- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముద్రగడ.. ఒక ఉద్యమ యుగానికి ముగింపు!
కాపు ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం, రిజర్వేషన్ ఉద్యమంలో ఆయన పాత్ర, తుని ఘటన ప్రభావం, చివరి రాజకీయ దశపై సమగ్ర విశ్లేషణ.

రాజకీయాల్లో పదవులు సంపాదించిన నాయకులు ఎందరో ఉంటారు. కానీ ఒక సామాజిక వర్గం ఆత్మగౌరవానికి ప్రతీకగా మారి, ఉద్యమంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన నాయకులు చాలా అరుదు.. అలాంటి అరుదైన నాయకుల్లో ముద్రగడ పద్మనాభం ఒకరు.. ఆయన మరణంతో కేవలం ఒక రాజకీయ నాయకుడి ప్రస్థానం మాత్రమే కాదు... ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసిన కాపు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం ముగిసింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు నాయకులు ఎందరో ఉన్నా, కాపు సమాజాన్ని ఒకే నినాదం కింద రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించిన నాయకుల్లో ముద్రగడ పద్మనాభం ముందు వరుసలో నిలిచారు. ఆయన కాంగ్రెస్, తెలుగుదేశం వంటి ప్రధాన పార్టీల్లో పనిచేసి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. అయితే పదవుల కంటే తన అభిప్రాయాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాలతో విభేదిస్తే బహిరంగంగానే చెప్పేవారు. ఆ నిష్కాపట్యమే ఆయనకు అభిమానులను సంపాదించి పెట్టగా, అదే రాజకీయంగా కొన్ని అవకాశాలను దూరం చేసిందని విశ్లే షకులు భావిస్తుంటారు.
కాపు ఉద్యమానికి కొత్త దిశ..
ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ డిమాండ్‌కు దశాబ్దాల చరిత్ర ఉన్నా, దాన్ని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మార్చిన నాయకుడు ముద్రగడ పద్మనాభం. గ్రామం నుంచి నగరం వరకు కాపు సమాజంలో ఐక్యత, ఆత్మగౌరవ భావన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. సభలు, నిరాహార దీక్షలు, పాదయాత్రలు, నిరసనలు.. ప్రతి ప్రజాస్వామ్య మార్గాన్ని ఉద్యమ సాధనంగా మలిచారు. ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా దీక్షలను విరమిం చలేదు. పోలీసు నిర్బంధాలు, కేసులు, అరెస్టులు కూడా ఆయన పట్టుదలను దెబ్బతీయలేకపోయాయి. కుటుంబ సభ్యులను సైతం ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా తన పోరాటానికి నైతిక బలం చేకూర్చారు. ఇదే ప్రజల్లో ఆయనకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చింది.
తుని ఘటన... మలుపు తిరిగిన ఉద్యమం!
అయితే, ప్రతి ఉద్యమానికీ ఒక మలుపు ఉంటుంది. కాపు ఉద్యమంలో ఆ మలుపు తుని ఘటనగా నిలిచింది. ఆందోళన హింసాత్మకంగా మారడం, రైల్వే ఆస్తుల ధ్వంసం వంటి పరిణామాలతో ఉద్యమ లక్ష్యం కంటే చట్ట వ్యవస్థ, హింసపై చర్చ ఎక్కువైంది. దీంతో ఉద్యమం మునుపటి ఊపును కొనసాగించలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. ఈ పరిణామాలు ముద్రగడపై కూడా ప్రభావం చూపాయి. కాపులకు రిజర్వేషన్ పూర్తిస్థాయిలో అమలుకాకపోయినా, ఆ డిమాండ్‌ను రాష్ట్ర రాజకీయాల కేంద్ర చర్చగా నిలబెట్టడంలో ఆయన పాత్ర విశేషం. నిజానికి ఒక సామాజిక అంశాన్ని ప్రజా చర్చలో నిలబెట్టడం కూడా ఉద్యమ నాయకుడి ముఖ్యమైన విజయమే.
చివరి దశలో మారిన రాజకీయ చిత్రం!
జీవితాంతానికి దగ్గరలో ముద్రగడ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు చర్చకు దారితీశాయి. ఒకప్పుడు అన్ని పార్టీలను విమర్శించిన ఆయన, తర్వాత ఒక రాజకీయ పక్షానికి చేరువ య్యారనే అభిప్రాయం బలపడింది. దీంతో కాపు సమాజంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆయనను ఉద్యమ నాయకుడిగా గౌరవించిన వారిలో కొందరు ఆ నిర్ణయాలను వ్యతిరేకించగా, మరికొందరు ఉద్యమం తర్వాత రాజకీయ వేదిక అవసరమేనని సమర్థించారు. అయితే ఆయన చివరి రాజకీయ అధ్యాయం, తొలి ఉద్యమ దశ పొందినంత ఏక గ్రీవ ప్రశంసలను అందుకోలేదనేది వాస్తవం. అది వ్యక్తిగత నిర్ణయాల ఫలితమా? లేక మారుతున్న రాజకీయాల ప్రభావమా? అన్నది చరిత్రే తేల్చాలి.
మడమ తిప్పని మనస్తత్వం..
ముద్రగడ వ్యక్తిత్వంలో అత్యంత బలమైన లక్షణం ఆయన పట్టుదల. రాజకీయంగా అది ఎప్పుడూ ప్రయోజనం చేకూర్చకపోయినా, ఆయన వ్యక్తిత్వానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. తాను నమ్మిన దానికోసం చివరి వరకు నిల బడ్డారు. రాజకీయ లెక్కల కోసం మాట మార్చే నాయకుడు కాదనే అభిప్రాయం ఆయనపై బలంగా ఉండేది. అందుకే తీవ్రమైన విమర్శలు ఎదురైనా, ఆయన వ్యక్తిగత నిజాయితీని ప్రశ్నించిన వారు చాలా తక్కువ. ఆయన మరణంతో కాపు ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. ఉద్యమాలు నాయకులను సృష్టిస్తాయి.. నాయకులు ఉద్యమాలకు దిశ చూపుతారు. ముద్రగడ పద్మనాభం ఈ రెండింటికీ నిదర్శనం. పదవులు, అధికారాలు శాశ్వతం కాకపోయినా, ఒక సామాజిక వర్గం ఆత్మగౌరవ పోరాటంలో తన ముద్ర వేసిన నాయకుడిగా ఆయన పేరు నిలిచిపోతుంది. ఆయనను అభిమానించినా, విమర్శించినా ఒక విషయాన్ని మాత్రం తిరస్కరించడం కష్టం. కాపు ఉద్యమ చరిత్రను ఎప్పుడైనా తిరగేస్తే ముద్రగడ పేరు తప్పక కని పిస్తుంది. అందుకే ఆయన మరణం కేవలం ఒక నాయకుడి మరణం మాత్రమే కాదు.. ఒక ఉద్యమ యుగానికి ముగింపు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి.
- చెన్ను పెద్దిరాజు,
70131 22173






