గుడ్లగూబ కనిపిస్తే చావేనా? ఆలోచింపజేసే లఘు చిత్రం

by Ravi |   (  Updated:2026-06-27 01:00:47  IST  )

ఈటీవీ విన్‌లో విడుదలైన 'పెద్ద పిట్ట' లఘు చిత్రం మూఢనమ్మకం, చావు భయం, మానవ మనస్తత్వాల చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథ. నటీనటుల ప్రదర్శన, దర్శకత్వం, కథనం, సాంకేతిక అంశాలపై పూర్తి సమీక్ష చదవండి.

గుడ్లగూబ కనిపిస్తే చావేనా? ఆలోచింపజేసే లఘు చిత్రం
X

మూఢనమ్మకం... అది నిజమా.. కాదా? అన్నది పక్కన పెడితే, మనిషి మనసులో భయాన్ని మాత్రం బలంగా నాటుతుంది. అలాంటి ఒక నమ్మకాన్నే ఆధారంగా చేసుకుని, చావు భయంతో వణికిపోయే ఓ గ్రామం కథను ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించిన లఘు చిత్రమే 'పెద్ద పిట్ట'. గుడ్లగూబ కనిపిస్తే అరిష్టమనే గ్రామీణ విశ్వాసం చుట్టూ అల్లుకున్న ఈ 37 నిమిషాల సినిమా, భయంతో పాటు మానవ మనస్తత్వాలను కూడా ఆలోచింపజేసేలా సాగుతుంది.

ఏదో అవసరం కోసమే మనుషుల్లో ఓ నమ్మకం ఏర్పడుతుంది. అది నిరూపణ కానపుడు మూఢ నమ్మకం అవుతుంది. అయినా అది ప్రజల మనస్సుల్లోనే తిష్ట వేస్తుంది. దాన్ని తొలగించే ప్రయత్నమే ఈ పెద్ద పిట్ట లఘు చిత్రం.

చిన్న పాయింట్‌తో సినిమా మొదలై..

గూ.. గూ... అని చప్పుడు చేస్తూ గుండెల్లో గుబులు పుట్టించే గుడ్లగూబనే పెద్ద పిట్ట. అది ఊర్లో కనబడ్డా, ఇంట్లో కొచ్చినా అరిష్టం అనే నమ్మకం జనంలో ఉంది. అలాంటి పెద్ద పిట్ట రెప రెపమని రెక్కల చప్పుడుతో బెదరగొడుతూ.. ఒకరి తర్వాత ఒకరికి కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో అల్లుకున్న సినిమా పెద్ద పిట్ట. ఆ గుడ్లగూబ రెక్కల చప్పుడుతో బెదరగొడుతూ.. ఊర్లో ఒకరి తర్వాత ఒకరికి కనిపిస్తుంటే, ఎవరికో చావు మూడిందనే భయం ఊరిని ఆవహిస్తుంది. దీని పీడ ఎలా వదిలించుకోవాలని ఊరి పెద్దలు ఒక్కటవుతారు. అలా మూకుమ్మడిగా గ్రామస్తులు ఈ సమస్యను ఎలా ఎదుర్కొ న్నారనేదే పెద్ద పిట్ట అనే చిన్న సినిమా కథ.

చావు భయం అందరిలో ఒకేలా ఉండదు..

చెట్టు కొమ్మను కొడుతున్న శివయ్యకు చెట్టుపై నుంచి ఎగిరిపోతున్న పెద్దపిట్ట కనిపిస్తుంది. ఎవరికివారు పెద్దపిట్ట తమ చావుకే వచ్చిందని బెదిరిపోతుంటారు. కదిలితే చావు దాపు రిస్తుందేమో అనే టెన్షన్ ఊరిని స్తంభింపజేస్తుంది. చావు భయం అందరికి ఒకేలా ఉండదు. బతకడానికి ఇంకేముంది అని పేదవాడు అనుకుంటే, కలవాడికి బతుకు మీద ప్రీతి పెరుగు‌తుంది. స్థితిమంతుడైన సర్పంచ్‌కు తనెక్కడ పోతానో అనే కలవరం ఎక్కువౌతుంది. అందుకే పెద్ద పిట్టకు ఎవరో ఒకర్ని ఎరగా వేస్తే తాను బతికిపోవచ్చనే ఆలోచనతో అందర్నీ రచ్చబండకు రమ్మంటాడు. 'ఎవరో ఒకరు ముందే చనిపోతే ఊరికి పెద్దపిట్ట పీడ పోతుంది. అందుకు ఎవరైనా సిద్ధమా?' అని అడుగుతాడు. ఇదేం ప్రశ్న.. మీకేమైనా పిచ్చి పట్టిందా..? మనిషిని చంపడం హత్య కదా..? అని అందరు ఎదురు తిరుగుతారు. ఇక్కడే అసలైన ట్విస్టు వస్తుంది. చివరకు గెలుపు పెద్ద పిట్టదా.. ప్రజలదా? అనే ఉత్కంఠతో చిత్రం ముందుకు సాగుతుంది.

