- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతికున్న తల్లిదండ్రులు.. మరిచిపోతున్న సమాజం..
భారతదేశంలో వృద్ధాప్యం ఎదుర్కొంటున్న ఒంటరితనం, ఆర్థిక అసురక్షితత్వం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ నిరాదరణ వంటి సవాళ్లపై సమగ్ర విశ్లేషణ. వృద్ధుల గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన సామాజిక, ప్రభుత్వ పరిష్కార మార్గాలపై ప్రత్యేక కథనం.

ఆధునిక మానవ నాగరికత సాధించిన అతి పెద్ద విజయం ఏంటంటే.. మనిషి సగటు ఆయుర్దాయం పెరగడం. కానీ, అదే నాగరికత సృష్టించిన అతిపెద్ద వైఫల్యం ఏంటంటే.. అలా పెరిగిన జీవిత కాలాన్ని వృద్ధులకు ఒక శాపంగా మార్చడం. వెండి వెంట్రుకలు, ముడతలు పడిన చర్మం కేవలం వయసు పైబడటానికి సంకేతాలు కావు, అవి ఒక తరం మనకోసం ధారపోసిన జీవితానికి సాక్ష్యాలు.
కానీ నేడు, అదే వృద్ధాప్యం ఒక అనాథ శరణాలయంగానో, లేదా స్వంత ఇంట్లోనే ఒక ఒంటరి ద్వీపంగానో మారిపోతోంది. వృద్ధాప్యం ఒక సహజ జీవన దశ. కానీ నేడు అది అనేక మందికి సామాజిక ఒంటరితనం, మానసిక వేదన, ఆర్థిక అసురక్షితత్వం, కుటుంబ నిరాదరణకు ప్రతీకగా మారుతోంది. ప్రశ్న ఒక్కటే మన సమాజం వృద్ధులను గౌర విస్తోందా? లేక క్రమంగా మరచిపోతోందా? జాతీయ స్థాయిలో చర్చించాల్సిన, తక్షణమే స్పందించాల్సిన ఒక తీవ్రమైన మానవీయ, సామాజిక సంక్షోభం ఇది.
ఒంటరితనం మూలంగా..
ఒంటరితనం అనేది కేవలం ఒక మానసిక భావన మాత్రమే కాదు, అది శరీరానికి నెమ్మదిగా ఎక్కించే విషం అని సైన్స్ నిరూపిస్తోంది. వైద్య శాస్త్రవేత్తల ప్రకారం, దీర్ఘకాలిక ఒంటరితనం అనేది మనిషి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమంటే.. రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానం. సైంటిఫిక్ కోణంలో చూస్తే మనిషి ఒంటరిగా మిగిలిపోయినప్పుడు మెదడులో 'కార్టిసోల్' (Cortisol) అనే స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా పెరుగుతుంది. ఇది శరీరంలో దీర్ఘకాలిక వాపులను (Inflammation) సృష్టిస్తుంది. దీనివల్ల రక్తపోటు పెరగడం, గుండెజబ్బులు రావడం, మెదడు కణాలు క్షీణించి జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్ వంటి వ్యాధులు ముంచుకొస్తాయి. లాన్సెట్ నివేదికల ప్రకారం, భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు తీవ్రమైన డిప్రెషన్ లేదా ఒంటరితనంతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత జటిలంగా ఉంది.
శూన్యంలో వృద్ధాప్యం...
వయసు పైబడే కొద్దీ సంపాదన తగ్గిపోతుంది, కానీ రోగాలు పెరిగిపోతాయి. భారతదేశంలో వృద్ధులకు సరైన ఉచిత వైద్యం, సామాజిక ఆరోగ్య భద్రత (Geriatric Care) లభించడం ఒక గగన కుసుమంగా మారింది. మనదేశంలో దాదాపు 70% కంటే ఎక్కువ మంది వృద్ధులు ఆర్థికంగా ఇతరులపై (పిల్లలపై) ఆధారపడి జీవిస్తున్నారు. జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం, వృద్ధుల వైద్య ఖర్చుల కోసం కుటుంబాలు అప్పులపాలు కావడం లేదా ఉన్న ఆస్తులు అమ్ముకోవడం జరుగుతోంది. ప్రభుత్వాలు ఇచ్చే వృద్ధాప్య పింఛన్లు మందుల ఖర్చులకు కూడా సరిపోవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు నామమాత్రంగానే ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వయసు పైబడిన వారికి పాలసీలు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి, లేదా ప్రీమియంలు సామాన్యుడికి అందనంత ఎత్తులో పెంచేస్తున్నాయి.
