హస్తిన ప్రజల తీర్పు ఎవరికో..?

by Ravi |   (  Updated:2025-01-22 00:46:02  IST  )

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం మోగింది. 70 స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగనున్నాయి.

హస్తిన ప్రజల తీర్పు ఎవరికో..?
X

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం మోగింది. 70 స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగనున్నాయి. పోరాడేది మూడు పార్టీలైనా.. పోటీ రెండు పార్టీల మధ్యే ఉండనుందని రాజకీయవేత్తల అభిప్రాయం. నాలుగోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆప్ తమ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసి ఏక ఛత్రాధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటుండగా, ఆయన గెలుపుకు కళ్లెం వేసి 25 ఏండ్లుగా అందని ద్రాక్షగా మిగిలిన ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పావులు కదుపుతుంది. 15 ఏండ్లు ఏకధాటిగా ఢిల్లీని పరిపాలించి తమ ప్రాబల్యాన్ని కనబర్చిన కాంగ్రెస్ మళ్లీ ఈ ఎన్నికల్లో తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి కష్టపడుతోంది.

కొత్త పంథాతో ఆమ్ ఆద్మీ

సామాన్యుడిగా 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్ 2013 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవలేకపోయినా, కాంగ్రెస్ సహకారంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టి విబేధాలతో 48 రోజులకే దిగిపోవాల్సి వచ్చింది. తర్వాతి 2015లో 50% ఓట్లతో 67 స్థానాలను, 2020లో 54% ఓట్లతో 62 స్థానాలతో ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలను మట్టి కరిపించి సంచలనాత్మక విజయాలను సాధించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పదేండ్ల పాలనలో విద్య, వైద్యం, ఉపాధి, విద్యుత్, తాగునీటి పథకాలతో విశేష ప్రజాదరణతో ప్రజలకు చేరువయ్యింది. ఇలా వరుస విజయాలతో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి రావడం మింగుడు పడని బీజేపీ ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో కేజ్రీ సర్కారును ఇరకాటంలో పెడుతూ వస్తోంది. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను, సిసోడియాను నెలలకు పైగా జైల్లో పెట్టి ఆప్‌ను బజారుకిడ్చడంలో సక్సెస్ అయిన బీజేపీ... ప్రజల్లో ఆ పార్టీపై ఉన్న సానుకూలతను చెమర్చడంలో విజయం సాధించిందనే చెప్పవచ్చు. ఇటీవల గవర్నర్ సంక్షేమ పథకాలపై విచారణకు ఆదేశించడం చూస్తుంటే ఢిల్లీ పీఠాన్ని బీజేపీ ఏ స్థాయిలో టార్గెట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీని డిఫెన్స్ చేయడంలో ఎప్పుడు ముందుండే కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ దర్యాపు సంస్థల చేత అరెస్టు కాబడి ఆరు నెలలుగా జైల్లో గడిపినప్పటికీ విడుదల అనంతరం ఏ మాత్రం కుంగిపోకుండా అనూహ్యంగా తన వ్యూహానికి పదును పెట్టి ఎన్నికలకు ఐదు నెలల సమయం ఉన్నప్పుడు తనపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీకి షాక్ ఇచ్చారు. బీజేపీ తమను రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని ప్రజలకు చేర్చడంలో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు..

అధికార కాంక్షతో కమలం

1998లో ఢిల్లీలో అధికారానికి దూరమైన బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హస్తినపై పాగ వేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గత 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకే పరిమితం అయినప్పటికీ 39% ఓట్లను సంపాదించగలిగింది. అయితే, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 55% ఓట్లతో ఢిల్లీ మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేయడం వారికి ఆశలు కల్పిస్తోంది. ఇక కాంగ్రెస్ కనుచూపు మేర కనిపించకపోవడం, మరోవైపు ఆప్‌పై అవినీతి ఆరోపణలు రావడం బీజేపీకి కలిసొచ్చే అంశం. జనవరి 03, 05 తేదీల్లో చేపట్టిన పరివర్తన యాత్రలో పాల్గొన్న నరేంద్ర మోడీ పదునైన విమర్శలతో గత కేజ్రీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టి ఎన్నికలపై పట్టు బిగించారని చెప్పవచ్చు. కానీ గత పదేండ్లుగా కేంద్రంలోని మోడీ సర్కారుపై కేజ్రీవాల్ ప్రభుత్వం పలు కీలకమైన విషయాల్లో సవాల్ విసురుతూనే ఉంది. గవర్నర్ వివాదం, తమ ఎమ్మెల్యేల కొనుగోలుతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, అధికారాల్లో జోక్యం ఇంకా పలు వివాదాలను చాకచక్యంగా ఎదుర్కొని అంతిమంగా బీజేపీని ప్రజల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో కేజ్రీవాల్ మొదటి నుంచి చాణక్య నీతిని ప్రదర్శించారు. గడిచిన రెండు పార్లమెంట్ ఎన్నికల్లో తమ హవాను కొనసాగించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో మిత్రపక్షాల కూటమి మద్దతుతో మాత్రమే అధికారంలోకి రాగలిగిందంటే దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అర్థం. ఢిల్లీలో కూడా అదే ప్రభావం ఉండొచ్చు. పదేండ్ల కేజ్రీవాల్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ కోసం ఏర్పడిన పార్టీగా, పదేండ్ల తన పాలనతో ఢిల్లీని గొప్ప స్థాయికి చేర్చిన కేజ్రీవాల్ నాయకత్వంపై ఇంకా ప్రజల్లో విశ్వాసం ఉంది.

