సమన్వయంతో పనిచేస్తే పీపీపీ గేమ్ చేంజర్!

by Ravi |   (  Updated:2026-01-16 01:15:35  IST  )

పబ్లిక్-ప్రైవేటు (పీపీపీ) భాగస్వామ్యంతో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాపనపై జరుగుతున్న చర్చ ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్న సాధారణ వివాదంలా కనిపించినా, పరిమిత ఆర్ధిక వనరులున్న ప్రభుత్వం వైద్యవిద్యారోగ్య రంగాన్ని దాని మౌలిక స్వభావాన్ని కోల్పోకుండా విస్తరింపచేయడం ఎలా అనేదే అసలు సమస్య..

సమన్వయంతో పనిచేస్తే పీపీపీ గేమ్ చేంజర్!
X

పబ్లిక్-ప్రైవేటు (పీపీపీ) భాగస్వామ్యంతో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాపనపై జరుగుతున్న చర్చ ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్న సాధారణ వివాదంలా కనిపించినా, పరిమిత ఆర్ధిక వనరులున్న ప్రభుత్వం వైద్యవిద్యారోగ్య రంగాన్ని దాని మౌలిక స్వభావాన్ని కోల్పోకుండా విస్తరింపచేయడం ఎలా అనేదే అసలు సమస్య.. ఈ వివాదం సమకాలీన భారత దేశంలో సిద్ధాంతం, పాలనా సామర్ధ్యం, ఆర్ధిక పరిమితుల మధ్య ఉన్న లోతైన విభజనను స్పష్టంగా వెలికితీస్తున్న అరుదైన విధాన చర్చకు దారితీస్తోంది.

పెరుగుతున్న జనాభానుగుణంగా దేశంలో నాణ్యమైన వైద్య విద్యను విస్తరించడానికి, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి పీపీపీ విధానంలో కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలన్న నీతి ఆయోగ్ భావనకు అనుగుణంగా ఒక్క వైద్య కళాశాల కూడా లేని జిల్లాలలో అప్పటికే ఉన్న జిల్లా లేదా రిఫరల్ ప్రభుత్వ ఆసుపత్రులకు జత చేసి 157 కొత్త వైద్య కళాశాలలను కేంద్ర ప్రాయోజిత పధకం కింద ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

పీపీపీతో జవాబుదారీతనం, పారదర్శకత..

వైద్యవిద్యారోగ్య రంగంలో నిధుల సమీకరణ, నైపుణ్యం, సృజనాత్మకత పరంగా పీపీపీ చాలా లాభదాయకమైనదని, దీని వలన ప్రాజెక్టుల స్థిరాభివృద్ధి సాధ్యమై జవాబుదారీతనం, పారదర్శకత ఇనుమడించి గ్రామీణ భారతంలో ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పీపీపీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వి.జి.ఎఫ్) కింద ప్రత్యేక ఆర్ధిక సహాయాన్ని అందిస్తోంది. మూల ధన వ్యయంలో 30 నుంచి 40శాతం ( పైలట్ ప్రాజెక్టులకు 80 శాతం వరకు), నిర్వహణ ఖర్చుల్లో మొదటి ఐదేళ్లకు 50 శాతం గ్రాంట్ రూపంలో ఇస్తారు. వీజీఎఫ్ వ్యయంలో కేంద్ర, రాష్ట్రాలు చెరి సగం భరిస్తారు. ఇరవై రాష్ట్రాలలో పీపీపీ విధానంలో నిర్వహిస్తున్న 919 డయాలిసిస్ కేంద్రాలకు కేంద్రం 80శాతం వరకు వీజీఎఫ్ ఇస్తోందని, వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, అత్యవసర వైద్య సేవలు, వైద్య పరికరాల ఏర్పాటు వంటి మౌలిక ప్రాజెక్టులకు ఇది గొప్ప అవకాశమని, రాష్ట్రాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేస్తున్నారు. వైద్య విద్య ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో 2029 నాటికి మరో 75,000 మెడికల్ సీట్లు అందుబాటులోకి రావాలంటే పీపీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని విభిన్న పార్టీల ఎంపీలతో కూడిన పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా స్పష్టం చేసింది.

దేశమంతటా ఒప్పు.. ఇక్కడ తప్పా?

