రక్తమోడిన నేపాల్... దశాబ్దాల అసంతృప్తి ప్రతిఫలమా?

by Ravi |   (  Updated:2025-09-10 01:15:49  IST  )

నేపాల్ రాజధాని ఖాఠ్మండు వీధులు రక్తమోడుతున్నాయి. సోషల్ మీడియా‌పై నిషేధంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపాల్ యువత

రక్తమోడిన నేపాల్... దశాబ్దాల అసంతృప్తి ప్రతిఫలమా?
X

నేపాల్ రాజధాని ఖాఠ్మండు వీధులు రక్తమోడుతున్నాయి. సోషల్ మీడియా‌పై నిషేధంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపాల్ యువత ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆ దేశంలో జెన్ జెడ్ నిరసనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన సోషల్ మీడియా నిషేధం ఇందుకు తాత్కాలిక ట్రిగ్గర్‌గా మారినప్పటికీ, లోతైన కారణాలు అవినీతి, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం వంటివి దేశంలోని యువతను విసిగించి వేధిస్తున్నాయి.

2025 సెప్టెంబర్ 8న జరిగిన ఘర్షణల్లో కనీసం 19 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడంతో పార్లమెంట్ ప్రాంగణం యుద్ధ భూమిగా మారింది. దీంతో నేపాల్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

ప్రజాస్వామ్యం, మోనార్కీ.. దోబూచులాట

ఈ ఘర్షణల కారణంగా ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపినప్పటికీ, నిరసనలు దేశ వ్యాప్తంగా వ్యాపించాయి. పైకి వినిపిస్తున్నట్లు ఇది కేవలం సోషల్ మీడియా నిషేధం గురించి మాత్రమే కాదు. ఇది దశాబ్దాలుగా పేరుకు పోయిన అసంతృప్తి యొక్క వ్యక్తీకరణ. నేపాల్ చరిత్రలో నిరసనలు కొత్త కావు. 2008లో రాజరికం రద్దు చేసిన తర్వాత, కమ్యూనిస్టు గ్రూపులు అధికారంలోకి వచ్చాయి. కానీ ఇది రాజకీయ అస్థిరతకు, అవినీతికి మూలమైంది. మావోయిస్ట్ తిరుగుబాటు (1996-2006) దేశాన్ని సివిల్ వార్‌లో ముంచేసింది. ఆ తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఆశలు రేకెత్తించింది. అయితే, 2025 లో ప్రో-మోనార్కీ నిరసనలు మళ్లీ తలెత్తాయి. హిందూ రాజ్య స్థితిని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ 60,000 మంది పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య వాగ్దానాలు.. హుళక్కి

ఈ తిరుగుబాటు ఉద్యమం నేపాల్‌లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వాలపై అసంతృప్తిని ప్రతిబింబిస్తాయి. ఎందుకంటే రాజరికం రద్దు తర్వాత దేశం ఆర్థిక సంక్షోభాలు, మతపరమైన గుర్తింపు కోల్పోవడం వంటి సమస్యలతో పోరాడు‌తోంది. మధేసి ఉద్యమాలు, జన జాతి డిమాండ్లు, టీచర్ల నిరసనలు (ఎడ్యుకేషన్ బిల్ కోసం) వంటివి ఫెడరల్ వ్యవస్థలోని లోపాలను బయట పెడుతున్నాయి. ఇటీవలి కొవిడ్-19 మహమ్మారి, 2015 భూకంపం తర్వాత పునర్నిర్మాణ లోపాలు యువతలో అసంతృప్తిని మరింత పెంచాయి. ఈ చారిత్రక నేపథ్యం ఇప్పటి నిరసనలకు బలమైన పునాది ఏర్పడింది. ఎందుకంటే ప్రజలు ప్రజాస్వామ్య వాగ్దానాలు నెరవేరలేదని భావిస్తున్నారు.

