- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనాభా ప్రోత్సాహకం.. రాజకీయ వ్యూహమేనా?
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో మూడో, నాలుగో సంతానానికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటించిన నేపథ్యంలో జనాభా పెంపు విధానంపై చర్చ సాగుతోంది. తగ్గుతున్న జనన రేటు, వృద్ధాప్య జనాభా, డిలిమిటేషన్ రాజకీయాలు, ఉపాధి, విద్య, ఆరోగ్య రంగాలపై ఈ విధానం ప్రభావం ఏమిటనే అంశాలను విశ్లేషించే కథనం.

2026 జనాభా లెక్కలు, డిలిమిటేషన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జనాభా విధానాన్ని తీసుకొచ్చింది. మూడో సంతానానికి రూ.30 వేలు, నాలుగో సంతానానికి రూ.40 వేలు ప్రోత్సాహకాలు ప్రకటించడంతో చర్చ మొదలైంది. ఒకప్పుడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన నాయకత్వం ఇప్పుడు జనాభా పెంపును ప్రోత్సహించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో తగ్గుతున్న జనన రేటు, భవిష్యత్తులో పెరుగుతున్న వృద్ధాప్య జనాభా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. అయితే ఈ విధానం నిజంగా ప్రజల సంక్షేమం కోసమేనా? లేక భవిష్యత్తులో అవసరమయ్యే కార్మిక శక్తిని పెంచుకోవడానికి రాజకీయంగా రూపొందించిన వ్యూహమా? అనే చర్చ ఇప్పుడు తీవ్రంగా సాగుతోంది.
జనాభాను వనరుగా చూస్తారంటూ..
ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే, జనాభా పెంపును ప్రోత్సహించడం కొత్త విషయం కాదు. ప్రాచీన రోమ్ నుంచి ఆధునిక యూరప్ వరకు అనేక దేశాలు తమ రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం ఇలాంటి విధానాలను అమలు చేశాయి. ప్రస్తుతం రష్యా, హంగేరి, దక్షిణ కొరియా వంటి దేశాలు వృద్ధాప్య జనాభా పెరుగుదల కారణంగా ఈ విధానాలను అమలు చేస్తున్నాయి. పాలకులు చాలా సందర్భాల్లో జనాభాను కేవలం ఆర్థిక వనరుగా, శ్రామిక శక్తిగా మాత్రమే చూశారు.. ప్రజల జీవిత నాణ్యత, విద్య, ఆరోగ్యం, గౌరవప్రదమైన జీవితం వంటి అంశాలను పట్టించు కోలేదు. ఈ అంశంపైనే ఫ్రెంచ్ తత్వవేత్త మిషెల్ ఫూకో ‘బయోపాలిటిక్స్’ అనే భావనను ప్రతిపాదించాడు. ప్రభుత్వాలు ప్రజల శరీరాలు, పుట్టుకలు, ఆరోగ్యం, జీవన విధానాలపై నియంత్రణ సాధిస్తూ సమాజాన్ని తమ అవసరాలకు అనుగుణంగా మలచాలని ప్రయత్ని స్తాయని ఆయన విశ్లేషించాడు. అంటే ప్రజలను స్వతంత్ర వ్యక్తులుగా కాకుండా పాలనకు అవసరమైన జనాభాగా మాత్రమే చూడటం ప్రమాదకరమని ఆయన హెచ్చరించాడు.
సంపన్న వర్గాలు ఇలా ఆలోచిస్తుంటే..?
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సంపన్న వర్గాలు తక్కువ మంది పిల్లలతో మెరుగైన విద్య, ఆరోగ్యం, భద్రమైన భవిష్యత్తును నిర్మించుకుంటుంటే, మరోవైపు పేదలను ఎక్కువ మంది పిల్లలు కనమని ప్రోత్సహించడం సామాజిక అసమానతలను మరింత పెంచే ప్రమాదం ఉందని విమర్శకులు అంటున్నారు. ఎందుకంటే పిల్లల సంఖ్య పెరగడం ఒక్కటే అభివృద్ధి కాదు. ఆ పిల్లలకు నాణ్యమైన విద్య, సరైన పోషకాహారం, వైద్యసేవలు, ఉద్యోగ అవకాశాలు కల్పించగలగడం నిజమైన అభివృద్ధి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల కొరత, పెరుగుతున్న నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కేవలం మూడవ సంతానానికి ₹30,000, నాలుగవ సంతానానికి ₹40,000 ఒక సారి ఇచ్చి, ఆ తర్వాత ఆ పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం ఇవ్వకపోతే ఇది జనాభా విస్పొటనం మాత్రమే కాక సామాజిక సమస్యల చక్రబంధంలోకి నెట్టివేయబడే అవకాశం ఉంది.
పిల్లలను కనాల్సిన యంత్రాలేనా?
ఇలాంటి పరిస్థితుల్లో కేవలం నగదు ప్రోత్సాహకాలతో జనాభా పెంపును ప్రోత్సహించడం సరైన పరిష్కారం కాదు. ప్రజలకు స్థిరమైన ఉపాధి, మహిళలకు విద్య, ఉద్యోగ అవకాశాలు, మంచి ప్రజారోగ్య వ్యవస్థ, పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటే కుటుంబాలు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పిల్లల సంఖ్యను స్వయంగా నిర్ణయించుకుంటాయి. లేకపోతే పేదరికం, నిరుద్యోగం, అసురక్షిత పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రభుత్వాలు ప్రజల ను ‘పిల్లలను కనాల్సిన యంత్రాలుగా’ మార్చే ప్రమా దం ఉంది. భవిష్యత్తులో ఇదే పరిస్థితి నిరుద్యోగం, పోషకాహార లోపం, విద్యా సమస్యలు, ఆర్థిక అసమానతలను మరింత పెంచే అవకాశం ఉంది. నిజానికి కేవలం జనాభా పెరగడం వల్ల సమాజం అభివృద్ధి చెందదు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.
మీ సీట్ల బేర సారాలకు ఉపయోగపడొచ్చు కానీ..
దక్షిణ భారత రాష్ట్రాల్లో జనన రేటు తగ్గిపోవడం, వృద్ధాప్య జనాభా పెరగడం నిజమైన సవాళ్లే. కానీ వాటికి పరిష్కారం కేవలం నగదు బహుమతులు కాదు. మహిళల సాధికారత, ప్రజారోగ్యంపై పెట్టు బడులు, నాణ్యమైన ప్రభుత్వ విద్య, ఉపాధి అవకాశాలు, పోషకాహారం, సామాజిక భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మరీ ముఖ్యంగా, ఇటువంటి సంతానోత్పత్తి ప్రోత్సహాకాలు రాజకీయ పార్టీలకు డిలిమిటేషన్ వంటి ప్రక్రియల్లో ఉత్తర-దక్షిణ భారతదేశ సీట్ల బేర సారాలకు ఉపయోగపడవచ్చేమోగాని ప్రజలకు మేలు చేస్తాయని చెప్పలేం. ప్రజలు కేవలం ఓటర్లు మాత్రమే కాదు, వారు గౌరవంతో జీవించాల్సిన పౌరులు.. అందుకే జనాభా విధానాలు రాజకీయ లాభాల కోసం కాకుండా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచే దిశగా ఉండాలి.
-డా. గుర్రం అశోక్
అసిస్టెంట్ ప్రొఫెసర్, IGNOU
96768 96300






