జీఎస్టీ తగ్గడం ఉపశమనమే.. కానీ తయారీదారుడికే పరిమితం చేస్తారా?

by Ravi |   (  Updated:2025-09-09 00:31:11  IST  )

జీఎస్టీ కౌన్సిల్ జీఎస్టీ పన్నుల విధానంలో సరళీ కరణ, పన్నుల్లో కోతల ద్వారా దేశ ప్రజలకు ఉపశమనం కలుగ జేసింది.

జీఎస్టీ తగ్గడం ఉపశమనమే.. కానీ తయారీదారుడికే పరిమితం చేస్తారా?
X

జీఎస్టీ కౌన్సిల్ జీఎస్టీ పన్నుల విధానంలో సరళీ కరణ, పన్నుల్లో కోతల ద్వారా దేశ ప్రజలకు ఉపశమనం కలుగ జేసింది. కొద్ది రోజుల్లో రానున్న ఈ మార్పులు దేశ ఆర్థికానికి, ప్రజల జేబులకు కొంత మేలు చేయగలవు. అది ఏ స్థాయిలో అన్నది ఇప్పుడే చెప్పలేం కానీ.. మంచి మాత్రం జరుగుతుంది. నిత్యావసరాల్లో చాలా వాటిపై పన్ను 18 శాతం నుండి ఐదు శాతానికి తగ్గడం సామాన్యులకు ఊరట. కొన్ని ప్రాణ రక్షక మందులు, ఆహార పదార్థాలు, ఆరోగ్య బీమా పాలసీలపై పన్నులు పూర్తిగా ఎత్తివేయడం అభినందనీయం. అలాగే పన్నుల స్లాబులను రెండింటికే పరిమితం చేయడం సరళీ కరణలో భాగం. అయితే ఈ మార్పుల వల్ల రాగల లాభం, అంతిమ వినియోగదారుని వరకూ బదిలీ కావాలి. అప్పుడే వస్తుసేవల వినిమయం పెరిగి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మారుతుంది. పై స్థాయిలోనే, లేదా మధ్యలోనే అంటే సేవలు అందించే సంస్థలకు, లేదా వస్తువుల తయారీ దారులకు మాత్రమే పరిమితమైతే ఆర్థికానికి ఊతం కాదు. దీంతో దేశీయ వినిమయం పెంచడం ద్వారా బాహ్య ప్రపంచం నుండి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవాలన్న ఆశయం నెరవేరదు. పన్నులు తగ్గినా, సేవలు, వస్తువుల ధరలు పైపైకి పోతే అది అలాగే ఉంటుంది. వాటిని కూడా అదుపులో ఉంచాలి. కేంద్రం (రాష్ట్రాలతో పంచుకొనే) జీఎస్టీ రాబడిలో నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ మార్పుల వల్ల నష్టపోతుందని అంచనా. అయితే ఆ పేరుతో రాష్ట్రాలకు నష్టం మిగల్చకుండా, వాటా పెంచి సర్దుబాటు చెయ్యాలి. రాష్ట్రాలకు విదల్చని సెస్ రూపేణా వసూళ్లు కూడా నియంత్రణలో ఉండాలి. వాటిలో కూడా రాష్ట్రాలకు వాటా ఉండాలి. ఏది ఏమైనా ఇది మంచి నిర్ణయం. లాభం సామాన్యుడి వరకూ చేరినప్పుడు దేశానికి, ప్రజలకు బలం.

-డా. డి.వి.జి. శంకరరావు

94408 36931

Next Story