నడుస్తున్న చరిత్ర:అవినీతి పరమో అధర్మః

by Disha edit |
నడుస్తున్న చరిత్ర:అవినీతి పరమో అధర్మః
X

తెలంగాణాలో ఈ సర్వేకు స్పందించిన 5,500 మందిలో 67 శాతం మంది ప్రభుత్వ ఆఫీసులలో డబ్బులు ఇవ్వనిదే పని జరగడం లేదన్నారు. ఉచితంగానే పనులు చక్కబడ్డాయని చెప్పినవారు 11 శాతం. ఎక్కడోచోట లంచాలు ఇచ్చుకుంటున్నామని 56 శాతం మంది చెప్పారు. రెవెన్యూలో 85 శాతం, పోలీసులలో 79 శాతం, మున్సిపాలిటీలలో 75 శాతం, కరెంటులో 65 శాతం లంచావతారాలున్నారని ఆ సర్వే వెల్లడించింది. రెవెన్యూ, పోలీసు శాఖలో 92 శాతం ఉద్యోగులు బహిరంగంగా లంచాలను డిమాండ్ చేస్తారని తేలింది. రాష్ట్ర సరిహద్దులలో ఉండే చెక్‌పోస్టుల ద్వారా ఏడాదికి రూ. 230 కోట్లు ఉద్యోగుల జేబులలోకి వెళతాయట. దీని పర్యవసానంగా రాష్ట్రం కొన్ని వేల కోట్లు రాబడి నష్టపోతోందని అనుకోవచ్చు.

కొన్ని నేరాలు సమాజ అంగీకార యోగ్యమవుతాయి. అలాంటి నేరాలకు పాల్పడేవారు నేరగాళ్లుగా కాకుండా గౌరవప్రదంగా సమాజంలో బతుకుతుంటారు. ఆ నేరాలను చేయడానికి, అలాంటి కొలువే కావాలని ఉద్యోగార్థులు ఉవ్విళ్లూరుతుంటారు. కన్నవారు వారిని ప్రోత్సహిస్తుంటారు. అలాంటివారికి పిల్లనిచ్చేందుకు అమ్మాయిలున్నవారు పోటీపడుతుంటారు. బిడ్డ సుఖసౌఖ్యాలతో బతుకుతుందని ఆశపడతారు. మూడు బంగళాలు, నాలుగు కార్లతో వాళ్ల వైభవం చూసి 'ఎంత అదృష్టవంతుడో' అని లోకం పొగుడుతుంది. అలా సర్వీసంతా తులతూగే ఐశ్వర్యాలు కూడబెడుతూ నిత్యనేరగాడిగా, నేరానికి శిక్ష లేకుండానే హాయిగా, శుభ్రంగా ముగిసిన బతుకులెన్నో! నెల జీతం కన్నా పదింతలు, అంతకన్నా ఎక్కువ పై సంపాదన లభించే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు లంచగొండిగా ముద్రపడకుండా సమాజంలో పై మెట్టు జీవితాన్ని సగర్వంగా గడుపుతుంటారు.

ఓ పెద్దమనిషి దారిలో కనబడిన తనకు తెలిసిన వారి కొడుకుని 'బాగున్నావా!' అని పలకరించాడు. మాటల సందర్బంగా అతడు 'హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడే జూబ్లీహిల్స్‌లో ఉంటున్నారు. ఇల్లు మూడు కోట్ల విలువ చేస్తుంది. పిల్లలు ఇంటర్నేషనల్ స్కూలులో చదువుతారు. మూడు కార్లున్నాయి.' అని గొప్పకుపోయాడు. పెద్దమనిషి అడ్డుపడి 'నీ జీతమెంత?' అడిగాడు. జవాబు చెబితే లెక్క తప్పుతుందని 'వస్తా! పనుంది' అని జారుకున్నాడతడు. ఇలాంటి పిట్టకథలు అందరికి తెలిసినవే. రాష్ట్రంలో వందకు పైగా రిజిస్ట్రేషన్ ఆఫీసులున్నాయి. ఏడాదికి ఒకరో, ఇద్దరో అందులోని ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖకి చిక్కుతారు. దాదాపు అదే సంఖ్యలో మున్సిపాలిటీలు ఉంటాయి. వందల కోట్ల విలువైన నిర్మాణ అనుమతుల కోసం కోట్ల రూపాయలతో సిబ్బంది చేతులు తడుస్తుంటాయి. ఎక్కడో చుక్క తెగిపడ్డట్లు అవినీతి ఆరోపణలు ఇలా వచ్చి అలా కనుమరుగవుతాయి. సుమారు ఆరు వందల మండల ఆఫీసులలో తహసీల్దార్‌లు, ఎంపీడీఓలు ఉంటారు. వారడిగినంత అర్పించుకోవడం తప్ప నోరిప్పితే ఏ చిక్కులు వస్తాయో అని భయపడేవారే ఎక్కువ. అధికారి, సిబ్బంది నెల జీతానికి మించిన హంగామా చేయడం వారి సుకృతంగా అందరూ అంగీకరిస్తారు.

