- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశ్వ మానవాళి సంక్షేమం@సైన్స్
1930 లోనే కేవలం రెండు వందల రూపాయలు విలువ చేసే పరికరాలతో "రామన్ ఎఫెక్ట్"ను కనుగొని ఆసియా ఖండంలోనే ఫిజిక్స్

1930 లోనే కేవలం రెండు వందల రూపాయలు విలువ చేసే పరికరాలతో "రామన్ ఎఫెక్ట్"ను కనుగొని ఆసియా ఖండంలోనే ఫిజిక్స్ విభాగంలో తొలి నోబెల్ సాధించి, భారతీయ మేధా శక్తిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన 'భారతరత్నం' సి.వి.రామన్. ఆయన రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నది ఫిబ్రవరి 28,1928. దీన్ని పురస్కరించుకుని 1987 నుంచి ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ఈ రోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించి, దేశవ్యాప్తంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంది.
ప్రతిక్షణం ప్రకృతి అందాలలో శాస్త్రీయ దృక్పథాన్ని వెతికే రామన్ అన్వేషణలో 'ఆకాశం, సముద్రపు నీరు ఎందుకు నీలంగా వున్నాయి' అన్న ప్రశ్నకు జవాబే కాంతి పరిక్షేపణంనకు సంబంధించిన రామన్ ఎఫెక్ట్."పారదర్శకంగా వున్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింప చేసినప్పుడు అది దాని స్వభావాన్ని మార్చుకుంటుంది."
నా మతం సైన్స్, దాన్నే ఆరాధిస్తా
లేజర్ కిరణాల రంగప్రవేశంతో రామన్ ఎఫెక్ట్, శాస్త్రవేత్తలకు ఒక బలమైన ఆయుధమైంది. స్ప్రెక్టోస్కోపి అనే విభాగం గొప్పశాస్త్రంగా అధ్యయనం చేయబడుతుంది. నేటికీ రామన్ ఎఫెక్ట్ అనువర్తనాలు ఎన్నో నూతన శాస్త్రీయ ఆవిష్కరణలకు జీవం పోస్తూ, ఆధునిక విజ్ఞానంలో కిరణాలై దూసుకుపోతున్నాయి. 1943లో రామన్ సొంతంగా "రామన్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్"ని బెంగళూరులో స్థాపించారు. నేడు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖగోళశాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం, ఆప్టిక్స్, థియరిటికల్ ఫిజిక్స్, రసాయన శాస్త్రం, ఫిజిక్స్ ఇన్ బయాలజీ వంటి ఎన్నో విభాగాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. రామన్ పరిశోధనలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సవాళ్ళే. నా మతం సైన్స్. నేను దాన్నే ఆరాధిస్తాను" అన్న రామన్‌కు 1954లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో ఘనంగా గౌరవించింది.
8 దశాబ్దాలుగా మరో రామన్ రాలే...!
మరి 78 సంవత్సరాల స్వాతంత్ర్య భారత్‌లో మనదేశ పౌరసత్వం నుంచి ఫిజిక్స్‌లో మరో రామన్ ఎఫెక్ట్ రాలేదు. మళ్ళీ మనం నోబెల్ గెలవలేదు. గ్రామాలకు సరైన శాస్త్రీయత, సాంకేతికత అందడం లేదు. మూఢ నమ్మకాల జాడ ఇంకా మనదేశం నుంచి బయటపడలేదు. నేటికి మన దేశంలోని శాస్త్రవేత్తలకు, మేధావులకు సరైన గౌరవం, పరిశోధనా వసతులు లభించక అగ్రదేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో సైతం విజ్ఞాన శాస్త్ర బోధనలు మార్కుల మాయాజాలంలో బంధీ అయ్యాయి. సంపాదనే ధ్యేయంగా కొందరు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల నిర్వాహకులు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చుతున్నారు. నేటి యువత కూడా "తొందరగా సెటిల్" కావాలనే ప్రపంచ పోకడలలో భాగమై, సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
మరిన్ని పరిశోధనలను ప్రోత్సహించేలా..
విజ్ఞాన శాస్త్రాలను బోధించే అధ్యాపకులు వారి బాధ్యతలను విశాలమైన దృక్పథంతో చూడగలగాలి. కేవలం శాస్త్రంలోని సిద్ధాంతాలను, ప్రయోగాలను, ప్రక్రియలను బోధించడమే కాకుండా విద్యార్థులకు సామాజిక బాధ్యతలను నెరవేర్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా తయారు చేయాలి. సైన్స్, సాంకేతికత,సమాజాల మధ్య గల అవినాభావ సంబంధాల గురించి సంక్లిష్టంగా విద్యార్థులు ఆలోచించగలగాలి. విశాల ఆలోచనా విధానం, జాతీయ సమగ్రత, పర్యావరణ స్పృహ, ప్రజాస్వామ్య విలువలు పెంపొందిస్తూ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరిన్ని పరిశోధనలను ప్రోత్సహిస్తూ, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు, మానవీయ విలువలను కూడా విద్యార్థుల్లో పెంపొందించే విద్యావిధానం నేడు మనందరికీ చాలా అవసరం. నిరంతర పరిశ్రమ స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞాన శాస్త్రాన్ని మధించి వేస్తాయన్న సి.వి.రామన్ స్ఫూర్తితో మరో అభినవ "రామన్ ఎఫెక్ట్" ప్రపంచానికి అందాలని కోరుకుందాం.
-ఫిజిక్స్ అరుణ్ కుమార్
ప్రయివేటు టీచింగ్ ఫ్యాకల్టీ
93947 49536






