నడుస్తున్న చరిత్ర:ఇవేమి వికృత రాజకీయాలు

by Disha edit |
నడుస్తున్న చరిత్ర:ఇవేమి వికృత రాజకీయాలు
X

సభలో ప్రధాని మోడీ మినహా నేతలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ దూషణ పర్వంలో చెప్పిన మాటలే చెప్పి విసిగించారు. రాష్ట్రాన్ని సాధించిన నేతపై బీజేపీ మాటల దాడులు తెలంగాణ ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించే రీతిలోనే సాగాయనవచ్చు. 'తెలంగాణ నేలపై పుట్టినోడు' అంటే అనవచ్చు కానీ, యూపీ, గుజరాత్‌వాళ్లు నోటికొచ్చినట్లు అనడమేమిటని ఎవరికైనా అనిపిస్తుంది. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలు టీమ్ ఇండియాలాగా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉంది. ఏ పార్టీ గెలిచినా, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కలిసి పనిచేయాలి. సత్సంబంధాలు, పరస్పర విశ్వాసాలు ఆవశ్యకం. ఇప్పటికైనా వ్యక్తిగత మాటల తూటాలు మానేసి తెలంగాణ ప్రజల మనసు దోచుకొనే రీతిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తే ఇక్కడి ప్రజలు ఆనందిస్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు నచ్చినవారికి ఓటేస్తారు.

తరానికి ఎలా ఉందో కానీ, గత నాలుగైదు దశాబ్దాలుగా దేశంలోని రాజకీయాలను, కేంద్ర రాష్ట్ర సంబంధాలను గమనిస్తున్న వారు మాత్రం పాలకులలో ఇంత దిగజారుడుతనం ఎన్నడూ చూడలేదనవచ్చు. 1984 ఆగస్టు‌లో ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత ఎన్టీఆర్ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన సందర్భంలో ప్రధాని ఇందిర ప్రోద్బలంతో గవర్నర్ రాంలాల్ ఆర్థిక మంత్రి నాదెండ్ల భాస్కర్‌రావును సీఎంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ దీనిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అప్పుడు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆయన వెంట నడిచాయి. నెల రోజుల తరువాత రాంలాల్ వెనక్కి వెళ్లిపోగా, నాదెండ్ల పీఠం దిగిపోయారు. ఈ సంఘటన మినహా ముఖ్యమంత్రి, గవర్నర్ లేదా ప్రధానమంత్రి మధ్య సంబంధాలు ఇంతగా భ్రష్టుపట్టిన సందర్భాలు తెలుగు నేలపై లేవు. తాము కూర్చున్న సీటు విలువ కాపాడడంలో ఇరువైపులా నేతలు విఫలమయ్యారు.

మే నెలలో ఐఎస్‌బీ ద్విదశాబ్ది ఉత్సవాలకు హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీ విమానాశ్రయంలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. ఆ భేటీ గౌరవసూచకంగా సాగలేదు. దేశ ప్రధాని హోదాలో వచ్చిన ఆయన పార్టీ బహిరంగ సభలో మాట్లాడినట్లు రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై వ్యక్తిగత విమర్శకు దిగడం చిత్రంగా ఉంది. అదే నెలలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణ ముఖ్యమంత్రిని చాలా తక్కువ చేసి మాట్లాడారు. అమిత్ షా ఇప్పుడు బీజేపీలో ఏ హోదాలేని కేంద్ర హోం మంత్రి. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తన పరిధిలోని ఓ భాగంలో ఎలా వ్యవహరించాలో మరిచి 'ఇంత అవినీతి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు' అన్నారు. నిజానికి ఆ మనిషి తగిన నిర్ధారణ లేకుండా అలా అనకూడదు. అన్నాక ప్రభుత్వ మంత్రిగా అందుకు తగిన చర్యలు చేపట్టాలి. అవినీతిపై తక్షణం విచారణకు ఆదేశించాలి. లేకపోతే ఆ ఆరోపణ ఓ జుమ్లాగానే మిగిలిపోతుంది.