ఏ శాఖ చూసినా అదేతీరు

పోలీసుల గురించి అందరికీ తెలిసిందే. కిందివాళ్లు చాటుగా చేతిలోకొచ్చిన నోటును జేబులో కుక్కుకుంటే, పైవాళ్లకు నెలవారీ ముడుపులు అందుతాయి. తగాదాల తీర్పులు భారీగా డబ్బులు తెచ్చి పెడతాయి. వీరిపై ఆరోపణలు చేయాలంటే చాలా ధైర్యసాహసాలుండాలి. కమర్షియల్ టాక్స్, రవాణా, కరెంటుతో పాటు ప్రభుత్వ ఇతర శాఖల ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ మారాజుల వలె బతికేస్తున్నారు. వేయిలో పది మంది రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే, తొమ్మిదివందల తొంబై మంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సర్వీసు బండి లాగేస్తున్నారు. మన రెవెన్యూ శాఖలో 90 శాతానికి మించి లంచాన్ని తీసుకునేవారుంటే, నేరారోపణలతో చిక్కినవారు గతేడాది 99 మంది మాత్రమేనని 'ఇండియన్ కరప్షన్ సర్వే' చెబుతోంది. ఈ సంస్థ యేటా ఈ లెక్కలు తీస్తుంది. లోకల్ సర్కిల్స్, ట్రాన్స్‌పరెంట్ ఇంటర్నేషనల్‌తో కలిసి ఆ సంస్థ కొన్ని లక్షల మందిని పలకరించి దేశంలోని లంచాల పరిస్థితిని బయటపెడుతోంది.

185 దేశాలలోని లంచగొండితనంలో భారత్ 85 వ స్థానంలో ఉంది. 2018లో 78వ చోట ఉన్న మనం నాలుగేళ్లలో 7 స్థానాలు ఎగబాకామన్నమాట. రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణ 5 వ స్థానంలో ఉంటే, ఏపీ 13 వ నంబర్ అందుకుంది. అవినీతిలో తొలి నాలుగు ర్యాంకులలో రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, యూపీ ఉన్నాయి. తెలంగాణాలో ఈ సర్వేకు స్పందించిన 5,500 మందిలో 67 శాతం మంది ప్రభుత్వ ఆఫీసులలో డబ్బులు ఇవ్వనిదే పని జరగడం లేదన్నారు. ఉచితంగానే పనులు చక్కబడ్డాయని చెప్పినవారు 11 శాతం. ఎక్కడోచోట లంచాలు ఇచ్చుకుంటున్నామని 56 శాతం మంది చెప్పారు. రెవెన్యూలో 85 శాతం, పోలీసులలో 79 శాతం, మున్సిపాలిటీలలో 75 శాతం, కరెంటులో 65 శాతం లంచావతారాలున్నారని ఆ సర్వే వెల్లడించింది. రెవెన్యూ, పోలీసు శాఖలలో 92 శాతం ఉద్యోగులు బహిరంగంగా లంచాలను డిమాండ్ చేస్తారని తేలింది. రాష్ట్ర సరిహద్దులలో ఉండే చెక్‌పోస్టుల ద్వారా ఏడాదికి రూ. 230 కోట్లు ఉద్యోగుల జేబులలోకి వెళతాయట. దీని పర్యవసానంగా రాష్ట్రం కొన్ని వేల కోట్లు రాబడి నష్టపోతోందని అనుకోవచ్చు.

