- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సత్యశోధన యోధుడు పూలే.. సమానత్వ సమాజం కోసం శాశ్వత దీపం
ఈ దేశంలో అట్టడుగు, అణగారిన వర్గాల విముక్తికి జీవితకాలం పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి పూలే.. మనందరికీ మానవ హక్కులు కల్పించిన మహాత్ముడు. సామాజిక సమానత్వం కోసం యుద్ధం చేసిన వైతాళికుడు. సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తొలి సామాజిక తత్వవేత్త.

ఈ దేశంలో అట్టడుగు, అణగారిన వర్గాల విముక్తికి జీవితకాలం పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి పూలే.. మనందరికీ మానవ హక్కులు కల్పించిన మహాత్ముడు. సామాజిక సమానత్వం కోసం యుద్ధం చేసిన వైతాళికుడు. సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తొలి సామాజిక తత్వవేత్త. మహారాష్ట్రలో 1827, ఏప్రిల్ 11న వెనుకబడిన మాలి కులంలో జన్మించిన ఆయనను శివాజీ, జార్జ్ వాషింగ్టన్‌ల జీవిత విశేషాలు, తామస్ పెయిన్ రాసిన రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకం ఎంతగానో ప్రభావితం చేశాయి.
సామాజిక మార్పు కోసం..
1848లో పూలే స్నేహితుని వివాహ సందర్భంలో సనాతన బ్రాహ్మణులచే పరాభవించబడ్డాడు. ఈ సంఘటన ఆయన జీవితాన్ని మార్చింది. అప్పటి నుంచి అట్టడుగు వర్గాల అభ్యు న్నతికి కృషి చేయాలని సంకల్పించాడు. ఆ వర్గాలకు చదువు అందించడం ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మాడు. అతని భార్య సావిత్రి బాయి సహకారంతో బాలికలు, స్త్రీల విద్య వ్యాప్తికి కృషి చేశాడు. తన భార్యకు విద్య నేర్పించి ఉపాధ్యాయురాలుగా మలిచాడు. ఆమె అనాడు మహిళలకు విద్య నేర్పించి దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా నిలిచింది.
క్షౌరం ఆపేస్తే.. యూరప్‌లో సంఘీభావం
నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో దాగివున్నా మర్మాన్ని శోధించడానికి 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించాడు. సత్య శోధక్ సమాజ్‌లో బ్రాహ్మణులు, ధనవంతులు, ఉన్నత ఆదాయ వర్గాలకు సభ్యత్వానికి అవకాశం లేదు, కేవలం అణచివేతకు గురైన వర్గాలకు మాత్రమే ఉంది. ఆయన సహధర్మిణి సావిత్రిబాయి మహిళల విభాగానికి నాయకత్వం వహించారు. పురోహి తులు లేకుండా వివాహాలు జరిపాడు. కులం, మూఢనమ్మ కాలకు వ్యతిరేకంగా పోరాడారు. వీటన్నిటిపై ప్రశ్నల వర్షంగా తన గులాంగిరి గ్రంథం నిలిచింది. పూలే చైతన్యంతో ఆనాటి కాలంలో నాయి బ్రాహ్మణులు (మంగలి) బ్రాహ్మణ ఆధిపత్య వర్గాలకు క్షౌరాన్ని తీయడం ఆపేశారు. వీరికి సంఘీభావంగా యూరప్ దేశాల్లోని లండన్, పారిస్ వంటి పట్టణాల్లో కూడా సెలూన్ షాప్‌లు మూసి నిరసన తెలిపారు. దీంతో వారు ఒకరి గుండు ఒకరు తీసుకున్నారు. దేశం దాటిన ఈ చైతన్యం, ధిక్కార స్వరం చరిత్రలోనే అరుదైన సంఘటన.
ప్రతి కులానికీ రిజర్వేషన్లు కావాలంటూ..
1880లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ లిట్టన్ పూనా వచ్చినప్పుడు పేద ప్రజల విద్యాబోధనకి ఖర్చు చేయాలని డిమాండ్ చేశాడు. అంతే కాకుండా ప్రతి కులానికీ జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వానికి సూచిం చాడు. అంటే సాంఘిక అసమానతలకీ, అవకాశాల లేమికి రిజర్వేషన్లు అవసరమని ఆనాడే గ్రహించిన గొప్ప మేధావి. భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు పూలే. ఆయన ఆలోచనలకు గులాంగిరి అద్దం పడుతుంది. మానసిక బానిసత్వం నుంచి అట్టడుగు కులాలను విముక్తి చేయాలనే ఉద్దేశంతో తృతీయ రత్న అనే నాటకాన్ని ముద్రించి పంచి పెట్టాడు. ఇందులో కాలం చెల్లిన కట్టుబాట్లు, మూఢాచారాలను దూషించాడు. 1888 మే 11న 'మహాత్మా' బిరుదును ప్రజల చేత పొందాడు. ఆయన 1890 నవంబర్ 28న తుది శ్వాస విడిచారు.
దళితుడిగా ముద్ర వేయవద్దు!
భారతదేశం స్వతంత్రం సిద్ధించి 78 ఏళ్లు అయినప్పటికీ అసమానతలు, అంటరానితనం చాప కింద నీరులా తమ రూపాన్ని మార్చుకొని విస్తరిస్తున్నాయి. ఇటీవల కరీంనగర్ పట్టణంలోని ఓ ఇంటి యజమాని ఎస్సీ, ఎస్టీలకు ఇల్లు ఇవ్వమని పెట్టాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధిపత్య కులాల ఆధిపత్యం ఇప్పటికీ కనబ డుతుంది. మరోవైపు అక్కడక్కడ ఆలయ ప్రవేశాలు, సామాజిక కార్యక్రమాల్లో దళిత, వెనుకబడిన కులాలను కలుపుకోవడం లేదనే వార్తలు చూస్తున్నాం. పూలే జీవితమంతా శూద్ర బీసీ ఎస్సీ ఎస్టీ కులాల విముక్తి కోసమే పనిచేశాడు. కానీ ఆయనను సమాజం దళిత కులంగా భావించడం గమనార్హం.
(నేడు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా)
- సంపతి రమేష్ మహారాజ్
79895 79428






