- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్ఎస్ఎస్ నిరంకుశత్వానికి నూరేళ్లు..
జర్మన్ నాజీల ఫాసిస్టు సిద్ధాంతం..ఆర్ఎస్ఎస్ రూపంలో భారతదేశంలోకి ప్రవేశించి నేటికి నూరేళ్లు.. స్వాతంత్ర్య ఉద్యమంలో నామమాత్ర మైన పాత్ర కూడా లేని ఈ సంస్థ నేడు భారత గణతంత్ర దేశాన్ని

జర్మన్ నాజీల ఫాసిస్టు సిద్ధాంతం..ఆర్ఎస్ఎస్ రూపంలో భారతదేశంలోకి ప్రవేశించి నేటికి నూరేళ్లు.. స్వాతంత్ర్య ఉద్యమంలో నామమాత్ర మైన పాత్ర కూడా లేని ఈ సంస్థ నేడు భారత గణతంత్ర దేశాన్ని వరుసగా మూడవసారి తన రాజకీయ విభాగమైన బీజేపీ ద్వారా పాలి స్తున్నది. ఇంతై ఇంతింతై వటుడింతైనట్టు ఆ మర్రి చెట్టు ఈ వందేళ్ల కాలంలో దేశంలోని మూల మూలలకు వ్యాపించి వందల వేల సంఘాల రూపంలో ప్రజల్లోకి చేరి వాళ్ల మెదళ్లలో భూస్వామ్య బ్రహ్మనీయ హిందూత్వ తీవ్రవాద ఆలోచనా బీజాలను నాటింది.
ఆర్ఎస్ఎస్ ప్రారంభం నుండే తన లక్ష్యాలైన ఆధిపత్య హిందుత్వ రాజ్యాన్ని ఏర్పరచాలని, ఎన్నికలు, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగాన్ని ఎన్నడూ అంగీకరించకుండానే తన ప్రయాణాన్ని సాగించింది. నేటికీ కొనసాగిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే భారీ మెజారిటీతో 2024 ఎన్నికల్లో గెలిచి పూర్తి రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర పన్నింది. ప్రజలు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో ఇతర ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి నిలకడలేని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ప్రజాస్వామ్యవాదులపై ఉక్కుపాదం మోపి..
2014 నుండి దేశంలో వివిధ సంఘాల ద్వారా ప్రతి యంత్రాంగంలో వీరి భావజాలం గల వ్యక్తులను నియమిస్తూ ప్రజాస్వామిక హక్కుల గురించి పోరాడే వారిపై ఉక్కుపాదాన్ని మోపింది. ఈ పదేండ్ల కాలంలోనే దేశ ప్రజలు ప్రభుత్వం, పారదర్శక ఎన్నికల వ్యవస్థ, న్యాయస్థానాల మీద నమ్మకం కోల్పోయారు. లక్షల్లో రైతులు దేశ రాజధానిని నిర్బంధించి తమ హక్కులకై పోరాడారు. యూనివర్సిటీ విద్యార్థులు, వారి హక్కులు ప్రజాస్వామ్య రక్షణకై వీరోచితంగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలోనే విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను విద్యార్థి నాయకులను, ప్రొఫెసర్లును, యాక్టివిస్టులను, నిజాయితీగల ఆఫీసర్లును, కవులను, రచయితలను పోలీసులు మాయం చేశారు. మరోవైపు కొందరిని అబద్దపు కేసుల్లో కనీసం విచారణ లేని ఖైదీలుగా సంవత్సరాల తరబడి జైలల్లోకి నెట్టివేస్తే వారు మానవ హక్కుల హననకు గురై చావు అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
శాస్త్రీయ ఆలోచనపై దాడిచేస్తూ..