రాజ్య విస్తరణ కోసమేనా?

పార్టీ పెద్దల మాటలకు, ప్రభుత్వంలో ఉన్నవారి మాటలకు తగిన అంతరం ఉంటే అది సభ్యతగా, సంస్కారంగా ఉంటుంది. తెలంగాణాలో ఆర్యపుత్రుల ప్రవేశంలో రాజ్యవిస్తరణ కాంక్ష కనబడుతుంటే రాష్ట్రనాయకత్వం మాత్రం యథావిధిగా తన ప్రతిష్టకు పాకులాడుతోంది. తన రాజ్యంలో ఎవరో బయటివారు దురాక్రమణకు పాల్పడుతున్నట్లు గందరగోళపడుతోంది. నూట నలభై కోట్ల జనాభా నాయకుడికి కేవలం నాలుగు కోట్ల ప్రజల ప్రతినిధికి అధికారాలు, హోదాలో చాలా తేడా ఉంటుంది.ముఖ్యమంత్రికి, ఒక శాఖ మంత్రికి మధ్యనే గౌరవంలో, అధికారంలో ఎంతో వ్యత్యాసముంటది. అలాంటిది సీఎం కన్నా పీఎం అధికారాలలో ఎన్నో రెట్లు పెద్ద. ఎవరు ఏ సీటులో కూచున్నా సీటు ఇచ్చిన అధికారాలు గ్రహించి మెదలాలి. ఎన్ని వైషమ్యాలున్నా గుంభనంగా పనులు, బాధ్యతలు చక్కదిద్దుకోవాలి.

ఇక్కడ వ్యక్తిగత కోపాలకు, అయిష్టతకు తావు లేదు. పీఎంను ఇంటికి పిలవకపోవడం తప్పు కాదుగానీ, రాష్ట్రానికి వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించకపోవడం ఓ అపవాదు కిందికే వస్తుంది. గవర్నర్‌తో ఓ వైపు మాటల యుద్ధం సాగుతున్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారానికి సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లివచ్చారు. అలాగే ప్రధాని వచ్చినపుడు సీఎంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఓ నమస్తే పెడితే సరిపోయేది. ముందే చెప్పినట్లు ఇక్కడ ప్రజలిచ్చిన అధికారానికి వ్యక్తిగత ప్రతిష్ట అడ్డుపడుతోంది.

దుబారా పనులు చేసి

జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ హైదరాబాద్‌ను ఎన్నుకోవడమే ఓ ఎత్తుగడ. దాన్ని హుందాగా ఎదుర్కోకుండా టీఆర్‌ఎస్ పోటీ ఫ్లెక్సీలు పెట్టడం ఓ దుబారా పని. బీజేపీ ఫ్లెక్సీలు పెట్టినవారిపై తెలంగాణ ప్రభుత్వం చట్టపర చర్యలు తీసుకోకుండా, ఆ తప్పు తాను కూడా చేసింది. ఇరువర్గాలను చూడకుండా జీహెచ్‌ఎంసీ కళ్లు మూసుకోవడం సిగ్గుచేటు. దీని కన్నా సామాన్యులు తప్ప రాజకీయపార్టీలు ఊరు నిండా ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చని మున్సిపల్ చట్టాన్ని సవరిస్తే సరిపోతుంది. దినపత్రికలలో తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన సందర్భంగా ఇచ్చిన ప్రకటనలను ఈ రెండు రోజులు మళ్లీ గుప్పించింది. ఈ అసందర్భ ఆర్భాటానికి పత్రికల ప్రకటనలకే రూ. మూడు కోట్ల ప్రజాధనం ఆవిరైందని అంటున్నారు.

