- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
operation sindoor: సిందూర్ నాంది మాత్రమే!
ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రవాద మారణ హోమానికి భారత ప్రభుత్వం త్రివిధ దళాల ఆధ్వర్యంలో ఆపరేషన్

ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రవాద మారణ హోమానికి భారత ప్రభుత్వం త్రివిధ దళాల ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్‌తో ధీటైన జవాబు ఇచ్చింది. పహల్గాం దుర్ఘటనకు ప్రతీ కారంగా బుధవారం ఉదయం 1.30 గంటలకు భారత త్రివిధ దళాలు పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడిలో దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు మరణించారని తెలుస్తుంది. ఈ చర్య ద్వారా పహ ల్గాంలో చనిపోయిన అమాయకులకు భారత సైన్యం జోహార్లు అర్పించింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయింది.
మతం పేరుతో దాయాది దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఏండ్లుగా భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని విచ్ఛిన్న పరచడానికి కుట్రలు పన్నుతూ వచ్చింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని ఈ చర్య ద్వారా ప్రపంచానికి భారతదేశం చాటి చెప్పింది. కొన్నేళ్లుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, పాక్‌లోని ఈ తొమ్మిది ఉగ్రవాద స్థావరాల నుండి వచ్చిన ఉగ్రవాదులు భారతదేశంలో ముంబై పేలుళ్లకు, పుల్వామా ఘటనకి, పహల్గాం మారణకాండకు కారణమయ్యాయని భారత ఇంటెలిజెన్స్ విభాగం పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలియపర్చింది. ఈ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని భారత్‌లో అనేక మారణ హోమాలకు కారణమైన ఉగ్రవాదులను తమకు అప్పగించాలని ఎన్నిసార్లు విన్నవించినా దాయాది దేశం పట్టించుకోలేదు సరిగదా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది.
బాధిత స్త్రీలకు నివాళి
దాయాది దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఎంతోమంది సైనికుల ప్రాణాలు బలిగొందని తద్వారా వారి భార్యలు సిందూరం కోల్పోవాల్సి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సైనిక దాడికి ఆపరేషన్ సిందూర్ అని నామకరణం చేశారు. మే 7వ తేదీ ఉదయం 1.05 కి భారత దేశ త్రివిధ దళాలు సమన్వయంతో పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ముష్కరులను స్థావరాలను ధ్వంసం చేశాయి. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత భారతదేశం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఇలా దాడి చేయడం ఇదే మొదటిసారి. ప్రపంచ శాంతి కాముక దేశంగా ఉన్న భారతదేశం తమ దేశ సమగ్రతకి ముప్పు వాటిల్లినప్పుడు భారతీయులు అందరూ ఏకమై ముక్తసరిగా ఒకటవుతారని, ఆ దిశగా భారత ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా సంపూర్ణ మద్దతు ఉంటుందని దేశంలోని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా కుల, మత వర్గ విభేదాలను పక్కన పెట్టి ఉగ్రవాదంపై దాడి చేయడంలో ఏకమవుతాయని ఈ ఆపరేషన్ సిందూర్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలపై గానీ, పాకిస్తానీ పౌరులపై గానీ ఎలాంటి దాడి చేయక పోవడం గమనార్హం. భారతదేశ లక్ష్యం ఉగ్రవాదాన్ని రూపుమాపడమే అనీ, అమాయక ప్రజలను హతమార్చడం కాదని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది.
అద్భుతమైన దౌత్య విజయం..
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. భద్రతా మండలి సమావేశంలో అమాయకత్వం నటించి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూసిన పాక్ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న పాకిస్తాన్ కోరిక మేరకు ప్రత్యేక భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ సమావేశంలో సభ్య దేశాలు ప్రశ్నించిన విధానానికి పాకిస్తాన్‌కు ముచ్చెమటలు పట్టాయి. భారత్ కుట్ర పన్ని తనకు తానే పహల్గాం దాడి చేసుకుని పాక్‌పై నిందలు తానే మోపుతుందని దాయాది దేశం చేసిన వాదనను సభ్య దేశాలు తోసిపుచ్చాయి. పహల్గాం దాడిలో లష్కరే తొయిబా పాత్రను సభ్య దేశాలు ప్రశ్నించాయి. మతం ఆధారంగా అమాయక ప్రజలను ఉగ్రవాదులు చంపడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా పాకిస్తాన్ వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహించడంపై కూడా భద్రతా మండలి నిలదీసింది. భారత్‌తో ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కరించుకోవాలని భద్రతామండలి పాకిస్తాన్‌కు సూచించింది. ఇది ముమ్మాటికి భారత ప్రభుత్వ దౌత్య విజయమే. ప్రపంచ దేశాల్లో మెజారిటీ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలవడం పూర్తిగా దౌత్య విజయం. పహల్గాం దుర్ఘటన తర్వాత భారత ప్రభుత్వం శీఘ్రగతిన నదీజలాల కట్టడి, పాకిస్తాన్ పౌరులను వెనక్కి పంపడం, పాకిస్తాన్ చానల్‌లను నిషేధించడం, పాక్ ఉగ్రవాద మూలాలపై దెబ్బ కొట్టడం, పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం వంటి చర్యలు తీసుకుంది. భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకి ప్రపంచ దేశాల్లో మద్దతు కూడగట్టడంలో ప్రపంచ పటంలో పాక్‌ని ఏకాకి చేయడంలో భారత ప్రభుత్వం సఫలీకృతమైంది.
‘సిందూర్’ నాంది మాత్రమే
భారత భూభాగం నుంచి గగనతలం నుంచి మాత్రమే ఈ దాడులు జరిగాయి. ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి జరిగింది భారత దళాలు ఎంచుకున్న లక్ష్యం పూర్తయింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. మారణ హోమంలో మరణించిన అమాయకులకు న్యాయం జరిగింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంలో ఆపరేషన్ సిందూర్ నాంది మాత్రమే, దీనికి కొనసాగింపుగా దేశ సమగ్రతకై భారత ప్రభుత్వం తీసుకునే ప్రతీ చర్యకు దేశంలోని ప్రతి పౌరుడు కుల మత వర్గ విభేదాలను పక్కనపెట్టి, పార్టీలకతీతంగా మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలియజేస్తూ స్వచ్ఛందంగా పాల్గొని భారతదేశ సమగ్రతను కాపాడడంలో ప్రతి పౌరుడు ఒక సైనికుడిగా పోరాడాల్సిన అవసరం ఉంది. జై భారత్... జై జవాన్.
పాకాల శంకర్ గౌడ్
సామాజిక విశ్లేషకులు
98483 77734






