మట్టిలో జీవం ఉంటేనే.. రైతుకు జీవితం

by Ravi |   (  Updated:2025-07-15 01:15:58  IST  )

మట్టిలో జీవం ఉంటేనే.. రైతుకు జీవితం మాత్రమే కాకుండా, వ్యవసాయ భవిష్యత్తును, రైతు భవిష్యత్తును, దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

మట్టిలో జీవం ఉంటేనే.. రైతుకు జీవితం
X

మట్టిలో జీవం ఉంటేనే.. రైతుకు జీవితం మాత్రమే కాకుండా, వ్యవసాయ భవిష్యత్తును, రైతు భవిష్యత్తును, దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. రసాయనాలతో కూడిన సాగు రైతు భవిష్యత్తుకే కాదు, దేశాభివృద్ధికి ముప్పే.

గత రెండు మూడు దశాబ్దాలుగా తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడుల కోసం రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులను అధికంగా వాడుతున్నారు. దీని వల్ల తాత్కాలిక లాభాలు ఉన్నా భారీ ముప్పు దాగి ఉంది అనేది గ్రహించాలి. మట్టిలో నుంచి మొదలైన ఈ ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది!

ఆరోగ్యవంతమైన సమాజం కోసం..

ఇటీవల కాలంలో భారత్ నుండి విదేశాలకు ఎగుమతి చేసిన పండ్లు, కూరగాయలు, ధాన్యాల్లో హానికర రసాయన అవశేషాలు ఉన్న కారణంగా తిరస్కరణలు గణనీయంగా పెరిగాయి. ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఈ అవశేషాల వల్ల భారతీయ ఉత్పత్తులపై అంతర్జాతీయ మార్కెట్లో విశ్వస నీయత తగ్గుతోంది. ఈ తిరస్కరణలు రైతు ఆదాయాన్ని తగ్గించడమే కాదు.. దేశ సంపదపై, అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ పేరు మీదనూ ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇది కేవలం రైతుకే కాదు.. దేశ అభివృద్ధికి కూడా హెచ్చరికే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతికి అనుగుణంగా సాగు మార్గాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మట్టిలో జీవాలు ఉంటేనే నాణ్యమైన రసాయన రహిత పంటలు పండుతాయి. సారవంతమైన ఆరోగ్యకరమైన మట్టే రైతు కుటుంబానికి శాశ్వత జీవనాధారం అవుతుంది. స్వచ్ఛమైన భూమి, రసాయన రహిత ఆహారం, ఆరోగ్య వంతమైన సమాజం కోసం మనం మారాలి!

సాగు తీరు మారాలి!

FAO నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 33% భూములు సాగుకు అనుకూలం కానీ స్థితిలో ఉన్నాయి. భారత దేశంలో 120 మిలియన్ హెక్టార్లకు పైగా భూమి "డీ గ్రేడెడ్" భూమిగా మారింది. ఇది సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల, భూ కాలుష్యం వలన జరిగిన దుష్ప్రభావాలు.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ హెచ్చరిక ఏమిటంటే, భారతీయ మట్టిలో సేంద్రియ కార్బన్ స్థాయి అత్యంత ప్రమాదకరంగా 0.3%-0.5%కి పడిపోయింది (అవసరమైన కనీస స్థాయి 2%). ఈ స్థితి భవిష్యత్తులో ఆహార భద్రతకు కూడా ప్రమాద కరంగా మారుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లలో తిరస్కరణలు..

ఇటీవలి కాలంలో యూరోపియన్ యూనియన్ భారతీయ కూరగాయలకు సంబంధించి 23% బ్యాచ్‌లను ఈయూ తిరస్కరించింది. ప్రధానంగా మిరపకాయలు, బీన్స్, బీరకాయ, పుచ్చకాయలు, సుగంధ ద్రవ్యాలపై అత్యధికంగా నిషేధాలు విధించబడ్డాయి. సింగపూర్, కువైట్ వంటి దేశాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతి అయిన మామిడిపండ్లు, టమాటాలు అధిక మోతాదులో పెస్టిసైడ్ అవశేషాల కారణంగా తిరస్కరించబడ్డాయి. కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చే ఉత్పత్తులపై మల్టీ లెవెల్ ర్యాండమ్ టెస్టింగ్ విధిస్తూ, ఎగుమతులపై జపాన్ ప్రభుత్వం కఠిన పరిమితులు విధించింది. ఇవన్నీ రైతుకు నష్టాన్ని కలిగించడమే కాక.. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రతిష్టకు కూడా నష్టం కలిగించేవిగా ఉన్నాయి.

