- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది ఓటమి కాదు.. ఘోర పరాభవం..!
ప్రపంచంలో పేరొందిన సంఘటనలు చాలా జరుగుతుంటాయి. వాటిలో కొన్ని సంచలన సంఘటనలు కూడా ఉంటాయి. మరికొన్ని చారిత్రక

ప్రపంచంలో పేరొందిన సంఘటనలు చాలా జరుగుతుంటాయి. వాటిలో కొన్ని సంచలన సంఘటనలు కూడా ఉంటాయి. మరికొన్ని చారిత్రక సంఘటనలు ఉంటాయి. కానీ ప్రపంచ చరిత్ర గతిని మార్చే సంఘటనలు అరుదులో అరుదుగా (RAREST OF RARE) జరుగుతాయి. బహుశా ఆ కోవలోకి వచ్చే ఘటనే గాజాపై తాజా కాల్పుల విరమణ ఒప్పందం! 15 నెలలకు పైగా సాగిన గాజా మారణ హోమానికి స్వస్తి పలుకుతూ నిన్నటి నుండి అమలులోకి వచ్చే ఓ ఒప్పందం జరిగిన విషయం తెల్సిందే! అది రెండు ప్రత్యర్థి పక్షాల మధ్య సాధారణంగా జరిగే "నీకు గెలుపు - నాకు గెలుపు" ఒప్పందం వంటిది కాదు. అందుకు బదులుగా ఒకే పక్షానికి నిర్ణయాత్మక విజయాన్ని అందించే ఒప్పందమిది.
జియోనిస్ట్ ఇజ్రాయెల్‌లో జాత్యహంకార, ఫాసిస్ట్ రాజకీయ శక్తులకు తాజా ఒప్పందం విషాదాన్ని మిగి ల్చింది. నిన్నటి నుండి యుద్ధోన్మాద నెతన్యాహూ ప్రభుత్వం అంతర్గత సంక్షోభం వైపు అడుగులు వే స్తోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు హర్షమో దాలతో ఆనందిస్తున్నారు. మరోవైపు గాజా సహా యా వత్తు పాలస్తీనాలో నిన్నటి నుండి ప్రజలు విజయోత్సవాలను కేరింతలతో వీధుల్లో ఎగిసి పడుతున్నారు.
చివరకు ఏం సాధించినట్లు?
ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా సహా యూరప్ ప్రత్యక్ష అండదండలతో ప్రాంతీయ సూపర్ పవర్ ఇజ్రాయెల్ మూడున్నర లక్షల అత్యాధునిక సైనిక సాంకేతిక సంపత్తి గల సైన్యంతో 365 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల బుల్లి గాజాపై 15 నెలల క్రితం యుద్ధానికి దిగింది. అర లక్ష మందిని పొట్టన పెట్టుకుంది. ఒకటిన్నర లక్షల మంది వరకు తీవ్ర క్షతగాత్రులను చేసింది. ప్రధానంగా పసిపిల్లలు, స్త్రీలని బలితీసుకుంది. గాజాలో నిలబడ్డ భవనం అనేది లేకుండా నేలమట్టం చేసింది. ఆధునిక హిట్లర్ పాత్రధారిగా బెంజిమన్ నెతన్యాహూ పాలస్తీనాని రక్తపు మడుగులో ముంచివేశాడు. ఐతే అమెరికా, ఇజ్రాయెల్‌లు ఏం సాధించాయి? రెండు ప్రకటిత లక్ష్యాల సాధనే ధ్యేయంగా ఇజ్రాయెల్ భారీ సైన్యాలు గాజాపై యుద్ధానికి దిగాయి. ఒకటవది హమాస్‌ని భౌతికంగా నిర్మూలించి పూర్తిగా నిర్జీవం చేయడం! రెండు హమాస్ చెర నుండి ఇజ్రాయెల్ బందీలను సజీవంగా విడిపించడం! కానీ హమాస్ నిర్జీవం కాలేదు. బందీలు సజీవంగా విడుదల కాలేదు. ఇది అమెరికా, యూరోప్‌ల అండతో ఇజ్రాయెల్ సాధిం చిన చరిత్రాత్మక ఓటమి. ఇది నిజానికి పరాజయం కాదు. ఘోరాతి ఘోరమైన సైనిక పరాభవం కూడా!
ఇజ్రాయెల్‌కి భంగపాటు..