ఈ పదేళ్లలో ఆర్ఎస్ఎస్ పూర్తిగా దేశీయ, విదేశీ పెట్టుబడిదారులతో మిలాకతై దోపిడిని చట్టబద్దం చేసింది. ప్రైవేటు కంపెనీలకు సైతం ప్రభుత్వమే అన్ని తానై భూసేకరణ నుండి మొదలై రాయితీలు లాభాలను తెచ్చిపెట్టేంత వరకు తన పూర్తి రాజ్య యంత్రాంగాన్ని వినియోగిస్తున్నది. 1990ల నుండి నూతన ఆర్థిక విధానాల పేరుతో సాంస్కృతిక, రాజకీయ రంగాలపై పట్టును సాధించి దోపిడీ చేస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ.. చిన్న, బక్కచిక్కిన ఎదుగుతున్న దేశాలైనా ఆఫ్రికా, ఆసియా ఖండంలోని దేశాల విద్యారంగంపై ఆధునీకీకరణ పేరుతో గ్లోబల్ విద్య పేరుతో బలవంతంగానైనా సరే రుద్దుతున్నది. అందులో భాగంగానే ఎలాంటి చర్చే లేకుండా ఏకపక్షంగా తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు పరుస్తున్నది. దీంతో దేశంలో ఇప్పటికీ మొదటి తరం కూడా విద్య అందని ప్రాంతాలతో పాటు, అతికొద్దిగా చదువుకున్న పీడిత ప్రజలను పూర్తిగా విద్య నుండి దూరం చేస్తూ ప్రైవేట్, కార్పొరేట్, విదేశీ విశ్వవిద్యాలయాలకు ఎర్ర కార్పెట్‌ను వేసి ఆహ్వానిస్తున్నది. ఇది ప్రాథమిక హక్కు అయినా నిర్బంధ విద్య చట్టానికే గండి కొట్టింది.
చరిత్రను వక్రీకరిస్తూ..
ఇక హిందూ పురాణాల్లోనే ప్రతి రోగానికి సమస్యకు పరిష్కారం ఉందని, విమానం కంటే ముందే పుష్పక విమానం ఉందని, అటామిక్ ఎనర్జీ కలిగిన అస్త్రాలను ఉపయోగించారని.. కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది, రీసెర్చ్ చేయాల్సింది ఇంకేమీ లేదని చరిత్రను మార్పు చేసి వక్రీకరిస్తూ పురాణాల పేరు మీద హిందుత్వాన్ని, అసత్యాలను, అశ్రాస్త్రీయ అంశాలను NCERT ద్వారా విద్యావ్యవస్థలోకి చిమ్ముతున్నది. అందులో భాగంగానే బ్రిటీష్ వలస పాలన వ్యతిరేక పోరాటంలో ఇసుమంతైనా పాత్రలేని సావర్కర్‌ను స్వాతంత్ర పోరాటంలో కీర్తిస్తూ వీరయోధుడని రాయడం, 23 సంవత్సరాలకే తన ప్రాణాలను త్యాగం చేసిన భగత్ సింగ్ పాఠ్యాంశాన్ని తొలగించడం, డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని పాఠ్య పుస్తకాల్లోంచి తీసివేయడం చూస్తే సంఘ్ పరివార్ నిజంపై చేసిన సిస్టమేటిక్ దాడి అర్థమవుతుంది.
ప్రజలు చైతన్యవంతులై..
దేశంలో సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో 1992లో కర సేవకులు అప్రజాస్వామికంగా ముస్లింలపై దాడి, బాబ్రీ మసీద్ కూల్చివేత, గోద్రా అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లు ప్రభుత్వం కనుసన్నల్లోనే జరిగాయని ఓ ఐపీఎస్ ఆఫీసర్ నిరూపిస్తే తననే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పటికీ ఆయన బయటికి రాలేదు. అలాగే ఆదివాసీ, మైనారిటి, దళితులపై ఆహార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలను సైతం ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తున్నది. ఇలా ఆర్ఎస్ఎస్ గోల్వాల్కర్ ప్రతిపాదించిన విధంగా దేశాన్ని హిందూ రాజ్యంగా, అంటరానితనాన్ని, భూస్వామ్య వ్యవస్థను చట్టబద్దం చేసే విధంగా, అనాగరిక మనుస్మృతిని అమలు చేసే విధంగా రాజరిక వ్యవస్థను ఆర్ఎస్ఎస్ స్థాపించాలను కుంటోంది. అదే అడుగు జాడల్లో బీజేపీ పయనిస్తున్నది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను, ఫాసిస్టు రాజాన్ని ఎదుర్కోవాలంటే ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వాలపై పోరాడాలి. అప్పుడే సమ సమాజాన్ని స్థాపించగలరు.
-స్టాలిన్
ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు
74164 20830