బరిలోకి ఒంటరిగా కాంగ్రెస్

కాంగ్రెస్ విషయానికొచ్చే సరికి అన్ని రాష్ట్రాల్లో మాదిరి కూటమిగా కాకుండా ఢిల్లీలో ఒంటరి పోరు చేయాల్సి వస్తుంది. ఆప్, బీజేపీ పార్టీలతో పోల్చుకుంటే, అభ్యర్థుల ప్రకటనలో, ప్రచారంలో కూడా వెనుకబడిపోయింది. 15ఏండ్లు అధికారంలోఉండి 2020 ఎన్ని కల్లో 4.26% ఓట్లతో కనీస ఖాతా తెరువలేకపోయినప్పటికీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్‌‌తో కలిసి కూటమిగా పోటీ చేసినప్పుడు ఒక్క ఎంపీ సీటు గెలువకపోయినా, 18.19%ఓట్లను సాధించి ఉనికిని చాటుకుంది. ఇక ఈ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు లేనప్పటికీ పెరిగిన ఓట్ల శాతం ఊతం ఇస్తుందని నేతల భావన. కానీ కూటమిలోని పార్టీలు కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఈ పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీని, పదేండ్లుగా పాగా వేసి ఉన్న కేజ్రీ‌వాల్‌ని ఎదుర్కోవడం కాంగ్రెస్ సవాలే అవుతుంది. పలు రాష్ట్రా ల్లో అనూహ్యంగా పుంజు కున్న కాంగ్రెస్ ఢిల్లీలో కూడా చక్రం తిప్పే అవకాశం లేకపోలేదు.

ఉచితాలు ప్రజలను ఆకర్షించేనా?

ప్రజలను ఆకర్షించడం కోసం ఆప్, బీజేపీలు పోటాపోటీగా హామీలు గుప్పించాయి. ఆప్ ఇప్పటికే మహిళా సమ్మాన్ యోజన ద్వారా వెయ్యి రూపాయల నగదును మహిళలకు అందిస్తోండగా దానిని 2100 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి, వృద్ధుల సంక్షేమానికి, మతపరమైన పూజారుల సంక్షేమానికి, విదేశీ విద్యా నిధి అంతేకాక నల్లా బిల్లుల మాఫీ ఇలాంటి ఎన్నో పథకాలతో ఆప్ ప్రజాకర్షణలో ముందుం డగా, బీజేపీ తానేమి తక్కువ కాదంటూ ఉచిత విద్యుత్, ఉచిత నీరు, మహిళలకు ఆర్థిక సాయం, గృహ నిర్మాణ పథకం వంటి పలు ప్రజాఆకర్షక పథకాలతో ఎన్నికల ప్రచారంలో ఆప్‌తో సమా నంగా దూసుకుపోతుంది. ఆప్, బీజేపీల ఉచిత పథకాలను తలదన్నుతూ కాంగ్రెస్ పార్టీ హామీలను గుప్పిస్తుంది. చివరగా ‘ఫీర్ లాయెంగే కేజ్రీవాల్’ అనే ఆమ్ ఆద్మీ పార్టీ నినాదానికి ‘బదల్ కే రహేంగే’ అనే బీజేపీ బదులు నినాదానికి మధ్య జరుగుతున్న ప్రజా సమరంలో గెలుపు ఎవరిదో ఫిబ్రవరి 8న తేలిపోనుంది.

-పిన్నింటి విజయ్ కుమార్,

రాజనీతిశాస్త్ర విద్యార్థి, కేయూ

90520 39109

Next Story