తన హయాంలో రూ.8,480 కోట్ల అంచనా వ్యయంతో గ్రామీణ ప్రాంతాల్లో 17 వైద్య కళాశాలలను నిర్మించి 2250 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవాలని తలపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.1,550 కోట్ల ఖర్చుతో కేవలం ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని అరకొరగా మాత్రమే పూర్తి చేయగలిగారనేది వాస్తవం. అందుకే నిధుల కొరతతో సుదీర్ఘ కాలం పాటు నిర్మాణాలు కొనసాగే దుస్థితికి చరమగీతం పాడి వైద్యారోగ్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు వేగంగా విస్తరించడం కోసం మౌలిక సదుపాయాల కల్పనలో విజయవంతమైన పీపీపీ విధానాన్ని అనుసరించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన. అయితే వైద్యారోగ్య విషయంలో పీపీపీతో ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు వారికి దోచి పెడుతున్నారని, ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటైజ్ చేస్తున్నారని విపక్షం ఆరోపిస్తోంది. నిజానికి ఒక్క ఏపీలోనే కాదు వీజీఎఫ్ ద్వారా దేశంలోని వివిధ జిల్లాలలో పీపీపీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి జెపి నడ్డా శంకుస్థాపన చేశారు.

వైసీపీ ద్వంద వైఖరి..

పీపీపీ విధానంలో రిజర్వేషన్లు ఉండవని, పేద విద్యార్థులకు వైద్య విద్య దుర్లభం అవుతుందనే విమర్శలు నిరాధారం. నిజానికి జీవో నెం 107,108, 133, 204 ద్వారా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని మొత్తం సీట్లలో 15శాతం ఆలిండియా కోటా పోగా మిగిలిన సీట్లలో సగం జనరల్ విభాగం (రూ.15,000), 35శాతం సెల్ఫ్ ఫైనాన్స్ (రూ.12,00,000), 15శాతం ఎన్నారై (రూ.20,00,000) కోటాగా నిర్ధారించి ప్రభుత్వ వైద్య విద్యను వ్యాపారీకరణ చేసిందే వైసీపీ ప్రభుత్వం. పీపీపీ విధానంలో జనరల్ విభాగంలో 110 (7.5శాతం), మిగతా విభాగాల్లో 110 మెడికల్ సీట్లు అదనంగా లభించడం వలన స్థానిక విద్యార్థులకు మరింత మేలు చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. పీపీపీ అంటే ప్రయివేటీకరణ కాదని, ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు రంగ సామర్ధ్యాన్ని వినియోగించు కోవడమేనని, యాజమాన్య హక్కు ప్రభుత్వానిదేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇచ్చాయి. పీపీపీ ద్వారా నిర్మించినా అవి ప్రభుత్వ మెడికల్ కళాశాలలుగానే కొనసాగుతాయని, ప్రభుత్వ కోటాలో సీట్లు, రిజర్వేషన్లు, నిబంధనలు, ప్రవేశాలు, ఫీజు నియంత్రణ అన్నీ ఎన్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి.

గ్రామీణ భారతంలో కార్పొరేట్ వైద్యం..

ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణం కాదు, నిర్వహణే అసలు సమస్య. ఈ పరిస్థితిని అధిగమించాలంటే పీపీపీనే అనుసరణీయం అనేది నిష్ఠుర సత్యం. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులలో ఇప్పుడున్నట్లే ఓపి సేవలు ఉచితంగా అందించడంతో పాటు ఒక్కో కాలేజీ ఆసుపత్రిలో 70శాతం పడకలు ఉచిత వైద్యానికి కేటాయిస్తారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలు, ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్యసేవా పథకం క్రింద యూనివర్సల్ హెల్త్ పాలసీతో పాటు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలు అందుబాటులో ఉండటం వలన పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతుందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. గతంలో పేదలకు కార్పొరేట్ వైద్యం అంటూ ఆరోగ్యశ్రీ ని పొగిడిన మేధావులు ఇప్పుడు పేదలకు అదే కార్పొరేట్ వైద్యం పీపీపీ ద్వారా లభిస్తుంటే విమర్శించడం విచారకరం. వాస్తవంలో పేదలకు వైద్యఆరోగ్య రంగంలో నాణ్యమైన వైద్య సేవలు అందే విధంగా ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వాములు సమన్వయంతో పనిచేస్తే ఆరోగ్య రంగంలో కూడా పీపీపీ గేమ్‌ చేంజర్‌గా మారే అవకాశం ఉంది.

-లింగమనేని శివరామ ప్రసాద్

రాజకీయ, సామాజిక విశ్లేషకులు

7981320543

Next Story