విచ్ఛిన్నమవుతున్న బంధాలు...
మనది ఉమ్మడి కుటుంబాల సంస్కృతి అని మనం గొప్పగా చెప్పుకుంటాం, కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. గ్లోబలైజేషన్, ఐటీ ఉద్యోగాలు, న్యూక్లియర్ ఫ్యామిలీల (చిన్న కుటుంబాలు) సంస్కృతి పెరిగిన తర్వాత, వృద్ధ తల్లిదండ్రులు ఇంట్లో ఒక అనవసరమైన వస్తువు లాగా మిగిలిపోతున్నారు. హెల్ప్ ఏజ్ ఇండియా' సర్వేల ప్రకారం, దాదాపు 50% మంది వృద్ధులు తమ స్వంత కుటుంబ సభ్యుల నుంచే శారీరక, మానసిక లేదా ఆర్థికపరమైన వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఆస్తులు రాయించుకున్నాక తల్లిదండ్రులను రోడ్డున పడేయడం, లేదా ఊర్లలో ఒంటరిగా వదిలేసి పిల్లలు నగరాలకు, విదేశాలకు వెళ్లిపోవడం సర్వసాధారణమై పోయింది. ఒకప్పుడు మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేసిన వృద్ధులకు, ఇప్పుడు మాట్లాడటానికి ఒక మనిషి కరువయ్యాడు. ఇంట్లో అందరూ ఉన్నారు... కానీ నాతో మాట్లాడేవారే లేరు అనే వృద్ధుల వేదన, భౌతిక హింస కంటే భయంకరమైనది.
గణాంకాల అద్దంలో భవిష్యత్...
2050 నాటికి భారతదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు వృద్ధులు ఉంటారు. అంటే, రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం మరింత తీవ్రం కానుంది. దీనికి మన సామాజిక, ఆర్థిక వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయా? లేదా అనేది అటు ప్రభుత్వం, ఇటు సమాజం ఆలోచించాలి. మనం ఈరోజు వృద్ధులను చూస్తున్న విధానమే, రేపు మన పిల్లలు మనల్ని చూసే విధానాన్ని నిర్ణయిస్తుంది. ఎందుకంటే కాలం ఎవరికోసం ఆగదు, ఈరోజు యువత రేపటి వృద్ధులే. తల్లిదండ్రులు బతికుండగానే వారిని మర్చిపోయే సమాజం, ఎంత ఆర్థిక ప్రగతి సాధించినా అది నాగరిక సమాజం అనిపించుకోలేదు.
పరిష్కార మార్గాలు...
ఈ సమస్య కేవలం చట్టాలతోనో, కోర్టులతోనో పరిష్కారమయ్యేది కాదు. దీనికి వ్యవస్థాగతమైన, మానసికమైన మార్పు కావాలి. చట్టాల కఠిన అమలు 'తల్లిదండ్రులు, వృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం - 2007' (MWPSC Act) ఉన్నప్పటికీ, చాలా మంది వృద్ధులకు దీనిపై అవగాహన లేదు. పిల్లలు వదిలేస్తే తక్షణమే ఆస్తుల బదలాయింపును రద్దు చేసేలా చట్టపరమైన రక్షణలు మరింత వేగంగా అమలు కావాలి. యూనివర్సల్ పెన్షన్ & హెల్త్ కేర్ 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ గౌరవప్రదంగా బతికేలా కనీస పెన్షన్, సంపూర్ణ ఉచిత వైద్య సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి. డే-కేర్ సెంటర్లు నగరాల్లో, గ్రామాల్లో వృద్ధులు పగటిపూట ఒకచోట చేరి మాట్లాడుకునేలా, చిన్నపాటి వినోదం, వ్యాయామం చేసుకునేలా కమ్యూనిటీ సెంటర్లు ఏర్పాటు చేయాలి. పాఠ్య పుస్తకాల్లో నైతికత వృద్ధులను గౌరవించడం అనేది కేవలం సంస్కారం కాదు, అది ఒక సామాజిక బాధ్యత అనే విషయాన్ని పాఠశాల స్థాయి నుంచే పిల్లల మనసుల్లో నాటాలి. వృద్ధాప్యానికి కావలసింది కేవలం రెండు పూటల అన్నం కాదు. తాము ఒంటరి వాళ్లం కాదనే భరోసా, కంటి నిండా ప్రేమ, గౌరవప్రదమైన వీడ్కోలు. సమాజంగా మనమంతా మేల్కొనాల్సిన సమయం ఇది.
-డాక్టర్ బి. కేశవులు ఎండీ
చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం
85010 61659






