పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల త్యాగం.. జూన్ నెలలో మొదలయ్యే మహాయజ్ఞం

by Ravi |   (  Updated:2026-06-16 01:15:10  IST  )

జూన్ నెలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం పిల్లలకు ఆనందాన్ని తెస్తే, తల్లిదండ్రులకు ఆర్థిక భారం, బాధ్యతలు, త్యాగాలకు నాంది పలుకుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం అమ్మానాన్నలు చేసే మహోన్నత త్యాగాలపై హృదయాన్ని కదిలించే ప్రత్యేక కథనం.

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల త్యాగం.. జూన్ నెలలో మొదలయ్యే మహాయజ్ఞం
X

జూన్ నెల క్యాలెండర్‌లో కనిపించగానే విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం మొదలవు తుంది. కొత్త తరగతులు, కొత్త పుస్తకాలు, కొత్త కలలు వారిని ఆనందంలో ముంచెత్తుతాయి. కానీ అదే జూన్ నెల లక్షలాది తల్లిదండ్రుల గుండెల్లో ఆందోళనకు నాంది పలుకుతుంది. పిల్లల చదువుల కోసం ఫీజులు ఎలా కట్టాలి పుస్తకాలు ఎలా కొనాలి, యూనిఫారాలు, బస్సు ఫీజులు, హాస్టల్ ఖర్చులు ఎలా భరించాలి? అనే ప్రశ్నలు వారిని వెంటాడుతుంటాయి.

పిల్లల చేతిలో పుస్తకం కనిపించిన ప్రతిసారి సమాజం ఆనందిస్తుంది. కానీ ఆ పుస్తకం వెనుక ఉన్న తల్లి కన్నీరు, తండ్రి చెమటను మాత్రం ఎవరూ గమనించరు. పిల్లల భవిష్యత్తు కోసం తమ వర్తమానాన్ని త్యాగం చేస్తున్న తల్లి దండ్రుల కథ నేటి సమాజంలో అత్యంత గొప్ప త్యాగగాథగా నిలుస్తోంది. చదువు ఖర్చులు పెరుగుతున్నాయి..తల్లిదండ్రుల భారం మరింత పెరుగుతోంది.

పిల్లల కోసం అవసరాలు వాయిదా..

ఒకప్పుడు చదువు అంటే పుస్తకాలు, స్కూల్ ఫీజుతో సరిపో యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, యూనిఫారాలు, డిజిటల్ లెర్నింగ్ పరికరాలు, కోచింగ్ సెంటర్లు, రవాణా ఖర్చులు.. ఇలా ప్రతి దశలోనూ తల్లిదండ్రులపై భారాలు పెరుగుతూనే ఉన్నాయి. మధ్యతరగతి, పేద కుటుంబాలకు జూన్ నెల అంటే పండుగ కాదు, పరీక్ష. చేతిలో డబ్బు లేక పోయినా పిల్లల చదువుల విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడకూడదని భావిస్తున్నారు. కొందరు బంగారం తాకట్టు పెడుతున్నారు. మరికొందరు అప్పులు చేస్తున్నారు. ఇంకొందరు అదనపు పనులు చేస్తూ రాత్రింబవళ్లు శ్రమి స్తున్నారు. తమ జీవితంలో ఎన్నో అవసరాలను వాయిదా వేసుకుని, పిల్లల చదువుల కోసం మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు.

తల్లి త్యాగం.. నాలుగు గోడల మధ్య మహాయజ్ఞం!

తల్లి చేసే త్యాగాలకు కొలమానం లేదు. కుటుంబ ఖర్చులను తగ్గిస్తూ, తన అవసరాలను పక్కనబెట్టి ప్రతి రూపాయిని పిల్లల చదువుల కోసం దాచిపెడుతుంది. కొత్త చీర కొనాలనుకున్నా ఆగిపోతుంది. తన ఆరోగ్యం బాగోలేకపోయినా డాక్టర్ దగ్గరకు వెళ్లడాన్ని వాయిదా వేస్తుంది. పిల్లలకు మంచి చదువు అందించాలనే తపనతో ఇంట్లోనే ఒక మౌన యుద్ధం చేస్తుంది. పిల్లలు పరీక్షలకు వెళ్తే దేవుడి ముందు దీపం పెడుతుంది. ఫలితాలు వచ్చే వరకు ఆందోళన చెందుతుంది. పిల్లల విజయాన్ని తన విజయంగా భావించి ఆనందిస్తుంది. వారి అపజయాన్ని తన బాధగా మోస్తుంది. అందుకే తల్లి ప్రేమను దేవుని ప్రేమతో పోలుస్తారు.

