70 వసంతాల “పథేర్ పాంచాలి”

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-26 09:22:55  IST  )

“పథేర్ పాంచాలి”కి రే గీసుకున్న బొమ్మలు, రాసుకున్న నోట్సే స్క్రిప్టు. సినిమాటోగ్రాఫర్ సుబ్రతా మిత్రాకి అంతకుముందు కెమెరా పట్టుకున్న అనుభవమే లేదు. అయినా రే విజన్‌ని అద్భుతంగా తెరకెక్కించగలిగారు. ఇక రవిశంకర్ కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది.

70 వసంతాల “పథేర్ పాంచాలి”
X

సమాన దర్శకుడు సత్యజిత్ రే సృష్టించిన అపూర్వ కళాఖండం “పథేర్ పాంచాలి”! భారతీయ వెండితెరపై ఈ అద్భుతం ఆవిష్కృతమై ఇవాళ్టికి 70 వసంతాలు. 1955, ఆగస్టు 26న “పథేర్ పాంచాలి” విడుదలైంది. “పథేర్ పాంచాలి” అంటే “దారి పాట”. "అప్పు ట్రైలజీ"లో ఇది మొదటి సినిమా. తర్వాతి రెండు సినిమాలు “అపరాజితో”, “అపుర్ సంసార్”.

1920ల్లో బిభూతి భూషణ్ బందోపాధ్యాయ రాసిన పుస్తకాల ఆధారంగా సత్యజిత్ రే ఈ మూడు సినిమాలూ తీశారు. కమర్షియల్ ఫార్ములాకి భిన్నంగా ఉండడం వల్ల “పథేర్ పాంచాలి”కి సరైన నిర్మాతలే దొరకలేదు. కొంత డబ్బు పెట్టిన ఒక నిర్మాత వేరే సినిమాల వల్ల నష్టం వచ్చి తప్పుకున్నాడు. దాంతో రే కష్టాలు మొదలయ్యాయి. భార్య నగలు తాకట్టు పెట్టి, తన గ్రామ్ ఫోన్ రికార్డులు అమ్మేసి, చిన్నా చితకా ఉద్యోగాలు చేసి కొంత సినిమా తీశారు. చివరికి ప్రభుత్వ సాయంతో మూడేళ్ళకు షూటింగ్ పూర్తయింది.

ప్రాణం పెట్టిన త్రిమూర్తులు!

“పథేర్ పాంచాలి”కి రే గీసుకున్న బొమ్మలు, రాసుకున్న నోట్సే స్క్రిప్టు. సినిమాటోగ్రాఫర్ సుబ్రతా మిత్రాకి అంతకుముందు కెమెరా పట్టుకున్న అనుభవమే లేదు. అయినా రే విజన్‌ని అద్భుతంగా తెరకెక్కించగలిగారు. ఇక రవిశంకర్ కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది.

ఆ క్యారెక్టరే గొప్ప బలం

ఈ సినిమాకి దుర్గ క్యారెక్టరే గొప్ప బలం. అమాయకంగా అనిపిస్తూనే గొప్ప పరిణితి కనబరుస్తుందీ పిల్ల. పేదరికం వల్ల సరైన తిండి లేకపోయినా, చిన్న చిన్న ఆశలు చంపుకోవాల్సి వచ్చినా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంది. తమ్ముడితో కలిసి చిన్న పిల్లలాగా ఆడుతుంది, పాడుతుంది. దుర్గ తర్వాత ఈ సినిమాలో గుర్తుండిపోయే మరో పాత్ర 80 ఏళ్ళ ఇందిర్. ఈవిడ దుర్గకు, అప్పుకు మేనత్త. దుర్గకి, ఈ ముసలావిడకి మధ్య గొప్ప కెమిస్ట్రీ కనిపిస్తుంది. దుర్గ నాన్న పూజారి. కవితలు, నాటకాలు కూడా రాస్తుంటాడు. ఆయన చాలీచాలని సంపాదనతోనే నలుగురూ బతికేస్తుంటారు. ముసలావిడ కూడా తమపైనే ఆధారపడుతుండడంతో దుర్గ తల్లి ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుంటుంది. ఆ కోపం పేదరికం వల్ల వచ్చిందే గానీ సహజసిద్ధమైంది కాదు.

దుర్గ తండ్రి పాత్ర చేసిన కాను బెనర్జీని మినహాయిస్తే నటీనటులు పెద్దగా అనుభవమున్నవాళ్ళు కారు. ముసలి మేనత్త పాత్రకు చునీబాలా దేవి అనే పెద్దావిడను సత్యజిత్‌ రే పట్టుబట్టి మరీ ఒప్పించారు. పాపం సినిమా రిలీజవ్వక ముందే ఆవిడ జబ్బు చేసి చనిపోయారు. దుర్గగా జనం మనసుల్లో నిలిచిపోయిన ఉమాదాస్‌ గుప్తా కూడా ఏడాది క్రితమే వెళ్ళిపోయారు.

మన ఊర్లో మన చుట్టుపక్కలే జరుగుతున్నట్లుగా...

“పథేర్ పాంచాలి”లోని ప్రతి సంఘటనా మన ఊర్లో మన చుట్టుపక్కలే జరుగుతున్నట్లుగా ఉంటుంది. షూటింగ్‌ మొత్తం రియల్‌ లోకేషన్స్‌లోనే జరిగింది. ఇటాలియన్ నియో రియలిజం ప్రభావం ఈ సినిమాపై స్పష్టంగా కనిపిస్తుంది. విట్టోరియో డీ సికా తీసిన “బైసికిల్ థీవ్స్” తనకి స్ఫూర్తి అని రే ఒక సందర్భంలో చెప్పారు. ఫ్రెంచ్ డైరెక్టర్ జీన్ రెనాయిర్ ప్రభావం కూడా రే పై మెండుగానే ఉంది.

ప్రపంచ పటంలో నిలిచిన భారతీయ సినిమా

ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని, మరెన్నోస్ఫూర్తులను కూడగట్టుకుని రూపుదిద్దుకున్న “పథేర్ పాంచాలి”మాస్టర్ పీస్ గా నిలిచిపోయింది. లెక్కలేనన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు గెలుచుకుంది. ప్రపంచ పటంలో భారతీయ సినిమాకు గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది.

(సత్యజత్ రే కళాఖండం పథేర్ పాంచాలి సినిమా విడుదలై నేటికి 70 సంవత్సరాలు)

- శాంతి ఇశాన్‌

చిత్ర సమీక్షకురాలు

Next Story