం, స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ కలిగి ఉండటం, మనమీద మనకు పూర్తి నమ్మకం కలిగి ఉండటం, విచక్షణ, ఏకాగ్రత, సత్యపాలన, కఠోరమైన శ్రమ, శారీరక మానసిక బలం, నమ్మకం, భక్తి, మంచి అలవాట్లు, సమదృష్టి, దృఢ నిశ్చయం.. వీటిని అర్థం చేసుకొని అమలు చేయగలిగితే జీవితాలే మారిపోతాయి అని విశదీకరించారు.
ఆయన మాటలు స్ఫూర్తిగా తీసుకొని
మన జీవితంలో ఎంతోమంది తారసపడినా, వారి నుంచి మంచి స్వీకరించండి అంతేకానీ వారిని అనుకరించి మీ సంకల్ప శక్తిని పోగొట్టుకోకండి, మీ సొంత అనుభవాల ద్వారా ప్రకాశించండని అంటారు నరేంద్రుడు. సన్యాసం తీసుకుని దేశం మొత్తం కాషాయ వస్త్రాలు, దండ, కమండలాలే ఆస్తులుగా మార్గ మధ్యంలో పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ, సత్రాలలో బసచేస్తూ, కటిక నేలపై నిద్రిస్తూ, సాధువులతో సవాసం చేస్తూ ధార్మిక చర్చలతో పుణ్యకర్మలతో కాలం గడుపుతూ ఉండేవాడు. దేశంలో కులతత్వాన్ని నిర్మూలించనిదే దేశ ప్రజలకు ముక్తి కలదని నిర్ణయించుకొని వేదాంతాన్ని విశ్వవ్యాప్తం చేసే క్రమంలో 1902 జూలై 4 న శాశ్వత నిద్రకు ఉపక్రమించారు. ఇప్పుడు స్వామీజీ మనతో లేకపోయినా, ఆయన మాటలు సజీవంగానే ఉంటాయి. అందుకే అణగారిన నిర్భాగ్యులను సముద్ధరించేందుకు ఉన్నత వర్గాల వారు ముందుకు రావాలి. 'మానవసేవే మాధవసేవ' మానవునిలో మాధవుడిని చూడండి. 'నా దేశ యువజనులారా!మేల్కొనండి' అంటూ మహత్తర కార్యాతత్పరుడైన మహాపురుషుని సందేశ శంఖారావం యువతను ఎప్పుడూ మేల్కోలుపుతూనే ఉండాలి.
నరేందర్ రాచమల్ల
9989267462
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672