పాత్రల్లో ఇమిడిపోయిన నటులు..

గ్రామ సర్పంచ్‌గా వేణు పోల్సాని, శివయ్యగా బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, అతని స్నేహితుడు వెంకయ్యగా మస్తాన్ కనుముక్కల ప్రధాన నటవర్గం. మిగతా చిన్న చిన్న పాత్రల్లో స్థానికులు సహజంగా కలిసిపోయారు. పెద్ద వయసులో ఒంటరిగా మిగిలిన వ్యక్తి పాత్రలో సుధాకర రెడ్డి ఇమిడి పోయారు. జీవన వైరాగ్యాన్ని తన నటన ద్వారా పండించారు. అతని మంచి చెడు పంచుకునే తోడుగా మస్తాన్ బాగా కుదిరారు. కీలకమైన సర్పంచ్ పాత్రలో వేణు పోల్సాని హోదాకు తగ్గ దర్పం ప్రదర్శించారు. కారు, ఖద్దరు, పొన్ను కర్రతో బరువైన నడక పాత్రకు అతికినట్లున్నాయి. పెద్దపిట్టకు తానూ భయపడినా పైకి గుంభనంగా, సమస్య తొందరగా తెమలాలనే ఆరాటం ఆయన నటనలో కనబడింది.

ఫీచర్ సినిమా స్థాయిలో చిత్రీకరణ..

దర్శకుడిగా బాలకృష్ణ ప్రతిభకు ఇది మచ్చుతునకగా చెప్పాలి. ఫీచర్ సినిమా స్థాయిలో చిత్రీకరణ ఉంది. ఎంచుకున్న లొకేషన్స్, కెమెరా యాంగిల్స్, లైటింగ్, నటనను రాబట్టే సీరియస్‌నెస్ ఆయన పనితనాన్ని నిరూపిస్తాయి. కెమెరా తెలియని పల్లెవాసుల నుంచి సహజ నటన రాబట్టారు. కథ ఎంపికలో, చిత్రీకరణలో, సీన్ల క్రమబద్దతలో ఆయన పనితనం కనిపిస్తుంది. చివరలో 'ఊరీకి ఉత్తరానా ఉయ్యాలో..' అనే పాట లిరిక్, మ్యూజిక్ పరంగా ఆకట్టుకుంటూ, సన్నివేశ స్థాయిని పెంచింది. చిన్న సినిమాలకు చక్కని వేదికగా నిలిచిన 'ఈటీవి విన్'‌ లోని విన్ మినీస్‌లో పెద్దపిట్ట ప్రదర్శన జూన్ 12 నుండి మొదలైంది. దీని నిడివి 37 నిమిషాలు. ఆర్. ఆర్ టాకీస్ బ్యానర్‌పై ఉదయ్ సుద్దాల నిర్మించారు. కేవలం 37 నిమిషాల నిడివితో తెరకెక్కిన 'పెద్ద పిట్ట' మూఢనమ్మకాల వల్ల మనుషుల్లో ఎలా భయం పెరుగుతుందో? ఆ భయం మనిషి ఆలోచనలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో ఆసక్తికరంగా చూపిస్తుంది. చిన్న కథతో పెద్ద సందేశాన్ని చెప్పిన ఈ లఘు చిత్రం ఆలో చింపజేసే ప్రయత్నంలో విజయవంతమైంది.

- బద్రి నర్సన్

94401 28169

Next Story