సుమారు మూడున్నర లక్షల సేనతో బుల్లి గాజా పైకి పదిహేడున్నర నెలల క్రితం భారీ దండయాత్రకి వెళ్లిందో అదే హమాస్‌తో తన మూడున్నర లక్షల సైన్యాన్ని గాజాకు గుడ్ బై చెప్పడానికి అంగీకరిస్తూ ఒప్పందంపై బెంజిమన్ నెతన్యాహూ ప్రభుత్వం సంత కం చేయాల్సి రావడం విశేషాల్లో కెల్ల విశేషం! 2023 నవంబర్ చివర్లో కూడా మధ్యవర్తిత్వంలో ఓసారి కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇదీ అలాం టిదే కావచ్చుననే సందేహం రావచ్చు. అదీ ఇదీ ఒకటి కాదు. ఎందుకంటే మూడున్నర లక్షల ఇజ్రాయెల్ సేన గాజాలో కొనసాగే ప్రాతిపదికతో ఫలానా రోజులు లేదా వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం వేరు. గాజా నుండి ఇజ్రాయెల్ సకల సైన్యాల్ని దశల వారీగా శాశ్వత ప్రాతిపదికతో ఉపసంహరించుకునే కాల్పుల విరమణ ఒప్పందం వేరు. రెండూ ఒకటి కాదు. అది WIN-WIN AGREEMENT కోవలోకి వస్తే ఇది ONE-SIDED AGREEMENT కోవలోకి వస్తుంది.
సామ్రాజ్య దాడిని తట్టుకుని నిలబడి..
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ సాయుధ దాడి తర్వాత గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం తెల్సిందే. అది ఇజ్రాయెల్ వ్యూహంలో హమాస్ చిక్కిన చర్యగా ఒక రకం విశ్లేషణ కాగా, హమాస్ వల విసిరితే ఇజ్రాయెల్ అందులో చిక్కిందని మరో రకం విశ్లేషణ వుంది. పైన పేర్కొన్న మొదటి వాదన కేవలం ఇజ్రాయెల్ అనుకూల రాజకీయ శక్తుల వరకే పరిమితం కాలేదు. పాలస్తీనా జాతి విముక్తి పోరాటాన్ని చిత్తశుద్ధితో బలపరిచే రాజకీయ శక్తులు సైతం మొదటి వాదననే నమ్మాయి. కానీ ఆ మొదటి రోజే ఈ రెండో వాదన చేసిన విశ్లేషకులు సైతం అల్ప సంఖ్యలో ఉన్నారు. వారి మాట పిచ్చివాళ్ల మాట, నిజం కాకపోవచ్చని వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర వర్గాలు సైతం చిత్తశుద్ధితో అపోహపడ్డాయి. కానీ నిలకడగా ఈరోజు చరిత్ర నిజాన్ని నిగ్గు తేల్చింది. హైదరాబాద్ విస్తీర్ణంలో సగం కూడా లేని గాజా 15 నెలలకు పైగా జాత్యహంకార సైన్యాల, సామ్రాజ్యవాద సైనిక సంపత్తి సంయుక్త దాడిని 15 నెలల వరకు తట్టుకుని లేచి నిలబడింది. అందుకే ఇది చారిత్రాత్మక ఓటమి, మరోవైపు హమాస్ సాధించిన చారిత్రాత్మక విజయం కూడా.
వీర పాలస్తీనాకు విప్లవ జేజేలు..
నిన్నటి నుండి సమస్త పాలస్తీనా వైపు చూద్దాం. గాజా వైపు చూద్దాం. వెస్ట్ బ్యాంక్ వైపు చూద్దాం. జెరూసలేం వైపు కూడా చూద్దాం. సకల అరబ్బు ప్రపంచం వైపు చూద్దాం. అంతెందుకు అమెరికా, యూరప్ పౌర సమాజం వైపు చూద్దాం. సమస్త పీడిత ప్రపంచం నిన్నటి నుండి ఈ ఒప్పందం జియోనిస్ట్, జింగోయుస్ట్, ఫాసిస్ట్ రాజకీయ శక్తులకు ఓటమిగా భావించి సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ ఓటమే కాదు. సైనిక ఓటమిగా కూడా భావించి ఆనందంతో ఎగిసి పడుతున్నాయి. అందు లో మనం కూడా భాగం పంచుకుందాం. వేల మరణాలతో, లక్షల క్షతగాత్రుల త్యాగాలతో తమ శవాల రాశుల పునాదులపై నిలబడి ప్రతిఘటనా ప్రపంచానికి ఊపిర్లు ఊది కొత్త శక్తిని అందించిన వీర పాలస్తీనా జాతికి విప్లవ జేజేలు చెబుదాం.
ఓ ప్రియతమా గాజా, అమెరికా సామ్రాజ్యవాద అండతో 365 చదరపు కిలోమీటర్లని చిన్న భూభాగంపై దండయాత్రకు దిగిన మూడున్నర లక్షల సైన్యాన్ని ఎదిరించి 465 రోజులు గుండె ధైర్యంతో నిలబడి అద్భుతమైన విజయాన్ని సాధించిన సందర్బంగా మీ జాతి జనుల సంబరాలు అంబరాన్ని తాకిన వేళ ఇవే బిగి పిడికిళ్లతో మా విప్లవ జేజేలు..!
- ఇఫ్టూ ప్రసాద్ (పి పి)
94907 00715






