వారి అపహరణ దుర్మార్గమే కానీ..!

by Ravi |   (  Updated:2026-01-22 00:45:27  IST  )

ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ, ప్రపంచ దేశాలలో మానవ హక్కుల అవసరం గురించి భిన్నంగా ఆలోచనలు చేయడంలో అమెరికన్లు ముందు ఉంటారు అని ప్రపంచ దేశాల్లోని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం..

వారి అపహరణ దుర్మార్గమే కానీ..!
X

ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ, ప్రపంచ దేశాలలో మానవ హక్కుల అవసరం గురించి భిన్నంగా ఆలోచనలు చేయడంలో అమెరికన్లు ముందు ఉంటారు అని ప్రపంచ దేశాల్లోని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం..

దురహంకారపూరిత సామ్రాజ్య వాదమే!

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు, నిర్ణయాలను బట్టి చూస్తే పై అభిప్రాయం తప్పేనని చెప్పక తప్పదు. ఇక వెనుజులా అధ్యక్షుడు నికొలస్ ముదురోను అరెస్టు చేసి, దౌర్జన్యంగా తీసుకువెళ్లిన విషయంలో ట్రంప్ ప్రదర్శించిన దురహంకారం క్షమించరానిది. వెనుజులా ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశం. ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా లేక కమ్యూనిస్టు నియంత పరిపాలన ఉండాలా? అనే నిర్ణయం ఆ దేశ ప్రజల ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో అమెరికా పెత్తనం ఉండకూడదు. సైబర్ టెక్నాలజీని ప్రయోగించి, 36 మంది ప్రత్యేక అంగరక్షకులను మట్టుబెట్టి, మదురోను, ఆయన భార్యను బందీలను చేసి తన దేశానికి తరలించడం దురహంకారపూరిత సామ్రాజ్య వాదమే!

దేశం విడిచి పారిపోయారు..

మదురో నిరంకుశ పాలన వల్ల ఆ దేశంలోని మేధావులు, పత్రికా ప్రతినిధులు, ప్రజాస్వామ్య ఉద్యమకారులు అనేక మంది ప్రాణ భయంతో దేశం విడిచి పారిపోయారనే విషయం ఇక్కడ గుర్తించక తప్పదు. ప్రతిపక్ష నాయకురాలు మరియా మచాడో అమెరికా కనుసన్నల్లో నడుస్తున్న విషయం మరువలేనిది. అమెరికా అధికారుల సలహా మేరకే స్టాక్ హోం నోబెల్ కమిటీ మచాడోకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారనేది జగ మెరిగిన సత్యం.

నిరంకుశత్వంతో విసిగిపోయారా?

తమ దేశంపై పరాయి దేశం దాడి చేసి, తమ దేశ అధ్యక్షున్ని బందీని చేసి, తీసుకెళ్లినా ఆ దేశంలో అమెరికాకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టలేదనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తే అనేక అంశాలు మన కళ్ల ముందు కనపడతాయి. మదురో నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వ నిరంకుశ పాలనతో ప్రజలు విసిగిపోయారనే విషయం స్పష్టమైంది. దేశ భవిష్యత్తును గురించి ఆలోచించే ప్రజా సమూహం ఆ దేశంలో లేదని అనిపిస్తుంది. ప్రతిపక్ష నాయకులు, కొంతమంది సైనిక అధికారులు, సివిల్ సర్వీస్ అధికారులు అమెరికా పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్న విషయం తేటతెల్లమైంది.

కమ్యూనిస్టు పాలనలో అవి తప్పవు..

మదురో నేతృత్వంలో అమెరికాకు అక్రమ డ్రగ్స్ వ్యాపారం జరుగుతుందని ట్రంప్ ఆరోపణల్లో కొంత వాస్తవం లేకపోలేదు. డ్రగ్స్ అక్రమ వ్యాపారాలు, గుండాగిరి పరిపాలన, ప్రజాస్వామ్య వ్యతిరేక ఉద్యమాల అణచివేత కమ్యూనిస్టు పరిపాలన రాజ్యాలలో సర్వసాధారణమైన విషయం. మరొక ఆసక్తికరమైన విషయం. అమెరికా వెనుజులాపై దాడిచేసిన ఘటనపై స్వదేశంలో గానీ, ప్రపంచంలో మరే దేశంలో గానీ నిరసనలు కనిపించలేదు.. వినిపించలేదు. కానీ భారతదేశంలో కమ్యూ నిస్టులు మాత్రం తమ నిరసన గళాన్ని గట్టిగానే వినిపించారు. అందుకు కారణం లేకపోలేదు.. మదురో పదవీచ్యుడైతే వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుంది. నిరంకుశ పరిపాలనలో ఉన్న ఒక కమ్యూనిస్టు దేశం ప్రజాస్వామ్య పంథాలోకి మారిపోవడం మన దేశ కమ్యూనిస్టులకు మింగుడు పడని విషయం.

ఎందుకు అంత బాధ?

1947 వరకు ఈ దేశంలో భాగంగా ఉండి, మతం ఆధారంగా ఈ దేశం నుంచి విడిపోయిన బాంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న హింసపై కనీసం ఖండన కూడా చేయని మన దేశ కమ్యూనిస్టులకు పాలస్తీనా విషయం, వెనుజులా అధ్యక్షుని బంధించే విషయం ఎందుకంత బాధను కలిగిస్తుంది? భారత దేశంలో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గడానికి, జాతీయ వాదులైన హిందుత్వవాదులకు బలం పెరగడానికి కమ్యూనిస్టుల ఇలాంటి ఆలోచనలే కారణమని చెప్పక తప్పదు.

- ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

94417 37877

Next Story