సోషల్ నిషేధం కాదు.. సెన్సార్‌షిప్

ఈ నిరసనలకు ప్రధాన కారణాలు బహు ముఖాలుగా ఉన్నాయి. సోషల్ మీడియా నిషేధంతో ( ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి 26 యాప్‌లపై‌) ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధానికి కారణం చూపుతూ ప్రభుత్వం టాక్స్, రిజిస్ట్రేషన్ సమస్యలను సాకుగా చూపిస్తుంది, కానీ యువత దీన్ని సెన్సార్‌షిప్‌గా చూస్తోంది. ఇవి అవినీతిని బహిర్గతం చేసే వీడియోలు, పోస్టులను అడ్డు కోవడానికి ప్రయత్నమని వారి అభిప్రాయం. లోతుగా చూస్తే, నిరుద్యోగం (15-29 ఏజ్ గ్రూప్‌లో 19.2 శాతం), పేదరికం (పెర్ క్యాపిటా ఇన్‌కమ్ $1,300), నెపోటిజం, రాజకీయ వర్గాల పిల్లల లగ్జరీ లైఫ్ వంటివి యువతను కదిలిస్తున్నాయి. ప్రభుత్వం విశ్వాసం కోల్పోవడం, డెసిషన్ మేకింగ్‌లో యువతను సైడ్‌లైన్ చేయడం ఇందుకు ఇందుకు ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ నిరసనలు బంగ్లాదేశ్ ఉద్య మాలను తలపిస్తున్నాయి. లీడర్‌షిప్ లేకుండానే దేశవ్యాప్తంగా వ్యాపిం చడం ఆందోళనకరం.

యువతకు భాగస్వామ్యం కల్పించకపోతే..

విమర్శనాత్మకంగా చూస్తే, ప్రభుత్వం యువత గొంతును అణచివేయడానికి బదులు సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే ఇది వ్యవస్థ మార్పునకు దారితీస్తుంది. కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వం చైనా పట్ల మొగ్గు చూపేదిగా భావిస్తున్నారు. ఇండియా వైపు మొగ్గు చూపే నాయకులు ఇందుకు ప్రత్యామ్నాయంగా ఉద్భవిస్తున్నారు. నేపాల్‌లో ప్రస్తుతం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నిషేధాన్ని ఎత్తి వేసినప్పటికీ, నిరసనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి, పార్లమెంట్‌లోకి చొరబాటు, మంత్రులు, ప్రధానమంత్రి రాజీనామాలు దేశంలోని అస్థిరతను బయటపెడుతున్నాయి. యుఎన్ సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది. కానీ ప్రభుత్వం హింసాత్మక దమనాన్ని కొనసాగిస్తోంది. అంతేకాదు ఇది రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఎందుకంటే యువత డెసిషన్ మేకింగ్‌లో భాగస్వామ్యం కోరుతోంది.

సిటిజన్ అసెంబ్లీల ఏర్పాటే మార్గం!

ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయడం కష్టం. ముందుగా, మరణాలపై పారదర్శకమైన విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలి. నిరసనకారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి, అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. ఆర్థిక సంస్కరణలు, జాబ్ క్రియేషన్, ఎడ్యుకేషన్ బిల్ పాస్ చేయడం ద్వారా యువత విశ్వాసాన్ని తిరిగి పొందాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌ను రక్షించడం, సిటిజన్ అసెంబ్లీలు ఏర్పాటు చేయడం వంటివి దీర్ఘకాలిక పరిష్కారాలుగా చూడాలి. విమర్శ నాత్మకంగా పరిశీలించి చూస్తే, ప్రభుత్వం తన అథారిటేరియన్ ధోరణిని మార్చుకోకపోతే, ఇది మరిన్ని ఘర్షణలకు దారి తీస్తుంది. అమ్నెస్టీ ఇంటర్నే‌షనల్ వంటి సంస్థలు శాంతియుత నిరసనలను రక్షించాలని పిలుపునిచ్చాయి.

యువతను పక్కనబెడితే డేంజర్!

మంత్రుల రాజీనామాలు.. ప్రధాని ఓలీ రాజీనామా చేయడంతో ఉప ప్రధానికి తాత్కాలిక బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు వార్త‌లొస్తు న్నాయి. ఈ నేపథ్యం‌లో నేపాల్ నిరసనలు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. యువత అసంతృప్తిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. చారిత్రక లోపాల నుండి పాఠాలు నేర్చుకుని, ప్రస్తుత సమస్యలను పరిష్కరించడం ద్వారా మాత్రమే దేశం స్థిరత్వాన్ని సాధించగలదు. లేకపోతే, ఈ అగ్ని మరింత వ్యాప్తి చెందుతుంది.

-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్,

98493 28496

Next Story