- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డైవర్ట్ వద్దు.. డెవలప్‌మెంట్ పాలిటిక్స్ కావాలి!
ప్రజల అసలు సమస్యలైన ఉపాధి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలను పక్కనపెట్టి డైవర్ట్ పాలిటిక్స్ వైపు సాగుతున్న రాజకీయ ధోరణిపై విశ్లేషణ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ భవిష్యత్తుకు అభివృద్ధి ఆధారిత రాజకీయాలే ఎందుకు అవసరమో తెలిపే వ్యాసం.

నేడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక ప్రమాదకరమైన రాజకీయ ధోరణి పెరుగుతోంది. అది ‘డైవర్ట్ పాలిటిక్స్’. ప్రజల అసలు సమస్యలను పక్కకు నెట్టేసి, భావోద్వేగ అంశాలు, ప్రాంతీయవాదం, కులవాదం, మతవాదం, వ్యక్తిగత విమర్శలు, సోషల్ మీడియా యుద్ధాలతో ప్రజల దృష్టిని మళ్లిం చడం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన దశ.
ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలే ప్రధాన చర్చ కావాలి. కానీ నేడు అసలు సమస్యల కంటే రాజకీయ వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. అభి వృద్ధిని నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం ఆర్థిక, సామాజిక రంగాలపై పడుతుంది. కోల్పోయిన అభివృద్ధిని తిరిగి సాధించ డానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది.
డైవర్ట్ పాలిటిక్స్...
ఒకప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు విజన్ చూపించేవారు. ఇప్పుడు చాలామంది ప్రజల దృష్టిని మళ్లించడానికి సంచలన అంశాలు వెతుకుతూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. నిరుద్యోగం, నిత్యావసర ధరలు పెరిగితే దాని గురించి మాట్లాడకుండా మరో అంశాన్ని ముందుకు తెచ్చి రాజకీయ వివాదాన్ని సృష్టిస్తారు. రైతుల సమస్యలు తీవ్రమైతే మీడియా దృష్టిని మరొక అంశంపై కేంద్రీకరిస్తారు. ఇది ప్రజాస్వామ్య ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రజలు నిజమైన సమస్యలను మర్చిపోతారు. రాజకీయ నాయకులు జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటారు. మీడియా అసలు ప్రశ్నలను అడగడం మానేస్తుంది. ప్రజలు భావో ద్వేగాల్లో బందీలుగా మారిపోతారు. చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే, అభివృద్ధి లేని ప్రాంతీయవాదం ఆకలి తీర్చదు. అభివృద్ధి లేని కులవాదం ఉద్యోగం ఇవ్వదు. అభివృద్ధి లేని మతవాదం పెట్టుబడులు తీసుకురాదు. అభివృద్ధి లేని రాజ కీయాలు సమాజాన్ని మరింత వెనక్కి నెడతాయి.
ఈ అంశాలను వదిలేసి..
ప్రపంచ చరిత్రలో ఏ దేశం కేవలం రాజకీయ నినాదాలతో అభివృద్ధి చెందలేదు. ఏ రాష్ట్రం కేవలం భావోద్వేగాలతో ఆర్థిక శక్తిగా మారలేదు. అభివృద్ధికి ప్రత్యామ్నాయం లేదు. ప్రజల సంక్షేమానికి ప్రత్యామ్నాయం లేదు. ఉపాధికి ప్రత్యామ్నాయం లేదు. ఒక రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే రాజకీయ స్థిరత్వం అవసరం. పరిశ్రమలు రావాలంటే నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. ఉద్యోగాలు పెరగాలంటే విద్యా వ్యవస్థ, రైతు బాగుపడాలంటే మార్కెట్ వ్యవస్థ బలపడాలి. ఈ అంశాలను వదిలేసి కేవలం రాజకీయ ప్రచారాలపై దృష్టి పెట్టిన రాష్ట్రాలు ఎప్పటికీ అభివృద్ధి చెందలేవు. నేడు తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రమాదకరమైన పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ చర్చలు పెరుగుతున్నాయి. కానీ ప్రజల జీవిత నాణ్యతపై చర్చలు తగ్గుతున్నాయి. సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులు పెరిగి, యువత భవిష్యత్తుపై చర్చలు తగ్గుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు బలహీనపడితే ఎంతటి రాజకీయ ప్రచారం జరిగినా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడవు. యువతకు రాజకీయ ప్రసంగాలు అవసరం లేదు. వారికి ఉద్యోగం కావాలి. నినాదాలు అవసరం లేదు. నైపుణ్యాభివృద్ధి కావాలి. భావోద్వేగాలు అవసరం లేదు.
మనం ఎటు వెళ్తున్నాం?
ప్రపంచం నేడు కృత్రిమ మేధస్సు, సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, హైటెక్ తయారీ రంగాల్లో ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం పోటీ అంతా దేశాల మధ్యే కానీ కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య కాదు. జ్ఞానం, నైపుణ్యాలు, పెట్టుబడులు, సాంకేతికతల మధ్య జరుగుతోంది. ప్రపంచం భవిష్యత్తు కోసం సిద్ధమవుతుంటే మనం గత వివాదాల్లోనే చిక్కుకుంటే అవకాశాలను కోల్పోతాం. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం తాత్కాలిక విజయం ఇవ్వొచ్చు, కానీ ప్రజల జీవితాలను మెరుగుపరచే అభివృద్ధి మాత్రమే శాశ్వత గౌరవాన్ని, విశ్వాసాన్ని అందిస్తుంది. అభివృద్ధి లేని రాజకీయాలు చివరకు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతాయి. అభివృద్ధి ఆధారిత రాజకీయాలే భవిష్యత్తును నిర్మిస్తాయి.
కొత్త దిశ అవసరం..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ అపారమైన సామర్థ్యం కలిగిన రాష్ట్రాలు.. వ్యవసాయం, పరిశ్రమలకు అవకాశాలు ఉన్నాయి. సాంకేతిక నైపుణ్యం, అద్భుతమైన యువశక్తి కలిగి ఉన్న రాష్ట్రాలు. ఇక్కడ అవసరమైంది ఒక్కటే సరైన ప్రాధాన్యతలు రాజకీయ పోటీ అభివృద్ధి కోసం జరగాలి, ఎవరు ఎక్కువ ఉద్యోగాలు సృష్టిస్తారో, ఎక్కువ పరిశ్రమలు తీసుకొస్తారో అనే విషయాల్లో పోటీ ఉండాలి. అలాగే విద్యా ప్రమాణాలు మెరుగు పరచడంలో, రైతు ఆదాయం పెంచడంలో పోటీ ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజల జీవితాలను మెరుగుపరిచిన నాయకులను చరిత్ర గుర్తుంచుకుంది. ప్రజల దృష్టిని మళ్లించిన నాయకులను చరిత్ర మరచిపోయింది. అందుకే ఈ రోజుకైనా నాయకులు.. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం ఆపండి. మీడియా సైతం సంచలనాల కంటే ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వండి.
-డా. బి. కేశవులు ఎం.డి.
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం
85010 61659






