అమెరికాను తలదన్నే వృద్ధి.. వైరల్ కథనాల వెనుక ఆర్థిక సత్యం

by Ravi |   (  Updated:2026-02-12 01:00:38  IST  )

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా, యూట్యూబ్ ఫ్యాక్ట్ ఛానెల్స్, రీల్స్, షార్ట్స్‌లలో ‘అమెరికాను భయపెడుతున్న ఐఎంఎఫ్ రిపోర్ట్’, ‘భారత్ ఎదుగుదలతో ట్రంప్ కలవరపడుతున్నాడు’ అనే వాక్యాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.. అయితే, ఇవి వినడానికి ఎంత ఆకర్షణీయం‌గా ఉన్నా, వాటి వెనుక ఉన్న నిజానిజాలను ప్రశాంతంగా, బాధ్యతతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది..

అమెరికాను తలదన్నే వృద్ధి.. వైరల్ కథనాల వెనుక ఆర్థిక సత్యం
X

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా, యూట్యూబ్ ఫ్యాక్ట్ ఛానెల్స్, రీల్స్, షార్ట్స్‌లలో ‘అమెరికాను భయపెడుతున్న ఐఎంఎఫ్ రిపోర్ట్’, ‘భారత్ ఎదుగుదలతో ట్రంప్ కలవరపడుతున్నాడు’ అనే వాక్యాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.. అయితే, ఇవి వినడానికి ఎంత ఆకర్షణీయం‌గా ఉన్నా, వాటి వెనుక ఉన్న నిజానిజాలను ప్రశాంతంగా, బాధ్యతతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది..

ఎందుకంటే ఇది కేవలం ఒక దేశం గర్వించదగిన విషయం గురించే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశను సూచించే అంశం కూడా.. అందుకే జాగ్రత్తగా పరిశీలించాలి..

ఐఎంఎఫ్ అంటే ఏమిటి?

దీనిని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంటాం. ఇది ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులను పరిశీలించి, ఆయా దేశాల ఆర్థిక వృద్ధి రేట్లు (జీడీపీ), అప్పులు, ద్రవ్యోల్బణం, ఉద్యోగ పరిస్థితులు వంటి సంబంధిత అంశాలపై నివేదికలను విడుదల చేస్తుంది. ఈ నివేదికలను ప్రభుత్వాలు, బ్యాంకులు, పెట్టుబడిదారులు అత్యంత ప్రాముఖ్యంగా, ప్రామాణికంగా పరిగణిస్తారు. ఎందుకంటే అవి భవిష్యత్తు ఆర్థిక నిర్ణయాలకు దిశా నిర్దేశం చేస్తాయి..

ఐఎంఎఫ్ నివేదికల ప్రకారం..

ఈ ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కూడా చైనా తర్వాత భారత్ అత్యంత వేగంగా ఎదుగుతూ ప్రధాన ఆర్థిక శక్తిగా నిలుస్తోంది. అమెరికా, యూరప్ దేశాల్లో ముఖ్యంగా జర్మనీ, ఇంగ్లాండ్ దేశాల వృద్ధి రేట్లు తగ్గుతున్నా, భారత్ మాత్రం 6 నుంచి 7 శాతం మధ్య స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణం భారతదేశానికి విస్తృతమైన వినియోగ మార్కెట్, యువ జనాభా, సేవారంగం, ఐటీ, ఫార్మా మొదలైన తయారీ రంగాల్లో పెరుగుదల భారత్‌కు బలంగా మారుతున్నాయి.

అమెరికా ఎందుకు కలవరపడుతోంది?

భారత్ ఎదుగుదల నేపథ్యాన్ని చూస్తే, అమెరికా చాలా కాలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో (పెట్రో డాలర్) అగ్రస్థానంలో ఉంది. ఈ డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా కొనసాగుతోంది. అలాంటి పరిస్థితిలో చైనా, భారత్ వంటి దేశాలు వేగంగా ఎదగడం అమెరికా విధాన‌కర్తల్లో ఆందోళన కలిగించడం సహజ పరిణామమే.. దీనిని భయం అనే కంటే పోటీ భావనగా చూడాలి.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం లాంటి విధానంతో ముందుకు వెళ్లారు.. వాణిజ్య ఒప్పందా‌లపై కఠిన వైఖరి అనుసరించి, మిత్ర దేశం, శత్రు దేశం అనే తేడా లేకుండా టారిఫ్ యుద్ధాలు మొదలు పెట్టారు.. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ నివేదిక ఆందోళన కలిగించింది. అమెరికా తన ఆర్థిక ఆధి పత్యాన్ని కాపాడుకోవాలనే వ్యూహం లో ఐఎంఎఫ్ వంటి సంస్థలు భారత్‌ను ప్రశంసిస్తే, ట్రంప్ లాంటి నాయకులు అసహనం వ్యక్తం చేయడం రాజకీయంగా ఆశ్చర్యకరం కాదు.

సోషల్ మీడియా కథనాలు నిజమా?

అయితే సోషల్ మీడియాలో చెప్పినట్టుగా ట్రంప్ ‘భయపడి పోయాడు’ అనడం మాత్రం అతిశయోక్తి కావచ్చు.. ఎందుకంటే రాజకీయ వ్యాఖ్యలు, ప్రచారాలు వాస్తవాలను పూర్తిగా ప్రతిబింబించవు. ఐఎంఎఫ్ నివేదిక కూడా భారత్‌ను పొగడటంతో పాటు దేశం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలపై హెచ్చరికలు చేస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, గ్రామీణ ఆర్థిక బలహీనతలు, విద్య, ఆరోగ్య రంగాల్లో లోపాలు ఇంకా భారత్ ముందున్న సవాళ్లే. యూట్యూబ్‌లో కనిపించే ‘టాప్ టెన్ ఫ్యాక్ట్స్’, ‘అన్‌నోన్ ఫ్యాక్ట్స్’, ‘అమేజింగ్ ఫ్యాక్ట్స్’ మొదలైన వీడియోల్లో కొంత నిజం, కొంత అర్థసత్యం, మరికొంత పూర్తిగా క్లిక్‌బైట్ ప్రచారం ఉంటుంది. ఐఎంఎఫ్ నివేదికను కూడా సంచలనంగా మార్చి చూపించడం అదే కోవకు చెందుతుంది. వాటిని వినోదం కోసం చూడొచ్చు, కానీ దేశ భవిష్యత్తుపై అభిప్రాయాలు ఏర్ప రచుకునే టప్పుడు లోతైన అవగాహన అవసరం.

ఎదుగుతోంది నిజమే... అతిశయం వద్దు!

భారత్ ఎదుగుతోంది అనే మాట నిజం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాని ప్రాధాన్యత పెరుగుతోందనేది కూడా వాస్తవమే.. కానీ అదే సమయంలో తన బలహీనతలను నిర్లక్ష్యం చేయకుండా సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా దేశంపై ఉంది. ఐఎంఎఫ్ నివేదిక సారాంశం ఇదే.. భారత్‌ను తక్కువ అంచనా వేయకండి, కానీ వాస్తవాలను అతిశయంగా చూడకండి. చదవడం మాత్రమే కాదు, ఏమి చదవాలో తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం.

- డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Next Story