నాన్న శ్రమ.. చెమట చుక్కల్లో దాగిన కలలు..

ఒక తండ్రి బయట ప్రపంచంతో పోరాడుతాడు. ఎండలోనూ, వానలోనూ, అనారోగ్యంతోనూ పనికి వెళ్తాడు. ఇంట్లో సమస్యలు ఉన్నా బయటకు తెలియనివ్వడు. తన పిల్లల ఫీజు కట్టే రోజు దగ్గర పడుతుంటే అతని గుండెల్లో ఆందోళన పెరుగుతుంది. కానీ పిల్లల ముందు మాత్రం నవ్వుతూనే ఉంటాడు. తాను తినకపోయినా పిల్లలకు మంచి భోజనం పెట్టాలని చూస్తాడు. తన కోరికలను త్యాగం చేస్తూ పిల్లల కలలకు రెక్కలు కడతాడు. ఒక తండ్రి జేబులో డబ్బు తక్కువగా ఉండొచ్చు. కానీ తన పిల్లల భవిష్యత్తు గురించి ఉన్న ఆశలు మాత్రం ఆకాశమంత ఎత్తులో ఉంటాయి.

కలలను బతికిస్తున్న తల్లిదండ్రులు..

“ఈ సంవత్సరం కొత్త బట్టలు వద్దు…”. “విహారయాత్ర తర్వాత చూద్దాం..”. “ముందు పిల్లల ఫీజు కట్టాలి..” ఇలాంటి మాటలు వేలాది కుటుంబాల్లో నిత్యం వినిపిస్తుంటాయి. కుటుంబ సభ్యుల చిన్న చిన్న కోరికలు కూడా పిల్లల చదువుల కోసం త్యాగం అవుతున్నాయి. సినిమాలు, షికార్లు, హోటల్ భోజనాలు, పండుగ ఖర్చులు.. ఇలా ఎన్నో సం తో షాలను వదులుకుని పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. వారి జీవితాల్లో విలాసాలకు చోటు లేకపోయినా, పిల్లల కలలకు మాత్రం ఎప్పుడూ చోటు ఉంటుంది.

పిల్లల విజయాల వెనుక అసలు హీరోలు..

డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, శాస్త్రవేత్త అయినా, అధికారి అయినా.. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఒక తల్లి త్యాగం, ఒక తండ్రి శ్రమ తప్పకుండా ఉంటుంది.పిల్లలు సాధించిన ప్రతి విజయం వెనుక తల్లిదండ్రుల కన్నీళ్లు, ప్రార్థనలు, నిద్రలేని రాత్రులు దాగి ఉంటాయి. సమాజం చప్పట్లు కొట్టేది విజేతలకు. కానీ ఆ విజేతలను తయారు చేసిన తల్లిదండ్రుల గురించి చాలా తక్కువగా మాట్లాడుతుంది. పిల్లల కోసం జీవితమంతా అంకితం చేసిన తల్లి దండ్రులకు చివరికి కావాల్సింది ఆస్తులు కాదు, డబ్బు కాదు. వారు కోరుకునేది కేవలం ప్రేమ, గౌరవం, ఆప్యాయత. చిన్నప్పుడు చేతి వేళ్లు పట్టుకుని నడిపించిన వారిని, పెద్దయ్యాక ఒంటరిగా వదిలేయడం సమాజానికి మంచిది కాదు. వారి త్యాగాలను గుర్తుంచుకోవడం, వృద్ధాప్యంలో వారికి అండగా నిలవడం ప్రతి బిడ్డ నైతిక బాధ్యత.

వారి త్యాగం మహోన్నతం!

జూన్ నెల పిల్లలకు కొత్త విద్యా సంవత్సరానికి శ్రీకారం చుడితే, తల్లిదండ్రులకు కొత్త బాధ్యతలకు నాంది పలుకుతుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పిల్లల భవిష్యత్తు కోసం వారు చేసే త్యాగం నిజంగా మహోన్నతం. ఈ ప్రపంచంలో దేవుణ్ణి చూడలేకపోవచ్చు. కానీ పిల్లల కోసం తమ జీవితాన్నే అర్పించే అమ్మానాన్నల్లో దేవుణ్ణి చూడవచ్చు. వారి చెమట, వారి కన్నీరు, వారి త్యాగాలే ప్రతి విజయానికి అసలైన పునాదులు. “పిల్లల భవిష్యత్తు కోసం తమ వర్తమానాన్ని త్యాగం చేసే ప్రతి తల్లిదండ్రికి ఈ సమాజం శిరసు వంచి నమస్కరించాల్సిందే.”

-ఐనేని జయంత్ రావు

90308 08919

Next Story