- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేపాల్ జెన్-జడ్ నిరసనలు ఓ వార్నింగ్ బెల్.. మేలుకోకుంటే అంతే!
ఇటీవల నేపాల్‌లో చెలరేగిన ఉద్రిక్తతలు ప్రజాస్వామ్య దేశాలకు ఒక వార్నింగ్ బెల్. శ్రీలంక, బంగ్లాదేశ్ తర్వాత ఇప్పుడు నేపాల్ అదే దారిలో

ఇటీవల నేపాల్‌లో చెలరేగిన ఉద్రిక్తతలు ప్రజాస్వామ్య దేశాలకు ఒక వార్నింగ్ బెల్. శ్రీలంక, బంగ్లాదేశ్ తర్వాత ఇప్పుడు నేపాల్ అదే దారిలో పయనిస్తోంది. ప్రజాస్వామ్యం పేరు మీద ప్రజలకు న్యాయమైన, సమానతతో కూడిన జీవితాలను అందించలేనప్పుడు ఒక్కసారి పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతాయో.. ఈ దేశాల సంఘటనలు రుజువు చేస్తున్నాయి. చరిత్ర నుండి ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోవడం మరిచిపోతాయి. సాధారణ ప్రజల బలాలను తక్కువ అంచనా వేస్తాయి. తమకున్న పోలీసు, మిలిటరీ శక్తితో ఎలాంటి ఉద్యమాలనైనా నిరసనలనైనా అణచివేయగలమని ధీమాతో ఉంటాయి..
అయితే పరిస్థితులు తాము రాసుకున్న సిలబస్‌కి భిన్నంగా కూడా ఉంటాయని, ప్రజలు అసంతృప్తికీ, కోపానికీ గురయ్యేటప్పుడు తమ విలాసవంతమైన భవనాలు ఎలా పేక మేడల్లాగా కూలిపోతాయో.. ఈరోజు నేపాల్ సంఘటనలు మరోసారి రుజువు చేస్తున్నాయి.
వర్చువల్ ప్రపంచం లేకుండా చేస్తారా?
నేపాల్ ఉద్రిక్తతలకు ప్రత్యక్ష కారణం సోషల్ మీడియా నిషేధం అని తెలుస్తుంది. సోషల్ మీడియా అనేది నేడు వినోదం పాత్ర నుండి బయటకు వచ్చి ప్రజలకు ఉపాధిని అందించే ఒక సాధనంగా కూడా మారింది. దాంతో పాటు ఏ దేశ పౌరుడికైనా తమ అభిప్రాయాలను వ్యక్తపరచుకోవడానికి ఒక స్పేస్ అందించింది. ఇంతకుముందు లేని ఒక కొత్త రకమైన వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించింది. సోషల్ మీడియాను నిషేధించడం అంటే మనిషికి బతకడానికి వర్చువల్ నేల లేకుండా చేయడమే. ప్రాథమిక హక్కుల్నీ, మాట్లాడే హక్కునీ, జీవించే హక్కునీ, అవతలి ప్రపంచంతో కమ్యూనికేట్ చేయగలిగే హక్కునీ పూర్తిగా తెంచెయ్యడమే. ఏ దేశంలో అయినా సరే ఈ రకమైన చర్య చాలా విపత్కర పరిణామాలను తీసుకురావడం సర్వసాధారణం. దాంతో పాటు ఇప్పటికే నేపాల్ 20 శాతం నిరుద్యోగంతో సతమతమవుతోంది. యువత నేపాల్‌ని విడిచి ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్లాల్సి వస్తోంది.
నేతల జీవన శైలి ఇంతగా మారిందా?
రాజరిక వ్యవస్థ అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి పునాది వేసి, తర్వాత రాజ్యాంగం రాసుకుని ఒక న్యాయమైన జీవితాన్ని ప్రజలకు అందించాలని అనుకున్నారు. తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు, మంత్రులు రాసుకున్న రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజలకు న్యాయమైన జీవితాన్ని అందించకుండా విలాస వంతమైన జీవితాల్లో మునిగి పోవడం అక్కడి ప్రజలు చూస్తు న్నారు. కమ్యూనిస్టు, మావోయిస్టు సిద్ధాంతాలను అలవర్చుకున్న నాయకుల మీద కూడా ప్రజలకు విశ్వాసం లేదని తెలుస్తోంది. మనదేశంలో బడా కార్పొరేట్లు తమ పిల్లల వివాహాలను ఎంత పటాటోపంతో విలాసవంతంగా నిర్వహించారో గతంలో చూశాం. అక్కడ మంత్రులూ, నాయకు లూ, వారి కుటుంబాలూ ఇదే విలాసాలతో జీవించడం, అవి సోషల్ మీడియాలో కనిపించడం అక్కడ ప్రజలను మండి స్తూనే ఉంది. ఏ దేశాల్లో అయినా సరే ఒక ప్రత్యేక వర్గం విపరీతమైన విలాసాలు అనుభవిస్తూ, మరో మెజారిటీ వర్గం ఎల్లప్పుడూ కష్టాల కడలిలో పయనిస్తున్నప్పుడు ఆ దేశాల్లో అసంతృప్తి ఒక్కోసారి ఇలానే లావాలా పొంగుతుంది. నేపాల్ చరిత్రను చూస్తే కమ్యూనిస్టు మావోయిస్టు భావ జాలం కూడా ఈ నాయకులలో మిళితమై ఉంది. మరి అలాంటప్పుడు నాయకుల జీవనశైలి నిజంగానే బూర్జువా పంథాలో పడిందా అనేది ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది.
