- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటితరం గురువులకు మార్గదర్శి!
వ్యవస్థ ఏదైనా అది జీవనది వంటిది. అది నిరంతరం తన మార్గం మార్చుకొని ప్రవహిస్తూ ఉంటుంది. కానీ దాని ప్రధాన నీటి లక్షణాన్ని మార్చుకోలేదు అలాగే మన సామాజిక వ్యవస్థలలోని తీరు కూడా!

వ్యవస్థ ఏదైనా అది జీవనది వంటిది. అది నిరంతరం తన మార్గం మార్చుకొని ప్రవహిస్తూ ఉంటుంది. కానీ దాని ప్రధాన నీటి లక్షణాన్ని మార్చుకోలేదు అలాగే మన సామాజిక వ్యవస్థలలోని తీరు కూడా! సభ్య సమాజానికి మూల స్తంభం వంటి విద్యా వ్యవస్థ తీరు కూడా నదీ ప్రవాహం వంటిదే, కాలానుగుణంగా ఎన్ని మార్పులు వచ్చినా, మార్గాలు మారిన, దాని లక్ష్యం ఒకటే, కానీ నేటితరం విద్యావంతులందరి మాట ఒకటే "కాలం మారిపోయింది విద్యావ్యవస్థ నాశనం అయిపోతుంది" అంటూ ముక్తకంఠంతో ఏకరువు పెడుతున్నారు.
ఇలాంటి సందేహాలు అన్నిటికీ సరైన సమాధానాలు చెబుతూ 90 ఏళ్ల అధ్యాపక శిఖరం 70 ఏళ్ల నాటి తన ఉపాధ్యాయ ఉద్యోగపు అనుభవాలు అనుభూతులు సమ్మిళితం చేసి అందించిన జ్ఞాపకాల నిధి ‘నేనొక నిత్య విద్యార్థిని’. సుదీర్ఘ కాలపు తెలుగు బోధనా అనుభవం గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన జ్ఞానం కలగలిపి వ్రాసిన ఈ పుస్తక రచయిత ప్రముఖ సాహితీ మూర్తి ఎర్రాప్రగడ రామమూర్తి,
70 సంవత్సరాల బోధనానుభవం..
నేటి ఆధునిక విద్యావ్యవస్థకు చెందిన బాధ్యులంతా తమ కాలంలోనే ఈ మతలబులు అని తెగ బాధ పడిపోయే వారంతా, ఈ పుస్తకం ఆసాంతం చదివితే సమస్యలు సర్వ కాలాల్లో ఉంటాయి, వాటిని సాధించడమే మన కర్తవ్యం అని చాటి చెబుతూ... గురువులందరికి మంచి భరోసా ఇస్తూ బాధ్యతను పెంపొందిస్తుంది ఈ పుస్తకం, రామమూర్తి 1959 నుంచి 2025 వరకు సాగిన తన బోధన ప్రస్థానంలోని ఆదర్శనీయమైన అంశాలను బోధన వృత్తిపరులు అందరికీ బోలెడు ఆత్మస్థైర్యం అందిస్తూ ఎక్కడ దాపరికాలు లేకుండా చెప్పారు, అప్పుడప్పుడు తాను చేసిన తప్పులు దరిమిలా జరిగిన పరిణామాలు తద్వారా కలిగిన పశ్చాత్తాపాలు కూడా, ఇందులో మన చదవవచ్చు.
ఆనాడూ టీచర్లకు తప్పని అవమానాలు..
తన బోధన ప్రయాణంలో వివిధ హోదాల్లో, విభిన్న ప్రాంతాల్లో పనిచేసిన రామ్మూర్తి ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు అవమానాలు, అవహేళనలు, కష్టాలు, నేటికీ అధ్యాపక వర్గం ఎదుర్కొంటున్నారు, అయితే ఇవి అన్ని నేటి ఆధునిక కాలపు వైపరీత్యాలు అని సరిపుచ్చుకుంటున్నారు, కానీ ఇవి నాటి కాలంలోనూ నిక్షేపంగా ఉన్నాయనే నిజాన్ని చాటి చెప్పారు ఈ నిత్య విద్యార్థి. సమస్యలను ఎదుర్కోవడానికి కావలసింది అంకిత భావం, సాధన, నిరంతర అధ్యయనం, ద్వారా అధ్యాపకులంతా సమిష్టి కృషి చేసి ఎలాంటి జఠిలమైన వ్యవస్థను అయినా సులభంగా మార్పు వైపు మరల్చవచ్చు అని రచయిత తనదైన అనుభవాల ద్వారా నిజం చేసి చూపించారు.
