- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పైరసీ vs పరిశ్రమ.. ఇమ్మడి రవికి ప్రేక్షకుల్లో అంత మద్దతు ఎందుకుంది?
ఖర్చు లేకుండా, తేలిగ్గా అందుబాటులోకి వచ్చే సౌకర్యాల వైపు జనం మొగ్గు చూపుతారు. ఇలాంటి సందర్భాల్లో చట్టాన్ని కూడా దాటేస్తారు. ‘మెజారిటీ ఈజ్ లా’ అనే మాటకు జై కొడతారు. ఐ బొమ్మ విషయంలో ఇదే జరుగుతోంది.

ఖర్చు లేకుండా, తేలిగ్గా అందుబాటులోకి వచ్చే సౌకర్యాల వైపు జనం మొగ్గు చూపుతారు. ఇలాంటి సందర్భాల్లో చట్టాన్ని కూడా దాటేస్తారు. ‘మెజారిటీ ఈజ్ లా’ అనే మాటకు జై కొడతారు. ఐ బొమ్మ విషయంలో ఇదే జరుగుతోంది. చట్టం సంగతి మాకెందుకు.. ఫ్రీగా సినిమాలు చూస్తున్నాం. మాకదే చాలు అనుకొనే ప్రేక్షకులు అందరూ ఐ బొమ్మ అభిమానులే..
వందల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు చూసే కష్టాన్ని తప్పించిన పైరసీ వారి కంటికి తప్పుగా అనిపించడం లేదు. ఇలా సాధారణ యువత ఆదరణ ఐ బొమ్మకు వరమైంది. ఈ నేపథ్యంలో ఐ బొమ్మ సృష్టికర్త ఇమ్మడి రవి అనూహ్య అరెస్టు పెద్ద సంచలనాన్నే రేపింది. మీడియాలో ప్రధాన వార్తగా రవి అరెస్టు, అనంతర కథనాలు వరుసగా వస్తున్నాయి.
పైరసీదారుకు ఇంత మద్దతా?
ఆయనను పట్టుకున్నందుకు పోలీసులను సినీ వర్గాలు ప్రత్యేకంగా కలిసి అభినందించాయి. తెలుగు సినిమాకు పట్టిన పైరసీ గ్రహణం వీడిందని అవి సంబరంగా ఉన్నాయి. ఓ నిర్మాత ఆవేశం ఆపుకోలేక ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేసేయాలని డిమాండ్ చేశాడు. మరోవైపు ఐ బొమ్మ లాంటి పైరసీ పనులను నిర్మాతల అత్యాశే కారణమని సినిమా అభిమానులు రవిని వెనకేసుకొస్తున్నారు. రవికి వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చనే సా గుతోంది. ఇందులో రవి వైపు నిలిచే వారిదే పై చేయి కావడం గమనార్హం. మొబైల్ ఫోన్లలో యూట్యూబ్ వీడియోలు చూసేవారే ఎక్కువగా ఐ బొమ్మ ద్వారా కొత్త సినిమాలు చూస్తుంటారు. ఇళ్లలో వైఫై ఉండి పెద్ద టీవీల్లో ఓటీటీకి డబ్బులు చెల్లించి సినిమాలు చూసేవారు దీన్ని పట్టించుకోరు.
ఐ బొమ్మ పాపులారిటీకి కారణం..
ఐ బొమ్మ రవి వ్యక్తిగత వివరాలు, పైరసీ చేసే ఆయన అమోఘమైన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలిశాక ఆయన చేసిన చట్ట వ్యతిరేక పనులకు కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. వందల కోట్ల పెట్టుబడితో సినిమాలో తీసి అధిక రాబడి కోసం ప్రీమియర్ షోలకు, మొదటి వారాల్లో టికెట్ రేట్లు అడ్డంగా పెంచేసి నిర్మాతలు ప్రేక్షకులను దోచేస్తున్నారు. ఎప్పుడు చూసినా సినిమా అదే. స్పెషల్ షో చూడాలనే క్రేజీని యూత్‌లో పెంచి సినిమా వాళ్లు లాభపడుతున్నారు. దీనికి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పూర్తిగా సహకరిస్తున్నాయి. ఈ వ్యవహారమంతా చేతిలో డబ్బు లేని సినీ అభిమాని మనసు నొచ్చుకొనేలా తయారైంది. రిలీజైన రెండు మూడు రోజు ల్లోనే ఆ సినిమా తన చేతిలోని స్మార్ట్ ఫోన్‌లో దొరికిపో వడంతో సామాన్య ప్రేక్షకుడికి అంత కన్నా కావలసిందేముంది? ఇది రవి ఐ బొమ్మ పాపులారిటీ విజయానికి కారణం.
ఆరోపణలు నిజమైతే.. విధించే శిక్షలు..
సినిమా పైరసీకి అత్యధికంగా మూడేళ్ల జైలు శిక్ష, సినిమా నిర్మాణ ఖర్చులో 5 % మేరకు జరిమానా అని సినిమాటోగ్రఫీ యాక్ట్, 2023లో ఉంది. తన ప్రసారాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసి కోట్లు సంపాదించాడని వార్తల్లో ఉంది. ఆగస్టు 2025లో ఆన్‌లైన్ గేమింగ్ రేగ్యూలెటింగ్ బిల్లు వచ్చింది. బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తే రెండేళ్లు జైలు, యాభై లక్షల జరిమానా విధించవచ్చు. అయితే ఆయనపై ఉన్న ఆరోపణలపై పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటపడవచ్చు. అయితే, తాను ఒంటిగాడిని, మీకు తోచిన శిక్ష వేసుకోండి అని రవి అన్నిటికి సిద్దపడ్డట్లు మాట్లాడుతున్నాడని తెలుస్తోంది.
కొల్లగొడుతున్నది పైరసీయేనా..?
సినిమా పైరసీ ఒక అంతర్జాతీయ నేరపూరిత జాడ్యం. టెక్నాలజీలో ఆరితేరిన వాడు నెట్లో ఎన్ని అడ్డదారులైన సృష్టించగలడు. చట్టం ముందు నేరస్తుడైన రవి జైలు నుంచి బయటికి రాకున్నా పైరసీ భూతాన్ని ఆడించే మరో మాంత్రికుడు వస్తాడు. సినిమా రేట్లు అందుబాటులోకి వచ్చేదాకా సామాన్య జనం వారికి జై కొడతారు. పాన్ ఇండియా పేరిట వస్తున్నా సినిమాలు ఓ రకంగా పరిశ్రమని భ్రష్టు పట్టిస్తున్నాయి. డబ్బులు రాబట్టుకోవడానికి నిర్మాతలు టికెట్ల ధరలు అడ్డంగా పెంచి అన్ని థియేటర్లలో దినమంతా షోలు వేసి జేబులు కొల్లగొడుతున్నారు. అదే అదునుగా హాల్లో ఏది కొన్నా చేయి కాలుతుంది. మధ్య తరగతి వాళ్లు కూడా థియేటర్‌లో సినిమా చూసే రోజులు పోయాయి. పోయాయి అనే కన్నా సినిమా వాళ్లే పోగొట్టుకున్నారని అనాలి. కేరళలో చిన్న బడ్జెట్‌తో గొప్ప సినిమాలు తీస్తుంటే మనవాళ్లు భారీ ఖర్చుతో దోపిడీకి పాల్పడుతున్నారు. పరిశ్రమ రాబడిని దోచుకున్న రవిని ప్రశ్నిస్తున్న చట్టం సినిమా వాళ్ల విధానాలను కూడా దారిలోకి తేవాలి.
- బద్రి నర్సన్
94401 28169






