ప్రతిభ ఉన్నా అడ్డంకులు.. మదర్సా–ఓపెన్ స్కూల్ విద్యార్థుల భవిష్యత్తుపై సర్టిఫికెట్ సమస్యల ప్రభావం!

by Ravi |   (  Updated:2026-06-10 00:31:24  IST  )

మదర్సా, ఓపెన్ స్కూల్ విధానాల్లో చదివిన ప్రతిభావంతులైన విద్యార్థులు సర్టిఫికెట్ సమస్యల కారణంగా ఉన్నత విద్య అవకాశాలు కోల్పోతున్న పరిస్థితిపై విశ్లేషణ. విద్యా సమానత్వం, ప్రభుత్వ బాధ్యత, మరియు పరిష్కార మార్గాలపై ప్రత్యేక పరిశీలన.

ప్రతిభ ఉన్నా అడ్డంకులు.. మదర్సా–ఓపెన్ స్కూల్ విద్యార్థుల భవిష్యత్తుపై సర్టిఫికెట్ సమస్యల ప్రభావం!
X

విద్య, ప్రతి విద్యార్థి హక్కు. ప్రతిభ, కృషి, అంకితభావం ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలను అందుకునే అవకా శం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అయితే సాంకేతిక కారణాలు, నిబంధనల లోపాలు, ధ్రువపత్రాల సమస్యలు.. ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకిగా మార డం ఆందోళన కలిగించే అంశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన షేక్ మదీనా అనే మదర్సా విద్యార్థిని ఉదంతమే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఎనిమిదేళ్ల పాటు మదర్సాలో ఆలీమ్, ఫాజిల్ కోర్సులు అభ్యసించిన ఆమె, అనంతరం ఓపెన్ స్కూల్ విధానం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ మార్కులు సాధిం చింది. ఉపాధ్యాయురాలిగా మారి సమాజానికి సేవ చేయా లనే లక్ష్యంతో టీజీ డీఈఈసెట్ పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో 339వ ర్యాంకు సాధించింది. అయితే ఇటీవల హైదరాబా ద్‌లో నిర్వహించిన కౌన్సిలింగ్‌లో ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు లేకపోవడం కారణంగా ఆమెకు సీటు నిరాకరించారు. ప్రతిభ ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో అవకాశం కోల్పోవడం విద్యా వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేస్తోంది. ఇది కేవలం ఒక విద్యార్థిని సమస్య మాత్రమే కాదు. మదర్సా, ఓపెన్ స్కూల్ విధానాల్లో విద్యనభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థుల భవిష్య‌త్తుకు సంబంధించిన అంశం. ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించిన విద్యార్థులకు మధ్య తరగతుల స్టడీ సర్టిఫికెట్లు ఎవరు జారీ చేయాలనే విషయంలో స్పష్టత లేకపోవడం వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. విద్యా వ్యవస్థలో ధ్రువపత్రాలకు ఉన్న ప్రాధాన్యతను ఎవరూ కాదనలేరు. అయితే విద్యార్థి ప్రతిభ, అర్హతలను పక్కనబెట్టి కేవలం సర్టి ఫికెట్ల లేమి కారణంగా అవకాశాలను నిరాకరించడం విద్యా సమానత్వ స్ఫూర్తికి విరుద్ధం. విద్యార్థి ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, విద్యాశాఖ అధి కారులు ఈ సమస్యను సానుభూతితో, బాధ్యతతో పరిశీలించాలి. మదర్సా, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కౌన్సిలింగ్‌లు, ప్రవేశాల సమయంలో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వడమో.. అవసరమైతే ప్రత్యామ్నాయ ధ్రువీకరణ విధానాలను అమలు చేసి ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా చూడాలి.

-ఎండీ యాకూబ్ పాషా

మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

85208 60785

Next Story