పాలనలో ఉన్నవారిని కెలకడంలో బీజేపీ ముందుంటుంది. విపక్ష పాలనలో ఉన్న రాష్ట్రాలపై ఎప్పుడు డేగ చూపు వేయడం వారి పని. పాలన అందకపోతే అధికారాలను అడ్డం పెట్టుకొని బీజేపీయేతర పాలకులను ఇబ్బందులపాలు చేయడంలో నిమగ్నమై ఉంటుంది. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసు బయట 'సాలు దొరా..సెలవు దొరా' అని తెర ఏర్పాటు చేయడం దుందుడుకు చర్యగానే భావించాలి. దానికి బదులుగా మరిన్ని దీటైన ప్రతి విమర్శలు పుట్టుకొచ్చాయి. ప్రధాని మోడీపై అలాంటిదే ఒకటి టీఆర్‌ఎస్ ఏర్పాటు చేస్తే ఈ ఇద్దరూ 'దొందు దొందే' అన్నట్లు కాంగ్రెస్ మొదలుపెట్టింది. ఇలా రకరకాల కొత్త వేషాలు బయటికొచ్చాయి.

ఎందుకీ హంగామా?

జూలై రెండున రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ మోడీపై పెద్ద ఎత్తున విమర్శలు, ప్రశ్నలు సంధించారు. అంత పెద్ద మనిషిని పక్కన కూచోబెట్టుకొని ఆయన వచ్చిన పని, ఆయన అర్హతల గురించి మాట్లాడకుండా మోడీపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కేసీఆర్ జవాబు ఇవ్వలేని ప్రశ్నలూ ఉన్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ ఈ రీతిన జాతీయ పార్టీతో అదీ అధికారంలో ఉన్న పార్టీతో తలపెడితే దాని ఫలితం రాష్ట్ర ప్రజలు అనుభవించాల్సి వస్తుంది. యశ్వంత్ సిన్హాని వందలాది మోటారు సైకిళ్ల ర్యాలీతో స్వాగతించడం బీజేపీ లక్ష్యంగా సాగిన మరో హంగామా. వాటితో పొల్యూషన్‌తో పాటు పెట్రోల్ దండుగ. 'తెలంగాణ దిశా నిర్దేశం చేస్తున్నది, దేశం అనుసరిస్తుంది' అనే నినాదం పసలేని సొంత డబ్బానే. వాటిని అనుసరిస్తే ఆయా రాష్ట్రాలు కూడా ఆర్థిక ఇబ్బందులు చిక్కుకుంటాయి.

తెలంగాణకు మాదిరే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులున్నారు, వారి వారి విధానాలలో పాలన కొనసాగిస్తున్నారు. మరో రాష్ట్రాన్ని గుడ్డిగా ఎవరూ అనుసరించరు. ఆదివారం బీజేపీ బహిరంగ సభ ఘనంగా సాగినా అది పార్టీ షోలాగే మిగులుతుంది. ఖర్చు పెట్టి జనసమీకరణ చేయడం ఎవరికైనా తెలిసిన విద్యనే. సభలో ప్రధాని మోడీ మినహా నేతలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ దూషణ పర్వంలో చెప్పిన మాటలే చెప్పి విసిగించారు. రాష్ట్రాన్ని సాధించిన నేతపై బీజేపీ మాటల దాడులు తెలంగాణ ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించే రీతిలోనే సాగాయనవచ్చు. 'తెలంగాణ నేలపై పుట్టినోడు' అంటే అనవచ్చు కానీ, యూపీ, గుజరాత్‌వాళ్లు నోటికొచ్చినట్లు అనడమేమిటని ఎవరికైనా అనిపిస్తుంది. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలు టీమ్ ఇండియాలాగా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉంది. ఏ పార్టీ గెలిచినా, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కలిసి పనిచేయాలి. సత్సంబంధాలు, పరస్పర విశ్వాసాలు ఆవశ్యకం. ఇప్పటికైనా వ్యక్తిగత మాటల తూటాలు మానేసి తెలంగాణ ప్రజల మనసు దోచుకొనే రీతిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తే ఇక్కడి ప్రజలు ఆనందిస్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు నచ్చినవారికి ఓటేస్తారు.

బి.నర్సన్

94401 28169


Next Story

Most Viewed