నేరాలు ఘనం, కేసులు స్వల్పం

ఇలా వేల సంఖ్యలో అవినీతికి పాల్పడే ఉద్యోగులు ఉన్నారని సర్వేలు చెబుతుంటే ఏసీబీకి చిక్కినవారు ఏడాదికి రెండు వందల మంది కూడా ఉండరు. 2021లో 43 కేసులు నమోదు అయితే, ఈ ఏడాది జులై ఒకటి వరకు ఒక్క కేసు కూడా రికార్డు కాలేదని ఓ టీవీ చానల్ ప్రసారం చేసింది. తెలంగాణాలో 2018 లో 37, 2019లో 54, 2020లో 99 అవినీతి కేసులు వెలుగు చూశాయి. బ్రిటిష్ పాలన మనకు మిగిల్చిన దరిద్రాలలో ఇదొకటి. ఇక్కడ పనిచేసిన ఆంగ్లేయలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. వారిలో కొందరిని బ్రిటన్ సర్కారు వెనక్కి రప్పించుకొని కోర్టు బోనులో నిలబెట్టింది. మన దేశంలో లంచం తీసుకొన్న ఉద్యోగిని శిక్షించేందుకు ఐపీసీ-1860 మాత్రమే ఉండేది. లంచగొండిపై ఫిర్యాదు చేయాలంటే కోర్టులో కేసు వేయవలసి వచ్చేది. 1988లో వచ్చిన అవినీతి నిరోధక చట్టం ద్వారా జనం బాధలు చెప్పుకోవడానికి ఒక వేదిక ఏర్పడింది. ప్రభుత్వాలు ఏసీబీ సిబ్బంది, మౌలిక సదుపాయాల విషయంలో చిన్న చూపే చూస్తున్నాయి. అందులో డిప్యూటేషన్‌పై పని చేసే పోలీసు సిబ్బంది కూడా మాతృసంస్థకు వెళ్లేందుకే ఇష్టపడుతుంటారు. విడిగా ఏసీబీ కోసమే ఉద్యోగులను నియమించి సర్వీసు అంతా అందులోనే గడిపేలా ఉంటే ఫలితాలు వేరుగా ఉండే అవకాశముంది.

చిప్పకూడు తినేది కొందరే

లంచగొండి అధికారులకు 'ఏసీబీ'కి లోపాయకారీ ఒప్పందాలు ఉంటాయని అంటుంటారు. కోట్లాది రూపాయల విలువ చేసే ఇంటిలో ఉంటూ, వైభవంగా పిల్లల పెళ్లిళ్లు చేసినా ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే తప్ప ఏసీబీ కళ్లు తెరవదు. ట్రెజరీలో పింఛను తీసుకోవాలన్నా లంచం తప్పదు. ప్రభుత్వ ఆసుపత్రులలో సామాన్యుడు కాసులు సమర్పించాలి. వయోధికులు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం డబ్బులిస్తే డాక్టర్ మనిషిని చూడకుండానే ఆరోగ్యం భేష్ అని ధ్రువీకరిస్తాడు. లంచం ఇచ్చినా, ఉద్యోగి డబ్బులు అడిగినట్లు రుజువు చూపితే తప్ప అది అవినీతి కాదని ఈ మధ్య ఓ కోర్టులో తీర్పు వచ్చింది. ఈ సాకుతో ఎందరో తప్పించుకుంటున్నారు. నోట్లు పట్టుకొని చేతులు ఎర్రబడినా శిక్ష పడుతుందన్న గ్యారంటీ లేదు.

అక్రమ ఆస్తిని, ఉద్యోగాన్ని పోగొట్టుకొని, చిప్పకూడు తిన్నవారు ఒక్క శాతం కూడా ఉండరేమో! సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న చాలా అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. పర్యావరణ ధ్వంసం, మాదకద్రవ్యాల వాడకం, ఇంటర్నెట్ దుష్పరిణామాల గురించి అందరూ బెంగపడుతుంటారు. ఉద్యోగులలో అవినీతిని మాత్రం ప్రశ్నించే సామాజిక సంస్థలు, మనుషులు చాలా తక్కువ. మన రాష్ట్రంలో ప్రభుత్వం బ్యూరోక్రసీని ప్రశ్నించే స్థాయిలో లేదు. ప్రజాస్వామ్య దేశంలో విచ్చలవిడిగా అవినీతి కొనసాగితే అది నిరంకుశ పాలన కిందికే వస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రసంగంలో అన్నాడు. ఆ లెక్కన మనం నాయకుల ద్వారా కాకుండా ప్రభుత్వం పట్టులో లేని ఉద్యోగుల దయాదాక్షిణ్యాలపై బతుకుతున్నట్లే.

బి.నర్సన్

94401 28169


Next Story

Most Viewed