నేపాల్ భవిష్యత్తుకు ఇది ప్రమాదం..
అయితే ఈ ఉద్రిక్తతలు నేపాల్‌లో ఒక మంచి మార్పుకు దారి తీస్తాయని ఆశ పడలేం. సుప్రీంకోర్టు మాజీ న్యాయాధీశురాలు సుశీల కర్కీ తాత్కాలికంగా దేశ ప్రధానిగా ఎన్ను కోవడం జరిగినప్పటికీ కూడా ఇంకా ఎంతో మార్పు జర గాల్సిన అవసరం ఉంది. జెన్ జెడ్ యువత ఆరంభించిన ఈ ఉద్రిక్తతల వెనుక సరైన నాయకత్వం, ప్రణాళిక లేదు. కేవలం రాజకీయ నాయకుల మీద కోపంతో చేసే విప్లవాలు శాశ్వతంగా విజయవంతం కావు. ఆఫీసులను ధ్వంసం చేయడం, పార్లమెంటుకి, సుప్రీంకోర్టుకీ నిప్పు పెట్టడం, అవసరమైన కాగితాలను తగలబెట్టడం ఇదంతా కూడా నేపాల్‌కు భవిష్యత్తులో మరో మంచి జీవితం లభిస్తుందని ఆశ కనుచూపు మేరలో కనిపించడం లేదు. అనుభవం, రాజకీయ చైతన్యం, ప్రగతిశీల భావాల ప్రభావం లేని యువత ఆరంభించిన ఈ ఉద్యమం ఒక ప్రత్యేక ప్రణాళిక ఉన్న ఉద్యమం కాదు. వ్యవస్థ మీద ఆవేశంతో మాత్రమే కొనసాగిన ఉద్యమం చాలా వేగంగానే చల్లారిపోతుంది.
సైన్యం, రాజరికం మళ్లీ వస్తే...!
నేపాల్ ప్రజలకు ఇప్పుడు కొత్త రకం సమస్యలు కూడా ఉన్నాయి. ఇదే అదనుగా సైన్యం నేపాల్‌ని తన ఆధీనంలోకి తీసుకునే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. అలా కాకపోతే మయన్మార్ లాంటి పరిస్థితి నేపాల్‌కి పడుతుంది. అలానే రాజరిక వ్యవస్థ నిశ్శబ్దంగా చాప కింద నీరులాగా రాకుండా జాగ్రత్త పడాలి. అలానే కనీసం తాము రాసుకున్న రాజ్యాంగానికి కట్టుబడి పరిపాలన చేయగలిగే ప్రభుత్వాల అవసరం వీరికి ఉంది. ఉద్యమాలు హింసాత్మకంగా మారినంత మాత్రాన ఫలితాలు ప్రజా సమూహాలకు దొరికే పరిస్థితిలో ఉండకపోవచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణం ఒకే రకంగా ఉన్నప్పుడు అందులో మనుషులు అటు ఇటు మారతారు. మరలా అలాంటి నాయకుల చేతుల్లోకి నేపాల్ వెళ్లిపోయే రిస్క్ లేకపోలేదు. ప్రస్తుతం ఇలాటి జెన్ జెడ్‌లో కావాల్సింది ఆవేశం కాదు చైతన్యం. పౌరులు సరైన చైతన్యాన్ని అందుకొని తమ వర్గానికి ఏమి కావాలో స్పష్టంగా ప్రశ్నించగలిగే స్థాయికి వెళ్లేటప్పుడు వ్యవస్థలను కదిలించగలరు. అది దీర్ఘకాల ప్రణాళిక ద్వారా చేయాల్సిన పని. రెండు మూడు రోజుల్లో చేసే పనులు కావు ఇవి. కాబట్టి నేపాల్‌కి సరైన, న్యాయమైన జీవితం ఆయా ప్రజలకు కావాలీ అంటే ఈ రకమైన విధ్వంసం అలాంటి ప్రభుత్వాలను అందిస్తుందని ఆశ కనిపించడం లేదు.
- కేశవ్
ఆర్థిక సామాజిక విశ్లేషకులు
98313 14213






