28 ఏళ్లుగా పెరగని పెన్షన్..!

by Ravi |   (  Updated:2026-05-13 00:30:23  IST  )

దేశ అభివృద్ధికి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన బొగ్గు గని కార్మికులు ఉద్యోగ విరమణ తర్వాత తక్కువ పెన్షన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1998 కోల్ మైన్స్ పెన్షన్ పథకాన్ని సవరించి పెన్షన్ పెంపు ఎందుకు అవసరమో వివరించే వ్యాసం.

28 ఏళ్లుగా పెరగని పెన్షన్..!
X

దేశం నిత్య నూతనంగా వెలుగొందుతూ ప్రపంచవ్యాప్తం గా ముందంజలో నిలవాలంటే ఇంధనం, విద్యుత్ శక్తి నిరంతరాయంగా అవసరం. ఈ రెండింటికీ ఆధారం భూగర్భంలోని బొగ్గు నిక్షేపాలే. అలాంటి బొగ్గును విషవాయువుల మధ్య, ప్రాణాలకు తెగించి, అనారోగ్యా‌లతో పోరాడుతూ బొగ్గు గని కార్మికులు దేశాభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేస్తారు. అయితే జీవితాంతం ఇందులో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అనంతరం వారికి కోల్ మైన్స్ పెన్షన్ 1998 పథకం ప్రకారం ఆనాటి జీతభత్యాలపై కేవలం 25 శాతం పెన్షన్ మాత్రమే లభిస్తోంది. అయితే గత 28 సంవత్సరాలుగా ఈ పెన్షన్ పథకాన్ని ఒక్కసారి కూడా సవరించలేదు. దేశంలోని అన్ని రంగాల్లో జీతభత్యాలు, పెన్షన్లు కాలానుగుణంగా పెరుగుతున్నప్పటికీ, బొగ్గు ఉద్యోగుల పెన్షన్ మాత్రం మార్పులేకుండా ఉండటం బాధాకరం. పెరుగుతున్న ధరలు, వైద్య ఖర్చులు, జీవన వ్యయాలతో చాలీచాలని పెన్షన్‌పై జీవితం గడపడం రిటైర్డ్ ఉద్యోగులకు అత్యంత కష్ట సాధ్యంగా మారింది. వైద్య సౌకర్యాలు కూడా సరైన స్థాయిలో లేవు. ఈ పెన్షన్ పెంపు కోసం కేంద్ర మంత్రులు, అధికారులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితరులకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినా, ఢిల్లీ, వారణాసి, కోల్‌కతా వంటి ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించినా ఫలితం కనిపించలేదు. అనేక మంది పెన్షన్ పెంపు ఆశతోనే జీవితాలను ముగిస్తున్నారు. దేశ అభివృద్ధికి తమ చెమట, రక్తం ధారపోసిన బొగ్గు ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం మానవత్వంతో స్పందించి, కోల్ మైన్స్ పెన్షన్ 1998 పథకాన్ని వెంటనే సవరించి పెన్షన్ పెంచాలని ప్రధానమంత్రిని వినమ్రంగా కోరుతున్నాం. అలాగే ఈ సమస్యను నిరంతరం పార్లమెంట్‌లో ప్రస్తావిస్తున్న వంశీకృష్ణకు కృతజ్ఞతలు..

- దండంరాజు రాంచందర్ రావు

98495 92958

Next Story