- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
సామాజిక ఉద్యమాల దిక్సూచి
రిజర్వేషన్ ఫలాలు అట్టడుగున ఉన్నవారికి దక్కినప్పుడే వాటి ప్రయోజనం నెరవేరుతుందని, అందుకే ఎవరి జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్ ఫలితాలు అందాలని, అప్పుడే సామాజిక న్యాయ భావనకు అర్థముంటుందని అంబేద్కర్ చెప్పారు. అంబేద్కర్ భావజాలాన్ని తూ.చా తప్పకుండా పుణికి పుచ్చుకుంది ఎమ్మార్పీఎస్.
అవమానాలు నిత్యం జీవితంలో భాగమై... దక్కాల్సిన అవకాశాలు రక్షించుకోలేని స్థితిలో ఉన్న మాదిగ, మాదిగ ఉపకులాల పక్షాన పోరాటానికై, ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల నష్టపోయిన ఉపకులాల వారికి విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాలలో రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో కేవలం 20 మంది యువకులతో ఏర్పడిన సంస్థ ఎమ్మార్పీఎస్. మూడేళ్లలోపే ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి 1997 నాటికి ఎస్సీ వర్గీకరణను టీడీపీ ప్రభుత్వం అమలు చేసే విధంగా పోరాడి సాధించింది. దీనిని కొందరు స్వార్ధపరులు హైకోర్టు ద్వారా అడ్డుకున్నారు. మరోసారి వర్గీకరణకై మలివిడత పోరాటం చేయడంతో 1999 నవంబర్ నాటికి 2వ సారి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. దాదాపు 5 సంవత్సరాలు వర్గీకరణ అమలు జరిగిన కాలంలోనే మాదిగలకు, ఉపకులాలకు విద్యా, ఉద్యోగ రంగాలలో వేలాది మాదిగ నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. కానీ మరోసారి సుప్రీంకోర్టులో కేసు వేసి వర్గీకరణను అడ్డుకున్నారు కొందరు స్వార్థపరులు. అందుకే ఆనాటి నుండి పార్లమెంట్‌లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం 2004 నుంచి నేటి వరకు నిత్యం ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తూనే ఉంది. ఇది మొత్తంగా 27 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం. ఈ ప్రస్థానంలో సామాజిక అంతరాలపై ఎన్నో పోరాటాలు చేసింది ఎమ్మార్పీఎస్.
ఈ దేశంలో సామాజిక న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరూ వర్గీకరణకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వర్గీకరణ సామాజిక న్యాయాన్ని కోరే తొలిమెట్టు. వర్గీకరణ డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచన. సమైక్యత పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి కుట్రలు ఏ విధంగా జరిగాయో అదే పద్ధతిలో దళితుల ఐక్యత పేరుతో వర్గీకరణను అడ్డుకునే కుట్రలు జరిగాయి.... జరుగుతూనే ఉన్నాయి. గతంలోని ప్రభుత్వాలు వర్గీకరణ చేస్తామని హామీనిచ్చి మోసం చేయగా, బీజేపీ ఇదే హామీనిచ్చి అధికారంలోకి వచ్చింది. అందుకే ఇచ్చిన హామీని ఢిల్లీ వేదికగా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి గుర్తుచేయడానికి నూతన ఉద్యమ పంథాతో పోరాటాలకు ఎమ్మార్పీఎస్ సిద్ధపడింది. అప్పటి నుండి ఢిల్లీ ఎమ్మార్పీఎస్ ఉద్యమ కేంద్రంగా మారింది. ఈ కృషి ఫలితంగానే మాదిగ విశ్వరూప సభకు నరేంద్రమోడీ వచ్చి వర్గీకరణకు చట్టబద్దత కల్పిస్తామని మరోసారి హామీనిచ్చారు. అందులో భాగంగానే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఓ కమిటీని ఏర్పరచారు.
నిజానికి ఎమ్మార్పీఎస్ పుట్టకముందు నుంచే మాదిగ, ఇతర ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని 1982లో అప్పటి ఉదయగిరి యంఎల్ఏ, మాజీ భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రస్తావించడం జరిగింది. ఎమ్మార్పీస్ ప్రధాన లక్ష్యం అయినటువంటి ఎస్సీలను వర్గీకరించి ఎ,బి,సి,డి లుగా చేయాలన్నదే. అంటే ఎస్సీలలో ఎవరు వెనుకబాటుతనంలో ఉన్నారో, వారికి ముందుగా రిజర్వేషన్ ఫలాలు అందాలన్నది ప్రాథమిక లక్ష్యం. ఎస్సీ వర్గీకరణ కోసం బీజేపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పడిన కమిషన్ త్వరగా రిపోర్టు ఇవ్వాలని తద్వారా, ఏ,బీ,సీ,డీ వర్గీకరణపై పార్లమెంటులో చట్టం చేసి ఈ న్యాయమైన డిమాండును పరిష్కరించి సామాజిక న్యాయాన్ని కేంద్రప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నాను.
-కట్ట ప్రశాంత్ కుమార్ మాదిగ
ఎమ్మార్పీఎస్ కార్యకర్త
93932 57697
- Tags
- MRPS