ద్విభాషా బోధనలో చేయితిరిగిన వాడు..
రచయిత రామమూర్తి తెలుగాంగ్ల భాషా బోధనల్లో చేయి తిరిగిన వాడు, చక్కని సృజన కారుడు, ఇంపైన రచనా శైలి సొంతమైన వాడు, కనుక వీరి రచన చదువరులను ఇట్టే ఆకర్షించి ఆగకుండా చదివిస్తుంది, "వేరుదన్ను" మొదలు "అభ్యాసం కూసు విద్య" వరకు సాగిన 12 భాగాల అనుభవాల దొంతరలోని శీర్షికలన్నీ భలే ఆకర్షణీయంగా ఉన్నాయి, గత కాలము మేలు, గౌరవాల మేట గౌరీ దేవి పేట, పాలమనసులు, శబరీ గోదారుల సొబగులు, చేదు మందు, అనుభవాల కలనేత తరగతి మేత, వడగాలులు చిరుజల్లులు, ఉషోదయ ప్రయో ప్రమోదం, తదితర శీర్షికలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో అందులోని అనుభవాల అనుభూతులు అంతే విలువైన సమాచారం పంచుతాయి.
ఇబ్బందులు రెండు విధాలు
తాత్కాలిక ఉపాధ్యాయునిగా, ట్యూషన్ టీచర్‌గా, ప్రభుత్వ హెడ్మాస్టర్‌గా, తెలుగు పండితునిగా, ప్రైవేటు విద్యాలయ ప్రిన్సిపల్‌గా, పాత్రికేయ పాఠశాల బోధకునిగా, రామ్మూర్తి అక్షర కృషి ప్రతి బోధకునికి వృత్తిపరమైన భరోసాను ఇస్తుంది. విద్యార్థులు రాని పాఠశాలలు నేడే కాదు నాడూ ఉన్నాయి. మరి అధ్యాపకుల పోలికతో విద్యార్థుల రాక ఎలా పెరుగుతుందో తెలియాలి అంటే "రావి గూడెం రాళ్ల గూడెం" విభాగం విధిగా చదవాలి. సహ బోధకుల ద్వారా వచ్చే ఇబ్బందులు, హెడ్మాస్టర్ల వెర్రి పెత్తనాలను ఎలా ఎదుర్కోవాలి, కొందరు చదువు లేని కొంటె విద్యార్థులు పెట్టే కష్టాలను ఎలా అధిగమించాలి, ఇందులో మాస్టారి అనుభవాల ద్వారా తెలుస్తాయి.
నేటి కాలపు ఉత్తమ రచన..
ఎలాంటి ఇబ్బందుల నైనా అధిగమించడానికి కావలసిన ఆయుధాలు.. క్రమశిక్షణ, స్నేహభావం, వీటికి తోడు అంకితభావపు బోధన, నిరంతర అధ్యయనం, ఈ నాలుగు లక్షణాలు సొంతమైన అధ్యాపకులంతా విద్యార్థులే కాదు సాటి అధ్యాపకులు తద్వారా సభ్య సమాజం యొక్క మనసుల్లో నిత్యం నిలిచిపోయి... అత్యుత్తమ అధ్యాపకులై విరాజిల్లుతారు, అటువంటి ఆశయంకల వారంతా ఆలస్యం చేయకుండా సొంతం చేసుకుని చదవాల్సిన నేటి కాలపు ఉత్తమ రచన ఈ పుస్తకం, అనడంలో అతిశయం లేదు.
పుస్తకం: నేనొక నిత్య విద్యార్థిని
పేజీలు: 97,
వెల: కొనగలిగినంత
ప్రతులకు: ఎర్రాప్రగడ రామమూర్తి
సెల్: 63042 39183
సమీక్షకులు
-డా. అమ్మిన శ్రీనివాసరాజు,
77298 83223