రసాయన సేద్యం దుష్పరిణామాలు..

మట్టిలో సూక్ష్మజీవులు నశించిపోతున్నాయి. భూమి తేమ నిలుపుకునే శక్తి తగ్గింది. విత్తనం మొలకెత్తే శక్తి బలహీనపడుతోంది. సారవంతమైన భూముల చౌడు భూములుగా మారుతాయి. పంట నాణ్యత తగ్గి, ఖర్చు పెరిగి, ఆదాయం తగ్గుతోంది. భారతీయులు రోజు వారి ఆహారంలో సగటున 300% మించిన పెస్టిసైడ్ అవశేషాలు తీసుకుంటున్నారు. దీనివల్ల శరీరంలో హార్మోన్ అసమతుల్యత, గర్భసంచి లోపాలు, పిల్లలలో మెదడు అభివృద్ధి సమస్యలు, కేన్సర్, మూత్రపిండాలు, కాలేయం సంబంధిత రోగాలు, ప్రతి రక్షణ వ్యవస్థ నష్టపోవడం వంటివి జరుగుతాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం గత పదేళ్లలో ఆహారం ద్వారా వచ్చే కేన్సర్ కేసులు 35% పెరిగాయి. దీనికి ప్రధాన కారణం.. రసాయన అవశేషాలతో కూడిన కలుషితమైన ఆహారం తీసుకోవడం.

సాగుతీరు మార్చాల్సిందే!

జీవామృతం, ఘనజీవామృతం, కోడి పేడ, గోమయ ఆధారిత ద్రావణాలు వంటివి వాడడం పెరగాలి. ఇవి మట్టిలో జీవకణాలు పునరుత్పత్తి చేయడంలో అద్భుత ఫలితాలు చూపుతాయి. ట్రైకోడెర్మా, బాసిల్లస్, రైజోబియం వంటి సూక్ష్మజీవుల ఆధారిత ఎరువుల వాడకం వల్ల భూమి శక్తి పెరిగి, పంట నాణ్యత మెరుగవుతోంది. సమగ్ర వ్యవసాయ పద్ధతులలో భాగంగా ఇంటిగ్రేటెడ్ న్యూట్రియెంట్ మేనే జ్మెంట్, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్‌ను పాటిస్తే ఖర్చు తగ్గించడంతో పాటు, మట్టిలో సమతౌల్యం కలిగించడంలో సహాయపడతాయి.

విత్తనాల ఎంపిక..

స్థానిక వాతావరణానికి అనుగుణమైన దేశీయ విత్తనాలను ప్రోత్సహించాలి. జన్యు మార్పిడి విత్తనాల వాడకం కంటే స్థానిక దేశీయ జీవ విత్తనాలే మన్నికైనవి వాటిని వాడే విధంగా ప్రోత్సహించాలి. సాయిల్ బయాలజీ టెస్టింగ్ ల్యాబ్‌లు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. బయో ఉత్పత్తులపై నేరుగా రైతుకే సబ్సిడీలు ఇవ్వాలి. ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్‌ల ద్వారా మార్కెటింగ్ శ్రేణులు అభివృద్ధి చేయాలి. సుస్థిర వ్యవసాయ శిక్షణ శిబిరాలు రైతుల కోసం ఏర్పాటు చేయాలి. పట్టణాల్లో రైతు మార్కెట్లు సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం కల్పించాలి. ఇన్‌పుట్– అవుట్‌పుట్ మార్కెట్ లింకేజ్‌తో సాగుకి పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

సేంద్రియ సాగు అవసరం!

మట్టిలో జీవం ఉంటేనే రైతుకు జీవితం ఉంటుంది. రైతన్నా నువ్వు భూమిని ప్రేమిస్తేనే, భూమాత నిన్ను ఆదరిస్తుంది. సేంద్రియ వ్యవసాయం చేయడం ఆప్షన్ కాదు, అవసరం. ఇప్పటికైనా మారుదాం. సేంద్రియ, ప్రకృతి సాగును ప్రారంభిద్దాం, దీని వలన పంట నాణ్యత మెరుగ వుతుంది. ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. రైతు ఆదాయం పెరుగుతుంది. భూమి శక్తి పునరుద్ధరించబడుతుంది. దేశ భవిష్యత్తు నిలబడుతుంది. కాబట్టి మట్టిని కాపాడుకుందాం. ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకుందాం.

జి. అజయ్ కుమార్

వ్యవసాయ నిపుణులు

63009 27609

Next Story